Karnataka BJP MLA's Son:
కర్ణాటకలో ఘటన..
కర్ణాటక బీజేపీ నేత లంచం తీసుకుని అధికారుల చేతికి చిక్కాడు. బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్ప కొడుకు ప్రశాంత్ మదల్ ఈ లంచం తీసుకున్నట్టు లోకాయుక్త అధికారులు వెల్లడించారు. ఆయన ఇంట్లో రూ.6 కోట్ల నగదుని స్వాధీనం చేసుకున్నారు. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో బీజేపీకి ఇది పెద్ద షాక్‌లా తగిలింది. లోకాయుక్త అంబుడ్స్‌మెన్‌లు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి నోట్ల కట్టల్ని జప్తు చేశారు. చన్నగిరి ఎమ్మెల్యే మదల్ విరూపాక్ష Karnataka Soaps and Detergents Limited (KSDL)కి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మైసూర్ శాండిల్ సోప్‌ను తయారు చేసేది ఈ కంపెనీయే. ఆయన కొడుకు ప్రశాంత్ మదల్...బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డ్ (BWSSB)లో చీఫ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. గురువారం (ఫిబ్రవరి 2) కర్ణాటక లోకాయుక్త అధికారులు..ప్రశాంత్‌ను KSDL ఆఫీస్‌లోనే లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.40 లక్షలు తీసుకునే సమయంలో అదుపులోకి తీసుకున్నారు. అదే ఆఫీసులో మూడు సంచుల్లో రూ.1.75 కోట్ల విలువైన నోట్ల కట్టలు కనిపించాయి. వాటన్నింటినీ సీజ్ చేశారు అధికారులు. సబ్బులు, డిటర్జెంట్‌లు తయారు చేసే కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి భారీ మొత్తంలో లంచం అడిగినట్టు అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు సోదాలు నిర్వహించారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకే లంచం తీసుకోవడంపై మండి పడుతున్నాయి. అయితే...సీఎం బసవరాజు బొమ్మై మాత్రం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబుడ్స్‌మెన్‌ల విచారణకు ఎవరూ అడ్డు చెప్పరని తేల్చి చెప్పారు.
"అవినీతిని అరికట్టేందుకే మేం లోకాయుక్తను తీసుకొచ్చాం. కాంగ్రెస్ పాలనలో లోకాయుక్తను పక్కన పెట్టేశారు. ఎన్నో కేసులను క్లోజ్ చేశారు. అలా క్లోజ్ చేసిన ప్రతి కేసునీ మేం విచారిస్తాం. లోకాయుక్త అనేది ఓ స్వతంత్ర సంస్థ. అవినీతి అరికట్టడంలో ఎంతో సంకల్పంతో ఉన్నాం. ఈ సంస్థ స్వేచ్ఛగా విచారణ చేపడుతుంది. మేం ఇందులో జోక్యం చేసుకోం"
- బసవరాజు బొమ్మై, కర్ణాటక సీఎం