Hathras Stampede Deaths: హత్రాస్ ఘటనకు సంబంధించి ఆరుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లంతా సత్సంగ్ నిర్వాహకులే అని అలీగర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ శలభ్ మధుర్ వెల్లడించారు. అరెస్ట్ అయిన వాళ్లలో ఇద్దరు మహిళలూ ఉన్నట్టు తెలిపారు. భోలే బాబా ఇంకా పరారీలోనే ఉన్నట్టు తెలిపారు. ఘటన జరిగిన 72 గంటల్లోనే ఆరుగురిని అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో మొత్తం 121 మంది ప్రాణాలు కోల్పోయారని, వాళ్లందరినీ గుర్తించి పోస్ట్‌మార్టమ్‌కి అప్పగించినట్టు వెల్లడించారు. సేవాదార్ పేరుతో కొంత మంది సభ్యులు ఈ సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. వాళ్లలో ఆరుగురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు వివరించారు. ఈ విషాదం జరిగిన వెంటనే ఈ ఆరుగురూ పరారయ్యారని, ఆ అనుమానంతోనే వీళ్లను గాలించి పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.
"హత్రాస్‌లో తొక్కిసలాట జరిగినప్పుడు ఈ ఆరుగురు వెంటనే పరారయ్యారు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టి వీళ్లను అరెస్ట్ చేశాం. ప్రధాన నిందితుడు ప్రకాశ్ మధుకర్ కోసం వేట కొనసాగుతోంది. ఇప్పటికే రూ.లక్ష నజరానా ప్రకటించాం. ఎవరైనా వివరాలు ఇస్తే ఈ నజరానా అందిస్తాం. దొరికిన వెంటనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం. ఈ ఘటన వెనకాల కుట్ర ఏమైనా ఉందా అన్న కోణంలోనూ విచారణ జరిపి తీరతాం"
- పోలీసులు
భోలే బాబా నేర చరిత్రపైనా నిఘా..
భోలే బాబా నేర చరిత్రనూ పరిశీలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అసలు సత్సంగ్ కార్యక్రమానికి ఆయన పేరుమీద అనుమతి తీసుకోలేదని సంచలన విషయం చెప్పారు. ఇదే కేసులో కీలకం కానుంది. అయితే...బాబాను ఎందుకు అరెస్ట్ చేయలేదన్న ప్రశ్నకీ సమాధానమిచ్చారు పోలీసులు. విచారణ ఆధారంగా అరెస్ట్‌లు చేస్తామని తెలిపారు. అవసరమైతే బాబాను కూడా విచారిస్తాని స్పష్టం చేశారు. దీనిపై అప్పుడే కామెంట్స్ చేయడం సరికాదని అన్నారు. ఈ సత్సంగ్ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ కమిటీ అనుమతి తీసుకుందని, అందుకే ఆ కమిటీలోని సభ్యులనే అరెస్ట్ చేశామని వివరించారు. ఎవరి పేరు మీదైతే అనుమతి తీసుకున్నారో ఆ వ్యక్తి కోసమే గాలిస్తున్నట్టు తెలిపారు. వీలైనంత త్వరగా నిందితుడిని అరెస్ట్ చేస్తామని అన్నారు.
Also Read: UK Election 2024: యూకేలో ఎన్నికలు, రిషి సునాక్ ఓటమి ఖాయమంటున్న రిపోర్ట్‌లు