అనవసరంగా సమయం వృథా చేయకండి : రణిల్ విక్రమసింఘే


శ్రీలంక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. అంతకు ముందు ప్రధానిగా ఉన్నప్పుడే ఆయనను అంగీకరించని లంకేయులు..అధ్యక్ష పదవిలో ఉండటాన్ని అసలు ఒప్పుకోవటం లేదు. తీవ్రంగా నిరసనలు చేపడుతున్నారు. ఇప్పటికే ఆయన ఇంటికి నిప్పుపెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ నిరసనల్లో భాగంగానే ఆందోళన కారులు
ఓ డిమాండ్‌ను వినిపిస్తున్నారు. "ఇంటికి వెళ్లిపో" అంటూ రణిల్ విక్రమసింఘేను ఉద్దేశిస్తూ నినదిస్తున్నారు. లేదంటే తీవ్ర పరిణామాలుంటా యని హెచ్చరిస్తున్నారు. కొంత కాలంగా దీనిపై అక్కడ వేడి రాజుకుంటోంది. మొత్తానికి ఈ అంశంపై స్పందించారు రణిల్ విక్రమసింఘే. తనను ఇంటికి వెళ్లిపోమనటంలో అసలు అర్థమే లేదని కొట్టి పారేశారు. "నేను ఇంటికి వెళ్లిపోవాలని కొందరు బెదిరిస్తున్నారు. వాళ్లందరికీ నేనొక్కటే చెబుతున్నా. వెళ్లటానికి నాకు ఓ ఇల్లంటూ లేదు. అందుకే ఇలా డిమాండ్ చేయటం మానుకోండి" అని బదులిచ్చారు. ఇలాంటి డిమాండ్‌లతో సమయం వృథా చేసుకోకూడదని, దాని బదులు కాల్చేసిన తన ఇంటిని రీబిల్డ్ చేయాలని ఆందోళనకారులకు సూచించారు. "ఇల్లే లేని వ్యక్తిని, ఇంటికి వెళ్లిపోమని అరవటంలో ఎలాంటి అర్థమూ లేదు" అని అంటున్నారు రణిల్ విక్రమసింఘే. 


ఈ నిరసనల వల్లే IMFతో చర్చలు జరగటం లేదు : రణిల్ విక్రమసింఘే


ఇలాంటి ఆందోళనలు, నిరసనల కారణంగా...IMFతో చర్చించి సమస్యలకు పరిష్కారం అన్వేషించే పని కూడా వాయిదా పడుతోందని చెబుతున్నారు ఈ కొత్త అధ్యక్షుడు. శ్రీలంకను వెంటాడుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు పార్టీలన్నీ ఒకేతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని వెల్లడించారు. తమ ప్రయత్నాలకు, నిరసనలు ఆటంకపరుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. దేశంలోని ఈ దుస్థితికి మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సను నిందిస్తూ కూర్చోవటం వల్ల ఎలాంటి లాభం లేదని తేల్చి చెప్పారు. తాను ప్రధానిగా ఉన్నప్పుడే IMFతో చర్చలు జరిగాయని, అయితే దేశంలో జరుగుతున్న ఈ నిరసనల కారణంగా ఆ చర్చలు ముందుకు సాగలేదని అన్నారు. ఈ అనిశ్చితి కారణంగా చర్చల్లో పురోగతి కనిపించట లేదని వెల్లడించారు. IMF ముందుకొచ్చి భరోసా ఇస్తే తప్ప మిగతా ఏ దేశాలూ తమకు ఆర్థిక సహకారం అందించేందుకు సిద్ధంగా లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి అప్పులు తిరిగి చెల్లించటం ఎలా అన్నది ఆలోచిస్తున్నట్టు తెలిపారు. జులై 9 వ తేదీన ఆందోళన కారులు రణిల్ విక్రమసింఘే ఇంటిని ముట్టడించి నిప్పు పెట్టడం సంచలనమైంది. 


కష్టాలు ఎప్పుడు తీరుతాయో..? 


శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి ఎప్పుడు తెరపడుతుందన్నదే ప్రశ్నార్థకంగా మారింది. గత అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం వదిలి పారిపోయారు. నిరసనకారులు ఆయన ఇంటిని ముట్టడించి, లోపలకు వెళ్లడం లాంటి పరిణామాలు అక్కడి ప్రజాగ్రహాన్ని కళ్లకు కట్టాయి. తరవాత ప్రధాని రణిల్ విక్రమసింఘే కూడా రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నిరనసలు చేపట్టారు. కానీ...అందుకు ఆయన ససేమిరా అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక కానీ రాజీనామా చేయనని తేల్చి చెప్పారు. ఫలితంగా...ఆయన ఇంటిపైనా దాడి చేశారు ఆందోళకారులు. గత అధ్యక్షుడు గొటబయ రాజపక్స రాజీనామా చేశాక, పార్లమెంట్‌లో ఓటింగ్ నిర్వహించి, ప్రధాని రణిల్ విక్రమసింఘేను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇది ప్రజాగ్రహాన్ని ఇంకా పెంచింది. రాజపక్స కుటుంబాన్ని సన్నిహితుడైన రణిల్ విక్రమసింఘే, దేశాన్ని ఇంకా నాశనం చేస్తారంటూ ప్రజలు తీవ్రంగా నిరసించారు. "ప్రజల ప్రభుత్వం వచ్చినప్పుడే మాకు మనశ్శాంతి" అని వాళ్లు చెబుతున్నారు. "కావాలనే మమ్మల్ని అణిచివేస్తున్నారు. ఇదంతా రణిల్ విక్రమసింఘే చేయిస్తున్నదే. కానీ మేము వెనక్కి తగ్గం. దేశాన్ని ఈ కుటిలరాజకీయాల నుంచి కాపాడుకుంటాం" అని నినదిస్తున్నారు. 


Also Read: Mohanbabu Agni Nakshtram: ప్రొఫెసర్ విశ్వామిత్రగా మోహన్ బాబు, భయంగా ఉందంటూ ట్వీట్!


Also Read: MLA as Paper Boy: పేపర్ బాయ్‌గా మారిన టీడీపీ ఎమ్మెల్యే, ఇంటింటికీ సైకిల్‌పై వెళ్లి పేపర్ వేసి