Andhra Pradesh Financial Crisis :  నిధులు లేకపోవడం వల్ల  విద్యా దీవెన పథకం బటన్ నొక్కడాన్ని వాయిదా వేశామని ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈ పథకం కోసం దాదాపుగా రూ. 700 కోట్లు కంటే ఎక్కువ అవసరం ఉంది. ఇవి కూడా ప్రభుత్వం వద్ద లేకపోవడం వల్ల పథకాన్ని వాయిదా వేశామని సీఎస్ ప్రకటించారు. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరాన్ని ఏపీ ప్రభుత్వం అప్పుతోనే ప్రారంభించింది.ఏ రాష్ట్రానికీ కొత్త ఆర్థిక సంవత్సరంలో అప్పులకు కేంద్రం పర్మిషన్ ఇవ్వలేదు.కానీ ఏపీ ప్రభుత్వానికి రూ. మూడు వేల కోట్లు అప్పునకు పర్మిషన్ ఇచ్చింది. ఆ మొత్తం తొలి మంగళవారంలోనే తెచ్చుకున్న  ప్రభుత్వం వీలైనంత వరకూ సామాజిక పెన్షన్లు, జీతాలు,  రిటైరైన ఉద్యోగుల పెన్షన్లకు చెల్లించిది. కానీ ఇంకా కొంత పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు అప్పుల పర్మిషన్ ఇంకా కేంద్రం ఇవ్వలేదు. దీంతో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారింది. 


కేంద్రం అప్పుల పరిమితి ఎప్పుడు నిర్ణయిస్తుంది ?


కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఆ రాష్ట్ర జీఎస్డీపీని బట్టి..  ఎన్నిఅప్పులు తీసుకోవచ్చో ఖరారు చేస్తుంది. ఆ మేరకు ఆర్బీఐ వద్ద బాండ్లు వేలం వేసి అప్పులు తీసుకోవచ్చు. అయితే ఇటీవల కేంద్రం నిబంధనలు మార్చింది. అంతకు ముందు ఏడాదిలో పరిమితికి మించి అప్పులు చేసి ఉంటే... ఆ మొత్తాన్ని తగ్గించి తర్వాత ఏడాదిలో అనుమతి ఇస్తున్నారు. ఈ లెక్కలు స్పష్టంగా ఉండటం కోసం అనుమతులు ఆలస్యం అవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఆర్బీఐ వద్ద తీసుకున్న అప్పులే కాకుండా  కార్పొరేషన్ల పేరుతో బ్యాంకుల వద్ద నుండి ఇతర ఆర్థిక సంస్థల వద్ద నుండి కూడా రుణాలు సమీకరిస్తోంది. వీటిని బడ్జెట్ లో చూపించకపోవడం వివాదాస్పదం అవుతోంది. ఈ వివరాలు కావాలని కేంద్రం అడుగుతోంది. కానీ ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ లెక్కలన్నీ స్పష్టంగా ఇస్తేనే ఈ ఏడాది అప్పుల పరిమితిని కేంద్రం నిర్ణయించే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఆర్బీఐ నుంచి ఇప్పులు పుట్టే అవకాశం ఉంది. 


పేరుకుపోతున్న పథకాలు, బిల్లుల బకాయిలు !


ఏపీ ప్రభుత్వం అభివృద్ధి కంటే ముందే సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికష్టాలు ఎదురైనా సమయానికి బటన్ నొక్కుతున్నానని సీఎం జగన్ తరచూ చెబుతూంటారు. అయితే ఇటీవలి కాలంలో నిధుల కొరతతో సమయం దాటిపోంది. బటన్ నొక్కిన పథకాలకు కూడా నిధులు చాలా ఆలస్యంగా పడటమో..ఇంకా  పడకపోవడమో జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లో పథకాలకు డబ్బులు అందలేదనే లబ్దిదారుల సంఖ్య లక్షల్లో ఉంటోందన్న వార్తలు వస్తున్నాయి.  అదే సమయంలో కొత్తగా మీట నొక్కాల్సిన పథకాలు వాయిదా పడుతున్నాయి. అదే  సమయంలో   వివిధ పనుల కోసం  కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ తొక్కి పెట్టడం వల్ల కొండలా పేరుకుపోయాయన్న  అభిప్రాయం వినిపిస్తోంది. వీటిని కొద్ది కొద్దిగా క్లియర్ చేయడానికి కూడా ప్రభుత్వానికి వెసులుబాటు లేకుండా పోయింది. 


ఆర్థిక సమస్యలను అధగిమించేందుకు  ఏపీ సర్కార్ ప్రయత్నాం !


ఈ ఆర్థిక సమస్యలను ఏపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే అభివృద్ధి పనుల మీద పెట్టే ఖర్చులు తగ్గిపోవడం.. ఏపీలో  వ్యాపార వ్యవహారాలు.. తగ్గిపోవడంతో ఆదాయం పెద్దగా  పెరగడం లేదు. మద్యం మీదవచ్చే ఆదాయం దాదాపుగా  రూ. ఇరవై వేల కోట్లకు చేరుకున్నా.. నాలుగేళ్ల కిందట ఉన్న ఆదాయం అంతే ఉంది. కానీ ఖర్చులు మాత్రం ఊహించనంతగా పెరిగాయి. ఈ పరిస్థితుల్ని అధిగమించడానికి కేంద్రం సాయం కోసం ఏపీ  తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఇబ్బందులు ఉన్నా.. కనీసం అప్పులైనా ఇప్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఎప్పటికప్పుడు అదనపు అప్పుల కోసం అనుమతి తెచ్చుకుంటూనే ఉన్నారు. అయితే ఇందు కోసం పదే పదే ఢిల్లీ యాత్రలు చేయాల్సి వస్తోంది. మొదట్లో  ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెళ్లేవారు.. తర్వాత సీఎం వెళ్లారు.. ఇప్పుడు ఏపీసీఎస్ ఆ బాధ్యత తీసుకుంటున్నారు.