సమగ్ర శిక్షా పథకం కింద 2022-23లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన, భవనాలు మరమ్మతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రూ. 867 కోట్లు విడుదల చేసినట్లు  విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు.


కేంద్రం విడుదల చేసిన నిధులలో ఈ ఏడాది డిసెంబర్‌ 15 నాటికి  823 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు నేడు పేరుతో వినూత్న పథకాన్ని రూపొందించిందని చెప్పారు. సమగ్ర శిక్షా పథకం కింద వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం చేపడుతున్న అత్యుత్తమ చర్యలు, వినూత్న విధానాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుకరించేందుకు వీలుగా పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు “షాగన్ డిజిటల్  రెపోసిటొరీ” వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.


సమగ్ర శిక్షా పథకం కింద యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎడ్యుకేషన్ డేటా బేస్ ద్వారా లోపాలను గుర్తించి నిర్ణయించిన విధంగా, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి స్వీకరించిన వినతుల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, భవనాల మరమ్మతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని మంత్రి తెలిపారు. అవసరాలు, ప్రాధాన్యతల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతి ఏటా కసరత్తు చేస్తాయని, అవి ఆయా రాష్ట్రాల వార్షిక కార్యాచరణ ప్రణాళికలోను, బడ్జెట్‌లోను ప్రతిబింబిస్తాయని మంత్రి వివరించారు.


Also Read: 


విద్యార్ధులు, టీచర్లకు ఉచితంగా ట్యాబ్‌లు-ఏపీలో సీఎం జగన్ కానుక
ఆంధ్రప్రదేశ్ లోని పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానుక అందించారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్పొరేట్‌ విద్యను అందించాలన్న లక్ష్యంతో విద్యార్థులకు ఈ ట్యాబ్‌లను పంపిణీ చేస్తున్నారు. ప్రపంచంతో పోటీ పడేలా ఇప్పటి నుంచే వారికి శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 8 వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్ధులు,  59,176 మంది ఉపాధ్యాయులకు రూ. 778 కోట్ల బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌తో రూ. 686 కోట్ల విలువైన 5,18,740 శామ్‌సంగ్‌ ట్యాబ్‌లు ఉచితంగా అందిస్తారు. 
పేద విద్యార్ధులను గ్లోబల్‌ సిటిజెన్‌లుగా తీర్చిదిద్దేలా, డిజిటల్‌ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా అర్ధమయ్యేలా... ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు ఇకపై ప్రతి ఏటా బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌ల పంపిణీ చేయనున్నారు. రూ. 16,500 కు పైగా మార్కెట్‌ విలువ గల ట్యాబ్, దాదాపు రూ. 15,500 విలువ గల కంటెంట్‌తో కలిపి ప్రతి 8 వ తరగతి విద్యార్ధికి అందిస్తారు.  ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసే విధంగా వీటిని రూపొందించారు. 4 నుండి 10 వ తరగతి చదువుతున్న 32 లక్షల మంది విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ. 15,500 విలువైన రూ. 4,960 కోట్ల బైజూస్‌ కంటెంట్‌ ఉచితంగా అందిస్తున్నారు. ప్రస్తుతం 8 వ తరగతి చదువుతున్న విద్యార్ధులు 2025 విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ విధానంలో ఇంగ్లీష్‌ మీడియంలో 10 వ తరగతి పరీక్ష రాసేలా పిల్లలను సన్నద్ధం చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు ఈ బైజూస్ కంటెంట్ ట్యాబ్ లు పంపీణీ చేస్తారు. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..