Sudan Crisis:
పెరుగుతున్న ఉద్రిక్తత
సూడాన్‌లో ఆర్మీ, పారా మిలిటరీ బలగాల మధ్య యుద్ధం ఇంకా ఆగలేదు. రోజురోజుకీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అక్కడి భారతీయులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని రోజులు గడుపుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వాళ్లకు భరోసా కల్పించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అల్లర్లలో జోక్యం చేసుకోవద్దని సూచించింది. ఇప్పుడు మరోసారి కీలక సూచనలు చేసింది. సూడాన్ రాజధాని ఖార్టౌమ్‌లోని ఇండియన్ ఎంబసీ వైపు పొరపాటను కూడా వెళ్లొద్దని హెచ్చరించింది. అక్కడి పరిస్థితులు అస్సలు బాగోలేవని వెల్లడించింది. ఎంబసీ కార్యాలయం తెరిచే ఉన్నప్పటికీ సిబ్బంది ఎవరూ లేరు. సూడాన్ ఆర్మీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య ఇక్కడే యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. అందుకే ఆ పరిసరాల్లోకి వెళ్లొద్దని కేంద్రం భారతీయులకు సూచించింది.
"సూడాన్‌లోని భారతీయులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నాం. ఎక్కడికి వెళ్లకూడదో కూడా గౌడ్ చేస్తున్నాం. అక్కడి ఇండియన్ ఎంబసీ తెరిచే ఉంది. కానీ అక్కడికి వెళ్లే పరిస్థితులు లేవు. అక్కడే యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. అక్కడ ఎవరూ లేరు"
- అరిందం బగ్చి, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి
గత శనివారం నుంచి మొదలైన యుద్ధంలో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారు. తిండి తిప్పలు లేకుండా భయంభయంగా రోజులు గడుపుతున్నారు.
"సూడాన్‌లో ఎంత మంది భారతీయులు చిక్కుకున్నారో మాకు ఓ లెక్క ఉంది. సెక్యూరిటీ కారణాల వల్ల ఆ సంఖ్యను మేం వెల్లడించలేం. వాళ్లు ఎక్కడున్నారో తెలిసినప్పటికీ అది కూడా చెప్పలేం. సోషల్ మీడియా పోస్ట్‌లను చూసి కొంత మంది భారతీయులతో ఇప్పటికే మాట్లాడాం. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం"
- అరిందం బగ్చి, భారత విదేశాంగ శాఖ ప్రతినిధి
భారత ప్రభుత్వం అక్కడి ఇండియన్స్‌కి రక్షణ కల్పించే ఏర్పాట్లు చేస్తోంది. యూఏఈ, సౌదీ అరేబియాతో ఇప్పటికే చర్చలు జరిపింది. ఈ రెండు దేశాలూ భారతీయులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చాయి. అటు అమెరికా, బ్రిటన్‌తో చర్చలు కొనసాగుతున్నాయి. సౌదీ, UAE మాత్రం భారత్‌కు మద్దతుగా నిలిచాయి. సూడాన్‌లోని ఇండియన్ ఎంబసీ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. భారతీయులెవరూ బయటకు రావద్దని సూచించింది. శాంతియుత వాతావరణానికి సహకరించాలని కోరింది. ఇప్పటికే ఈ సమస్య పరిష్కారానికి ఢిల్లీలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.
Also Read: Flash Light Over Kyiv: ఉన్నట్టుండి ఆకాశంలో మెరుపు, ఏలియన్స్ వచ్చాయా - వైరల్ వీడియో