Water Crisis in Southern States: బెంగళూరులో నీటి కొరత ఏ స్థాయిలో ఉందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఇంకా నగరం ఈ సమస్య నుంచి బయటపడలేదు. వర్షాకాలం వరకూ ఈ తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. వేసవి వచ్చిందంటే మరి కొన్ని సిటీల్లోనూ ఇదే ఇబ్బంది. ఈ క్రమంలోనే ఓ రిపోర్ట్ సంచలన విషయం వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులోని రిజర్వాయర్‌లలో నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా తగ్గుతోందని Central Water Commission (CWC) స్పష్టం చేసింది. ఈ రాష్ట్రాల్లోని రిజర్వాయర్ కెపాసిటీతో పోల్చుకుంటే కేవలం 17% మాత్రమే నీటి నిల్వ ఉందని వెల్లడించింది. ఈ మేరకు CWC ఓ బులిటెన్ విడుదల చేసింది. ఈ ప్రాంతాల్లోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం 42 రిజర్వాయర్‌లలో 53.334 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉందని వివరించింది. కానీ..ఇప్పుడు ఈ మొత్తంలో కేవలం 17% మాత్రమే నిల్వ ఉందని స్పష్టం చేసింది. గతేడాది ఇదే సమయంలో పరిశీలించగా అప్పుడు నీటి నిల్వలు 29% వరకూ ఉన్నాయి. కానీ ఈ సారి అది దారుణంగా పడిపోయింది. దీనిపైనే CWC హెచ్చరికలు చేసింది. దాదాపు పదేళ్లుగా సగటున 23%గా ఉంటున్న ఈ నీటి నిల్వలు ఈ స్థాయిలో పడిపోవడం సాధారణ విషయం కాదని అంటోంది. రానురాను ఈ దక్షిణాది రాష్ట్రాల్లో నీటి కొరత ఎదురయ్యే ముప్పు ఉందని వెల్లడించింది. సాగు, తాగు నీటికీ ఇబ్బంది కలగొచ్చని అంచనా వేస్తోంది.
ఆ రాష్ట్రాల్లో మెరుగు..
ఇక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్‌కీ అంతరాయం కలిగే అవకాశముందని సెంట్రల్ వాటర్ కమిషన్ అభిప్రాయపడుతోంది. అటు అసోం, ఒడిశా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అక్కడి రిజర్వాయర్‌లలో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. గతేడాదితో పోల్చి చూస్తే ఈ సారి నిల్వలు మరింత పెరిగాయి. ఈ రాష్ట్రాల్లో మొత్తం 23 రిజర్వాయర్‌లను పరిశీలించింది. 20.430 BCM కెపాసిటీ ఉన్న ఈ రిజర్వాయర్‌లలో ప్రస్తుతానికి 7.889 BCM మేర నీటి నిల్వలున్నాయని వెల్లడించింది. గుజరాత్, మహారాష్ట్రలోనూ గతేడాదితో పోల్చుుకుంటే నీటి నిల్వలు తగ్గిపోతున్నాయని వివరించింది. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ పరిస్థితులు కాస్త ఆందోళనకరంగానే ఉన్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ వెల్లడించింది. ఇక బ్రహ్మపుత్ర,నర్మదా నదీ పరీవాహక ప్రాంతాల్లో నీటి నిల్వలు సంతృప్తికరంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
బెంగళూరులో కటకట
బెంగళూరులో వాటర్ ట్యాంకర్స్‌తో నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. స్నానాలు కూడా చేయడానికి నీళ్లు లేక అలాగే ఉండిపోతున్నారు నగర ప్రజలు. ఇంకొందరు షాపింగ్ మాల్స్‌లోకి వెళ్లి స్నానాలు కానిస్తున్నారు. ఇంత కన్నా దారుణమైన రోజుల్ని బహుశా ఇక చూడమేమో అని వాపోతున్నారు. వాటర్ ట్యాంకర్ ఓనర్లు నిలువునా దోచుకుంటున్నారు. నీళ్లు సరఫరా చేసేందుకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆంక్షలు విధించినా కొన్ని చోట్ల ఈ దోపిడీ కొనసాగుతూనే ఉంది.
Also Read: Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, CRPF సిబ్బందిపై మిలిటెంట్‌ల దాడి - ఇద్దరు సైనికులు మృతి