spicejet plane wheel fell off during take off: విమానం గాల్లోకి ఎగరడంతోనే చక్రం ఊడిపోయింది. ఈ విషయం పైలట్‌కు తెలిసింది. దాన్ని ల్యాండింగ్ చేయాల్సిన చోట ఎలా అని ముందే ప్రిపేర్ అయ్యాడు. ఎయిర్ పోర్టును అలర్ట్ చేశాడు. చివరికి ఉత్కంఠ నడుమ సేఫ్ ల్యాండింగ్ చేశాడు. ఈ ఘటన సినిమాల్లో కాదు..నిజంగానే జరిగింది.
గుజరాత్‌లోని కాండ్లా నుంచి ముంబైకి బయలుదేరిన స్పైస్‌జెట్ బాంబార్డియర్ Q400 విమానం టేకాఫ్ సమయంలో ఒక చక్రం ఊడిపోయింది. దీంతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (CSMIA) పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ప్రయాణికుల్ని సిబ్బందిని కాపాడేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు.
పైలట్ విమానాన్ని అత్యంత సామర్థ్యంతో నడిపారు. సాయంత్రం 3:51 గంటలకు ముంబైలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. చక్రం లేకపోయినప్పటికీ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ల్యాండింగ్ కావడంతో ప్రయాణికులు,ఎయిర్ పోర్టు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. చక్రం ఊడిపోయిన సమాచారం అందిన వెంటనే, ముంబై విమానాశ్రయంలో పూర్తి స్థాయి అత్యవసర ఏర్పాట్లు చేశారు. ఈ జాగ్రత్త చర్యలో భాగంగా, కొన్ని గంటలపాటు డిపార్చర్‌లు నిలిపివేశారు. సేఫ్ ల్యాండింగ్ అయిన తర్వాత రన్‌వేను తనిఖీ చేసి సాధారణ కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించారు. ఈ సంఘటన వల్ల ఎటువంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు.
ప్రస్తుతం స్పైస్‌జెట్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మొత్తం 54 విమానాలలో సగం కంటే ఎక్కువ ఆపరేట్ కావడం లేదు. దేశీయ మార్కెట్ షేర్ 1.9%కి పడిపోయింది. ఈ ఆర్థిక సమస్యలు విమానాల నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. స్పైస్‌జెట్ ఈ సంఘటనపై విచారణ జరుపుతోందని, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ ఘటనను సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు సమాచారం.