Stocks to watch today, 22 December 2022: ఇవాళ (గురువారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 95 పాయింట్లు లేదా 0.52 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,345 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


సూలా వైన్‌యార్డ్స్: భారత దేశంలో అతి పెద్ద వైన్ ఉత్పత్తి కంపెనీ అయిన సూలా వైన్‌యార్డ్స్‌ ఇవాళ (గురువారం, 22.12.2022‌) మార్కెట్‌లోకి అరంగేట్రం చేస్తోంది. 2022 డిసెంబరు 12- 14 తేదీల మధ్య జరిగిన IPOలో ఈ కంపెనీ రూ. 960 కోట్లకు పైగా ఫండ్స్‌ సేకరించింది. షేర్లను ఒక్కొక్కటి రూ. 357 చొప్పున విక్రయించింది, ఇది పూర్తిగా 'ఆఫర్‌ ఫర్‌ సేల్‌' విక్రయం


రిలయన్స్ ఇండస్ట్రీస్: రిటైల్ రంగంలో తన ఆధిపత్య స్థానాన్ని బలోపేతం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారతదేశంలో జర్మన్ సంస్థ నిర్వహిస్తున్న మెట్రో AG (Metro AG) హోల్‌సేల్ వ్యాపారాన్ని రూ. 2,850 కోట్లకు కొనుగోలు చేయబోతోంది.


అదానీ ఎంటర్‌ప్రైజెస్: అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అనుబంధ సంస్థ అయిన అదానీ సోలార్, ముంద్రాలోని తన కర్మాగారంలో పెద్ద సైజు మోనోక్రిస్టలైన్ సిలికాన్ ఇంగాట్‌ను లాంచ్‌ చేసింది. ఇది, సిలికాన్ ఆధారిత PV మాడ్యూల్స్ నుంచి అత్యంత సమర్థతతో పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. 


అదానీ పవర్: 2022కి CDP (కార్బన్ డిస్‌క్లోజర్ ప్రాజెక్ట్) నుంచి వాతావరణ మార్పుల పారదర్శకత కోసం B స్కోర్‌ను అదానీ పవర్‌ అందుకుంది. ఇది, గ్లోబల్ & ఆసియా ప్రాంతీయ సగటు C స్కోర్‌ కంటే ఎక్కువ. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సగటు అయిన Bతో సమానం.


బంధన్ బ్యాంక్: రూ. 8,897 కోట్ల మొండి బకాయిలతో కూడిన రైట్-ఆఫ్ పోర్ట్‌ఫోలియో కోసం అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ నుంచి రూ. 801 కోట్ల బైండింగ్ బిడ్‌ను బంధన్‌ బ్యాంక్‌ అందుకుంది. దీని మీద స్విస్ ఛాలెంజ్ పద్ధతి ప్రకారం బిడ్డింగ్‌కు వెళ్తామని బ్యాంక్ తెలిపింది.


భారత్ ఫోర్జ్: కళ్యాణి గ్రూప్‌లోని సంస్థ సార్లోహా అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ (Saarloha Advanced Materials) తయారు చేసి, సరఫరా చేసిన గ్రీన్ స్టీల్‌ని ఉపయోగించి ఫోర్జింగ్స్ సరఫరాను ఈ కాస్టింగ్స్ & ఫోర్జింగ్స్ కంపెనీ ప్రారంభించింది. ఇది కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న కంపెనీ నిబద్ధతలో ఒక భాగం.


మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌: ఈ కంపెనీ ప్రమోటర్‌ అయిన మాక్స్ వెంచర్స్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ 58.85 లక్షల షేర్లు లేదా 1.7 శాతం వాటాను ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా ఆఫ్‌లోడ్ చేసింది. ఒక్కో షేరును సగటున రూ. 679.2 చొప్పున అమ్మి రూ. 399.7 కోట్లను సంపాదించింది. 


JB కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్: గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ నుండి Razel ఫ్రాంచైజీని కొనుగోలు చేసే ప్రక్రియను JB కెమికల్స్ పూర్తి చేసింది. భారతదేశం, నేపాల్‌లో గ్లెన్‌మార్క్‌ కార్డియాక్ బ్రాండ్ రేజెల్‌ను రూ. 313.7 కోట్లకు కొనుగోలు చేయడానికి గత వారం ఒప్పందం కుదుర్చుకుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.