ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లో అప్పుడే నేతల మధ్య టికెట్ వార్ రాజుకుంటోంది. ఇంకా ఎన్నికలకు 6 నెలలు సమయం ఉంది. అయితే నియోజకవర్గాల్లో నేతలు తమకంటే టికెట్ తమకే వస్తుందని చెప్పుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలున్నాయి. గత కొంత కాలం నుంచి ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు క్యాడర్ తో టచ్ లో ఉంటున్నారు. ఎవరికి వారే టికెట్ తమకే వస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ లో వర్గ పోరు మొదలైంది.
ప్రధానంగా నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఎల్లారెడ్డి, జుక్కల్ , బాన్సువాడ ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల్లో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. నిజామాబాద్ అర్బన్ విషయానికి వస్తే గత ఎన్నికల్లో అర్బన్ టిెకెట్ తాహేర్ బిన్ హందాన్ వచ్చింది. తాహెర్ బిన్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ సారి కూడా టికెట్ తనకే వస్తుందని తాహెర్ అనుచురులు చెప్పుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ కేశ వేణు సైతం టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఈ సారి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో కేశవేణు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన మాజీ పీసీసీ అధ్యక్షుడు డీఎస్ తనయుడు సంజయ్ కూడా అర్బన్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న లిస్టులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సైతం అర్బన్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి డాక్టర్ భూపతి రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి భూపతి రెడ్డికే టికెట్ వరిస్తుందన్న ఆశాభావంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రూరల్ నియోజకవర్గానికి చెందిన మరో నేత నగేష్ రెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. నగేష్ రెడ్డి కూడా చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నారు. ఈయన కాంగ్రెస్ హయాంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. ఈ ఇద్దరు నేతలు పోటాపోటీగా రూరల్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. టికెట్ నాకంటే నాకే వస్తుందన్న ధీమాలో ఆ ఇద్దరు నేతలు ఉన్నట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రూరల్ లో పాదయాత్ర చేస్తున్న సమయంలోనూ ఈ ఇద్దరు నేతలు ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహించారు.
బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ లోనూ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. గత ఎన్నికల్లో బాల్కొండ నుంచి ఈరవత్రి అనిల్ కూమార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి కూడా బాల్కొండ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారిలో అనిల్ ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ ప్రభుత్వంలో అనిల్ విప్ గా వ్యవహరించారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి కూడా బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ రేస్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఆరెంజ్ ట్రావెల్స్ ఓనర్ సునీల్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరితే టికెట్ ఆశించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సునీల్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
ఇక ఎల్లారెడ్డి నియోజకవర్గంపై ఇటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ కొడుకు ఇలియాస్ కూడా కన్నేశారన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన జాజుల సురేంధర్ అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఈ నియోజకవర్గంపై సుభాష్ రెడ్డి సైతం టికేట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జహిరాబాద్ ఎంపీగా పోటీ చేసిన మధన్ మోహన్ రావు తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. మదన్ మోహన్ రావు సైతం ఎల్లారెడ్డి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇటు షబ్బీర్ అలీకి, మదన్ మోహన్ రావుకు వర్గపోరు నడుస్తోంది. ఈ నియోజకవర్గంపై ముగ్గురు నేతలు కన్నేశారు. ఈ ముగ్గురు తమకంటే తమకే టికెట్ వస్తుందన్న ఆశాభావంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక బాన్సువాడ నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కాసుల బాలరాజు పోటీ చేసి ప్రస్తుత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మీద ఓడిపోయారు. ఇప్పటికి నాలుగు సార్లు కాసుల బాలరాజు బాన్సువాడ బరిలో దిగి నాలుగు ఓటమి పాలయ్యారు. ఈ సారి కూడా కాంగ్రెస్ టికెట్ తనకే అంటూ ధీమాలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఓ ఎన్నారై సైతం బాన్సువాడ కాంగ్రెస్ టికెట్ మీద కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు వచ్చే సమయానికి తెరపైకి కాంగ్రెస్ నుంచి కొత్త వ్యక్తిని బరిలో దింపే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం కూడా జరుగుతోంది.
జుక్కల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సౌధాగర్ గంగారం పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి కూడా టికెట్ తనకే వస్తుందని ఆయన అనుచురు చెప్పుకుంటున్నారు. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు సార్లు డీసీసీ అధ్యక్షుడిగా చేసిన గడుగు గంగాధర్ గత కొంత కాలంగా జుక్కల్ నియోజకవర్గంలో ఉంటూ తన ప్రాబల్యాన్ని చాటుకుంటున్నారు. ఈ సారి టికెట్ తనకే వస్తుందన్న గట్టి నమ్మకంలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. గంగారాం కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. నాలుగు సార్లు జుక్కల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఇద్దరు నాయకులు ఎవరికి వారే పోటా పోటీగా జుక్కల్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టికెట్ తమకంటే తమకే వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి లిస్ట్ పెరుగుతుండటంతో క్యాడర్ కన్ఫ్యూజ్ లో పడుతున్నారు. ఎవరి పిలిస్తే వెళ్లాలి. ఎవరికి టికెట్ వస్తుందో అన్న మీమాంసలో పడుతున్నారు. ఆలూ లేదు చూలూ లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్లు తయారైంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పరిస్థితి అంటూ క్యాడర్ వాపోతున్నారు.