Sudha Murty Stops Buying Sarees: రాజ్యసభ ఎంపీ సుధామూర్తి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం పంచుకున్నారు. 30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనుక్కోలేదని వెల్లడించారు. అందుకు కారణమేంటో కూడా వివరించారు. ఓ సారి కాశీకి వెళ్లాలని, ఆ ట్రిప్ తరవాతే ఎప్పుడూ చీర కొనుక్కోవద్దని నిర్ణయించుకున్నానని చెప్పారు. కాశీకి వెళ్లిన వాళ్లు అక్కడ ఏదో ఒకటి విడిచి పెట్టి రావాలని అంటారు. మనకు ఎంతో ఇష్టమైనవి అక్కడ వదులుకుంటే మంచి జరుగుతుందనీ విశ్వసిస్తారు. సుధామూర్తికి షాపింగ్ అంటే చాలా ఇష్టమట. అందుకే కాశీకి వెళ్లిన "ఇకపై షాపింగ్ చేయను" అని నిర్ణయించుకున్నారట. అలా ఆ అలవాటుని అక్కడే వదిలేశారు. 30 ఏళ్ల క్రితం ఈ సంఘటన జరిగిందని, అప్పటి నుంచి ఎప్పుడూ షాపింగ్‌కి వెళ్లి చీర కొనుక్కున్నదే లేదని చెప్పారు సుధామూర్తి. ఉన్నంతలో ఎలా బతకాలో ముందు తరాల వాళ్లు నేర్పారని, వాటిని ఈ తరాలూ కొనసాగించాలని కోరారు.
"ఆరేళ్ల క్రితం మా అమ్మ చనిపోయింది. అప్పుడు ఆమె కబోర్డ్‌ని ఖాళీ చేయడానికి నాకు అరగంట కూడా పట్టలేదు. ఆమెకి కేవలం 8-10 చీరలే ఉన్నాయి. 32 ఏళ్ల క్రితం మా నాయనమ్మ చనిపోయింది. ఆమెకి నాలుగు చీరలే ఉన్నాయి. అయినా సరే వాళ్లు ఏమీ లేదని బాధ పడలేదు. సంతోషంగా జీవించారు. అదే వాళ్ల నుంచి నేను వారసత్వంగా తీసుకున్నాను. నిరాడంబరంగా జీవించాలని నిర్ణయించుకున్నాను"
- సుధామూర్తి, రాజ్యసభ ఎంపీ
దాదాపు 20 ఏళ్లుగా బంధువులు, స్నేహితులు గిఫ్ట్‌గా ఇచ్చిన చీరలనే కట్టుకుంటున్నారు సుధామూర్తి. అయితే వాటన్నింటిలోనూ ఇన్‌ఫోసిస్ ఫౌండేషన్‌లో కొంత మంది మహిళలు తన కోసం ప్రత్యేకంగా కుట్టించి ఇచ్చిన చీరలంటే మాత్రం ఎంతో ఇష్టమని చెప్పారు. తన తోబుట్టువులు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇస్తారని, ఇకపై ఇవ్వద్దని చెప్పానని వెల్లడించారు.
"దాదాపు 50 ఏళ్లుగా నేను చీరలు కడుతూనే ఉన్నాను. ప్రతిసారీ వాటిని నేనే శుభ్రం చేస్తాను. ఇస్త్రీ చేసుకుంటాను. ఆ తరవాత వాటిని పక్కన పెట్టేస్తాను. నేనెప్పుడూ చీరలు మరీ కిందకు కట్టను. అలా చేస్తే ఫ్లోర్‌కి తాకి అవి మురికి అయిపోతాయి"
- సుధామూర్తి, రాజ్యసభ ఎంపీ
ఇటీవలే రాజ్యసభలో తొలిసారి ప్రసంగించారు. సర్వైకల్ క్యాన్సర్ గురించి ప్రస్తావించారు. 9-14 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికలకు కచ్చితంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని సూచించారు. మిగతా దేశాల్లో ఇప్పటికే ఇది అందుబాటులో ఉందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపించి వీటిని పెద్ద ఎత్తున అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ధర రూ.1,400 వరకూ ఉందని ప్రభుత్వం చొరవ తీసుకుని రూ.700కి ధరను తగ్గించాలని కోరారు. ఇంత జనాభా ఉన్న భారత్‌లో ఈ వ్యాక్సిన్‌లు అవసరం ఎంతో ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రసంగంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. చాలా గొప్పగా మాట్లాడారని కితాబిచ్చారు.
Also Read: UK Election Results 2024: యూకే కొత్త ప్రధానిగా స్టార్మర్ ఖాయమైనట్టే, ఒక్క విజయంతో అరుదైన రికార్డు