Yoon Suk Yeol : అభిశంసనను ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. మరోపక్క యూన్ సుక్ యోల్ మార్షల్ లా ప్రకటించడంపైనా దర్యాప్తు కొనసాగుతోంది. అందులో భాగంగా న్యాయవాదులతో పాటు పోలీసు, రక్షణ మంత్రిత్వశాఖ, అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన జాయింట్ టీమ్ అధ్యక్షుడిని విచారిస్తోంది. ఇప్పటికే 3 సార్లు విచారణకు పిలిచినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో అధికారులు అరెస్ట్ వారెంట్ కోరినట్టు సమాచారం. ఈ విచారణలో నేరం నిరూపితమైతే జీవిత ఖైదు లేదా మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది.
దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం
దక్షిణ కొరియాలో ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ డిసెంబర్ 3, 2024న అర్థరాత్రి అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఎమర్జెన్సీ మార్షల్ లా విధించేందుకు ప్రయత్నించారు. దీంతో ఈ విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే యూన్ కు వ్యతిరేకంగా విపక్షాల పార్లమెంట్ (జాతీయ అసెంబ్లీ)లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. మొత్త 300 మంది చట్టసభ్యుల్లో తీర్మానికి అనుకూలంగా 204 మంది ఓటేస్తే.. కేవలం 85మంది మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో డిసెంబరు 14న, నాయకుడిని పార్లమెంటు తన విధుల నుండి తొలగించింది. ఆయన స్థానంలో ప్రధానమంత్రి హన్ డక్ సూకిని నియమించారు. అయితే యూన్ ను తప్పించాలా, కొనసాగించాలా అన్న అంశాన్ని రాజ్యాంగ న్యాయస్థానికి 180 రోజుల్లోపు తేల్చనుంది. ఒకవేళ ఆయన్ను తొలగిస్తే 60 రోజుల్లోగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్
యాన్ సుక్ తన ప్రకటనను విరమించుకున్నప్పటికీ ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దాంతో పాటు మార్షల్ లా అమలు చట్టవిరుద్ధం అంటూ స్పీకర్ సైతం ప్రకటించారు. కాగా యూన్ సుక్ యోల్ దక్షిణ కొరియా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్టు ఆయన సీనియర్ సలహాదారులు, కార్యదర్శులు చెబుతున్నారు. ఇక యోల్ భార్య, కుటుంబీకులు, సన్నిహితులపైనా భారీ అవినీతి ఆరోపణలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
తాత్కాలిక అధ్యక్షుడి గురించి
యాన్ సుక్ ను విధుల నుంచి తొలగించిన తర్వాత దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని హాన్ డక్ సూ నియమితులయ్యారు. ఆయనో సాంకేతిక నిపుణుడు. పార్టీలకతీతంగా వైవిధ్యమైన కేరీర్ కొనసాగించిన ఆయన.. పాలనాపరంగా విస్తృతమైన అనుభవం గల వ్యక్తి. సూ ఐదుగురు వేర్వేరు అధ్యక్షుల ఆధ్వర్యంలో 3 దశాబ్దాలకు పైగా నాయకత్వ పదవుల్లో పని చేశారు.