1963 జూన్ 16.. మొట్టమెదటిసారిగా మహిళ అంతరిక్షంలోకి అడుగుపెట్టిన రోజు. ఆమె పేరు వాలంటీనా తెరిస్కోవా (Valentina Tereshkova). అప్పట్లో ఇదో సంచలనం అని చెప్పవచ్చు. దాదాపు 20 ఏళ్ల తర్వాత 1982లో స్వెత్లానా సావిస్కయా (Svetlana Savitskaya) రెండో మహిళగా అంతరిక్షంలోకి అడుగుపెట్టారు. రోస్కోస్మోస్ వ్యోమగామిగా రోదసిలోకి ప్రవేశించిన ఆమె 1984లో అంతరిక్షయానంలో స్పేస్‌వాక్ చేసి అరుదైన ఘనత సాధించారు.
ఆ తర్వాత సరిగ్గా ఐదు దశాబ్దాలకు మన తెలుగమ్మాయి శిరీష అంతరిక్షయానం చేశారు. ఈ ఐదు దశాబ్దాల్లో 65 మంది మహిళలు రోదసిలోకి ప్రవేశించినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 566 మంది అంతరిక్షయానం చేశారని నివేదికల ద్వారా తెలుస్తోంది. అంటే అంతరిక్షయానం చేసిన వారిలో కేవలం 11.5 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు.
అంతరిక్షయానం చేసిన మహిళల్లో భారతదేశానికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, శిరీష బండ్ల ఉన్నారు. వీరిలో కల్పనా చావ్లా, శిరీష బండ్ల భారతీయులు కాగా.. సునీత భారత సంతతికి చెందిన వ్యోమగామిగా ఉన్నారు.
తెలుగమ్మాయి శిరీష..
శిరీష బండ్ల (34) తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందినవారు. శిరీషకు నాలుగేళ్ల వయసులోనే ఆమె కుటుంబం హ్యూస్టన్‌కు వెళ్లింది. శిరీష జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో ఎంబీఏ, పర్‌డ్యూ యూనివర్సిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. శిరీష 2015 నుంచి వర్జిన్ గెలాక్టిక్‌లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వర్జిన్ గెలాక్టిక్ కంపెనీలో ప్రభుత్వ వ్యవహారాలకు ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదే హోదాలో ఆమె యాత్రికురాలిగా అంతరిక్షయానం చేశారు.
మొట్టమొదటి భారతీయురాలు..
అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయ వనిత కల్పన చావ్లా హరియాణాలోని కర్నాల్‌లో జన్మించారు. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత 1984లో టెక్సాస్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ స్పేస్ డిగ్రీ చేశారు. 1997లో ఆమె తొలిసారి అంతరిక్ష యాత్ర పూర్తిచేశారు. అనంతరం 2003లో కొలరాడో స్పేస్ షటిల్‌లో రెండవసారి రోదసిలోకి వెళ్లారు. అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకుని భూమికి తిరిగివస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న'కొలంబియా' స్పేస్ షటిల్ కూలడంతో ఆమె కన్నుమూశారు.
పశువుల డాక్టర్ కాబోయి వ్యోమగామిగా..
సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు, తల్లి అమెరికన్. అమెరికాలో స్థిరపడిన కుటుంబం. సునీత బాల్యం, విద్యాబ్యాసం అంతా అమెరికాలోనే జరిగింది. తాను వ్యోమగామిని కావాలని ఎప్పుడు అనుకోలేదని సునీతా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వెటర్నరీ డాక్టర్ అవుదామని అనుకున్నానని తెలిపారు. సునీత కూడా రెండు సార్లు అంతరిక్షంలోకి వెళ్లారు. మొత్తం 322 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్నారు. అత్యధిక రోజులు అంతరిక్షంలో ఉన్న మహిళల్లో ఆమెది రెండో స్థానం.
ఎన్నో అపోహలు..
అంతరిక్షంలోకి అమ్మాయిల ప్రవేశం అంటే తొలి నాళ్లనుంచి సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి. అమ్మాయిల శరీరం అంతరిక్ష వాతావరణానికి సరిపోదని.. నెలసరి కూడా వారికి అడ్డంకేననే వాదనలు వినిపించాయి. అమ్మాయిలకు సరిపోయే స్పేస్ సూట్స్ లేకపోవడం వల్లే స్పేస్‌వాక్‌ను నిలిపివేశామని స్వయానా నాసా ప్రకటించడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. దీంతో అంతరిక్షం మహిళా వ్యోమగాములకు సురక్షితమా? కాదా? అనే చర్చలు కూడా నడిచాయి. ఈ నేపథ్యంలో దాదాపు దశాబ్దానికి పైగా వ్యోమగాములకు గైనకాలజిస్టుగా పనిచేసిన డాక్టర్ వర్షా జైన్ మహిళలు అంతరిక్షయానం చేయడంపై అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఆమె ఓ ప్రముఖ మీడియా సంస్థతో పంచుకున్నారు.
ఈ పరిశోధన మహిళా వ్యోమగాముల అంతరిక్ష ప్రయాణంపై ఉన్న అపోహలను తొలగించేందుకు తోడ్పడింది. ప్రస్తుతం నాసా మహిళల కోసం ప్రత్యేక స్పేస్ సూట్లను తయారు చేస్తోంది. ఇక ఇప్పటికే స్పేస్ఎక్స్, బ్లూ ఆరిజన్, వర్జిన్ గెలాక్టిక్ వంటి ప్రైవేటు అంతరిక్షయాన సంస్థలు తమ ప్రయోగాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
నాసాలో అమెస్ రీసెర్చ్ సెంటర్‌లో రీసెర్చ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న షర్మిల భట్టాచార్య, మార్స్‌పై పెర్సెవరెన్స్ రోవర్ ల్యాండ్ అవ్వడం వెనుక కీలక్ర పాత్ర పోషించిన స్వాతి మోహన్ సహా పలువురు భారత సంతతి మహిళలు నాసా ప్రయోగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల వచ్చిన మిషన్ మంగళ్ సినిమాలో కూడా ఇదే అంశాన్ని ప్రస్ఫుటంగా చూపించారు. అన్ని రంగాల్లో రాణిస్తోన్న మహిళలకు ప్రభుత్వాలు, ఆయా వాణిజ్య సంస్థలు అవకాశం కల్పిస్తే భవిష్యత్తులో మరింత మంది అంతరిక్షంలోకి దూసుకెళ్లగలరనడంతో అతిశయోక్తి లేదు.