Telangana Congress Politics : కాంగ్రెస్ ను కాంగ్రెస్సే ఓడించుకుంటుంది అనే సెటైర్ ఆ పార్టీపై ఉంటుంది. ఎంతకు దిగజారిపోయినా ఆ సెటైర్ ఎప్పటికప్పుడు నిజం అవుతూనే ఉంది. ముందు ఎన్నికల్లో గెలిస్తే ఆ తర్వాత పదవులు వస్తాయి. అప్పుడు పదవుల కోసం కొట్లాడుకోవచ్చు. అసలు ఇంకా ఎన్నికల్లో గెలవకుండానే.. గెలుస్తారన్న పెద్దగా ఆశలు లేకుండానే పదవుల కోసం కొట్లాడటం కాంగ్రెస్ నేతలకే చెల్లింది. నేనే సీఎం అవుతా అని రేవంత్ రెడ్డి పరోక్షంగా చెబుతూంటే.. నాకేం తక్కువ భట్టి విక్రమార్క ప్రశ్నిస్తున్నారు. వారిద్దరేనా ఇంకా బయటపడని చాలా మంది సీనియర్లు.. తాము మాత్రం తీసిపోయామా అని అనుకుంటూ ఉంటారు. వీరంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో మరో విధంగా చర్చకు పెడుతున్నారు.
సీఎం అయిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం తెస్తానంటున్న భట్టి విక్రమార్క
మల్లు భట్టి విక్రమార్క సీఎల్పీ లీడర్. అధికారికంగా ఆయనకు ఆ పదవి లేదు. ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్‌లో చేరిపిపోవడంతో మిగిలి ఉన్న నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లీడర్ ఆయన. ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర ద్వారా తాను మరో వైఎస్‌ను అయ్యానని ఆయన ఊహించుకుంటున్నారు. సీఎం పదవి పొందడానికి తనకేం తక్కువని ఆయన ప్రశ్నిస్తున్నారు. హైకమాండ్ చాన్సిస్తే ముఖ్యమంత్రిని అవుతానని చెబుతున్నారు. ఇందిరమ్మరాజ్యం తెస్తానని శపథం చేస్తున్నారు. మల్లు భట్టి విక్రమార్క ప్రకటనలు కాంగ్రెస్‌లో ఖచ్చితంగా కాక రేపేవే. అందులో సందేహం లేదు. ఎందకంటే కాంగ్రెస్ చాలా మంది నేతలు తమది కూడా సీఎం రేంజ్ అని అనుకుంటూ ఉంటారు. అలాంటి భట్టి విక్రమార్క బహిరంగంగా చెబితే ఊరుకుంటారా ?
పరోక్షంగా కాంగ్రెస్ గెలిస్తే తనకే సీఎం పదవి అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి !
టీ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు. సహజంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడ్ని సీఎంను చేస్తారు. ఎన్నికల్లో కష్టపడిన విధానం.. ప్రజల్లో ఉన్న పలుకుబడి వంటివి లెక్కలేసుకుని ఈ పదవిని హైకమాండ్ కేటాయిస్తుంది. ఇవన్నీ తనకు పుష్కలంగా ఉన్నాయని .. కాంగ్రెస్ పార్టీని తాను గెలిపిస్తానని తానే సీఎం అవుతానని రేవంత్ రెడ్డి నమ్మకంతో ఉన్నారు. అయితే సీఎం పదవిగురించి ఆయన ఎక్కడా బహిరంగంగా చెప్పడం లేదు. మాట్లాడటం లేదు. మీడియా చిట్ చాట్‌లలో తన మనసులో మాట పరోక్షంగా చెబుతున్నారు. ప్రస్తుతానికి తన దృష్టి అంతా కాంగ్రెస్ ను గెలిపించడంపైనే ఉందని చెబుతున్నారు.
రేవంత్ కు సీఎం పదవి దక్కకుండా సీనియర్ల రాజకీయాలు !
రేవంత్ రెడ్డి మాస్ లీడర్. టీ పీసీసీ చీఫ్ గా కూడా ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆయనే సీఎం అవుతారన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఆయనను సీఎం కాకుండా చేయడానికి సీనియర్లు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దళిత సీఎం అనే వాదన కూడా తీసుకు వచ్చారు. అంతర్గత రాజకీయాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తామంతా కష్టపడి ఆయనను ఎందుకు సీఎం చేయాలని కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేసి పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఆయన సోదరుడు మాత్రం కాంగ్రెస్ లో ఉన్నారు కానీ ఆయనదీ అదే అభిప్రాయం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ప్రజల్లో చులకన అవుతున్న కాంగ్రెస్ !
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి. అక్కడి నేతలు సీఎం పదవి కోసం పోటీ పడటం సహజమే. కానీ తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని ఏ ఒక్క సర్వే చెప్పడం లేదు. ఇలాంటి సమయంలో కష్టపడి పార్టీని బలోపేతం చేసి.. గెలిపించాలని ఎవరైనా ఆలోచిస్తారు. ఎందుకంటే గెలిస్తేనే పదవుల రేస్ ఉంటుంది. ఓడిపోతే రాజకీయ భవిష్యత్ క్లోజ్ అవుతుంది. కానీ ఈ విషయాలను కాంగ్రెస్ నేతలు పట్టించుకోవడం లేదు. తాము సీఎం అయితేనే కాంగ్రెస్ గెలవాలన్నట్లుగా వారి తీరు ఉంది. హైకమాండ్ కూడా సర్దుబాటు చేయలేకపోతోంది.