Sonia Gandhi Hospitalised:
గంగారాం ఆసుపత్రిలో చికిత్స
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. ఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. జ్వరంతో బాధ పడుతున్న సోనియా ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. "సోనియా గాంధీని అబ్జర్వేషన్‌లో ఉంచాం. అవసరమైన చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది" అని వెల్లడించారు. గురువారం ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్టు కాంగ్రెస్ ప్రతినిధి తెలిపారు. సీనియర్ వైద్యులు అరూప్ బస్ పర్యవేక్షణలో సోనియా గాంధీకి వైద్యం అందిస్తున్నట్టు సర్ గంగారాం హాస్పిటల్ ఛైర్మన్ డీఎస్ రాణా చెప్పారు. ఈ ఏడాది జనవరిలోనూ
సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్‌లో రొటీన్ చెకప్ కోసం వెళ్లినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ప్రియాంక గాంధీ కూడు సోనియా వెంట వెళ్లారు. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో సోనియా బాధ పడ్డారు. రెండు రోజుల పాటు ఆమె కాస్త ఇబ్బంది పడ్డారు. ఆ సమయానికి రాహుల్, ప్రియాంక భారత్ జోడో యాత్రలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకుని ఢిల్లీకి వచ్చారు. చెస్ట్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్‌లో ఆమెకు చికిత్స అందించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని, రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని అప్పడు గంగారాం హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ వెల్లడించారు. గతేడాది జూన్‌లోనూ సోనియా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. కొవిడ్ సోకిన తరవాత కూడా చాలా రోజుల పాటు ఆమెను ఏదో ఓ సమస్య వెంటాడింది. కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నాక డిశ్చార్జ్ అయ్యారు.
రిటైర్‌మెంట్‌పై వ్యాఖ్యలు..
కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రతోనే తన పొలిటికల్ ఇన్నింగ్స్ ముగుస్తుందని అని వెల్లడించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంతో పురోగతి సాధించిందని, ఆయన పని తీరు తనకు సంతృప్తినిచ్చిందని అన్నారు.
"2004,2009లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మేం సాధించిన విజయాలు ఎంతో సంతృప్తినిచ్చాయి. ఇంకా సంతోషించే విషయం ఏంటంటే భారత్ జోడో యాత్రతోనే నా రాజకీయ ఇన్నింగ్స్ ముగుస్తుండొచ్చు. కాంగ్రెస్‌కు ఇదో కీలక మలుపు అవుతుండొచ్చు"
-సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు
అయితే...ఈ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది కాంగ్రెస్. ఆమె వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టతనిచ్చింది. కాంగ్రెస్ ప్రతినిధి అల్కా లంబా దీనిపై స్పందించారు. సోనియా రాజకీయాల్లో నుంచి తప్పుకోవడం లేదంటూ వెల్లడించారు. ఆమె ప్రసంగాన్ని తప్పుదోవ పట్టించి కథనాలు రాయొద్దంటూ మీడియాకు సూచించారు.
"ఈ వార్తలు సోనియా గాంధీ వరకూ వెళ్లాయి. ఇది వినగానే సోనియా గాంధీ గట్టిగా నవ్వారు. నేనెప్పుడూ రాజకీయాల నుంచి తప్పుకోలేదు. తప్పుకోను కూడా అని నాతో చాలా స్పష్టంగా చెప్పారు. మీడియా ఇది గమనించాలి. ఆమె ప్రసంగాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు"
అల్కా లంబా, కాంగ్రెస్ ప్రతినిధి
Also Read: Elon Musk puja: అందరికీ ఫ్యాన్స్ ఉంటే మస్క్‌కు మాత్రం భక్తులుంటారు, ప్రూఫ్ కావాలా? ఈ వీడియో చూడండి