Pithani Satyanarayana On BJP : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను అడ్డుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపించారు. బీజేపీ ముందు ఒక రాజకీయం, వెనక ఒక రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. పవన్ టీడీపీతో కలవాలని చూస్తున్నారని, అలా కలవకుండా ఆయన్ను బీజేపీ భయపెడుతోందని ఆరోపించారు. పవన్ కు తాళం వేయాలని ట్రై చేస్తుందన్నారు. బీజేపీ ద్వంద్వ వైఖరి మానుకోవాలని విమర్శించారు. బీజేపీ ఈ రాష్ట్రానికి, దేశానికి అవసరమా అని ప్రజలు ప్రశ్నించే రోజు తొందర్లోనే రాబోతుందన్నారు. ఏపీలో బీజేపీ అధికారపక్షమా లేక ప్రతిపక్షమా స్పష్టం చేయాలన్నారు. సీపీఐ, సీపీఎం ఒక క్లారిటీతో ముందుకెళ్తున్నాయని, బీజేపీకి ఆ క్లారిటీ లేదన్నారు. ఏపీలో బీజేపీ తప్పుడు రాజకీయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షంలా నటిస్తూ... దిల్లీలో జగన్ కు తాజేదారులా బీజేపీ వ్యవహరిస్తుందని మాజీ మంత్రి పితాని విమర్శలు చేశారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని ప్రతిపాదించిన బీజేపీ.. ఇప్పుడు వ్యతిరేకిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  


ఎంత కాలం అడ్డుకుంటారో చూస్తాం


బీజేపీ నాయకులు సీఎం జగన్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరోపించారు. టీడీపీతో కలిసేందుకు ముందు రాకుండా పవన్ కల్యాణ్ అడ్డుకునేందుకు బీజేపీ ట్రై చేస్తుందని ఆరోపించారు. జనసేన టీడీపీతోనే ఉందని, బీజేపీ వైసీపీకి తాబేదారుల్లా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. స్వార్థ రాజకీయాలు నడపడం, లోపల ఒకలా, బయట వేరేలా రాజకీయాలు చేయొద్దని బీజేపీకి హితవు పలికారు. పొత్తులపై రాజకీయంగా జనసేనకు క్లారిటీ లేకుండా  తాళాలు వేస్తున్నారని ఆరోపించారు.  టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోకుండా బీజేపీ ఎంతకాలం అడ్డుకుంటుందో తాము చూస్తామన్నారు. ఏపీలో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ తెర వెనుక సీఎం జగన్ కు మద్దతు ఇస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో జనసేన, బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతున్నా, జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టే బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు.  


కర్ణాటకలో పవన్ ప్రచారం లేనట్లేనా ? 


జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్ణాటకలో బీజేపీ తరపున ప్రచారం చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. పవన్ ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ఈ మేరకు అంగీకారం తెలిపారని .. సమన్వయం చేసుకునే బాధ్యతను ఎంపీ, బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్యకు అప్పగించారని అనుకున్నారు. అయితే నామినేషన్ల గడువు ముగిసినా పవన్ కల్యాణ్ ప్రచారం గురించి క్లారిటీ రాలేదు. తేజస్వి సూర్య సంప్రదిస్తున్నా పవన్ కల్యాణ్ స్పందించడం లేదని చెబుతున్నారు. బీజేపీ కి ప్రచారం చేసే విషయంలో పవన్  
కల్యాణ్ ఆసక్తిగా లేరని బీజేపీ వర్గాలు అంచనాకు  వస్తున్నాయి.  బీజేపీ తరపున ప్రచారం చేయడానికి పవన్ కల్యాణ్ ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ .. ఏపీలో రాజకీయ పరిణామాల విషయంలో తమ ప్రతిపాదనలు పట్టించుకోనందున పవన్ బెట్టు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.  వైసీపీ విముక్త ఏపీ లక్ష్యమని.. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీకి సహకరించడం ఆపేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే బీజేపీ మాత్రం ఏపీ ప్రభుత్వానికి..సీఎం జగన్ కు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఇస్తూ వస్తోంది. ఇలాంటి పరిణామాలతో బీజేపీకి వైసీపీనే దగ్గర అని.. ఇక తాను ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా పవన్ కల్యాణ్ కర్ణాటక లో  ప్రచారంపై ప్రతిష్ఠంభన  ఏర్పడింది.