YSRCP Jagan : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అన్యాయంగా కేసులు పెట్టారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లి వరుసగా నాలుగు సార్లు గెలిచారంటే.. ఆయన మంచి వాడనే ప్రజలు గెలిపించారన్నారు. అలాంటి మనిషిని తీసుకు వచ్చి జైల్లో పెట్టారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో జరిగిన ఘటనల్లో పిన్నెల్లి ప్రమేయం లేదన్నారు. కారంపూడిలో ఎన్నికల రోజు.. టీడీపీ నేతలు ఓ దళిత కుటుంబంపై దాడి చేస్తే వారిని పరామర్శించడానికి వెళ్లారన్నారు. అక్కడ టీడీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం జరిగితే ఘర్షణలు జరిగాయన్నారు.
తాము ప్రజా వ్యతిరేకతతో ఓడిపోలేదన్న జగన్
ప్రజా వ్యతిరేకతతో తాము ఓడిపోలేదని జగన్ అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల వల్ల పదిశాతం ఓట్లు అటు మారిపోయాయన్నారు. అయినా హామీలు అమలు చేయడం లేదన్నారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అమలు చేయాల్సినవి చేయలేదన్నారు. పిల్లలకు ఇస్తామన్న నగదును స్కూల్స్ ప్రారంభమైనా ఇవ్వలేదన్నారు. ఇప్పటి వరకూ రైతు భరోసా ఇవ్వలేదని .. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయినా రైతులకు సాయం అందించలేదని విమర్శఇంచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారని జగన్ జైలు ముందు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆరోపించారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుండి టీడీపీ విధ్వంసాలు
జగన్ కేవలం చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మడం వల్లనే వైసీపీ ఓటమి పాలయిందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ విధ్వంసాలకు దిగుతుందని వైసీపీ క్యాడర్‌ను, నేతలను భయాందోళనలకు గురి చేయాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎవరిస్థాయిలో వాళ్లు రెడ్ బుక్ ను పెట్టుకుని ఉన్నారన్నారు. ప్రతి వైసీపీ కార్యకర్త ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్నారు. దొంగకేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఐదేళ్లలో వైసీపీ పరిపాలనలో అన్ని వర్గాల వారికి పథకాలను అందించామన్నారు. కేవలం టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారన్నారు. వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి రాజకీయాలు నిలబడవన్నారు.
ఈవీఎం పగులగొట్టిన కేసులో బెయిలొచ్చింది !
ఈవీఎంలనుపగుల గొట్టిన కేసులో పిన్నెల్లిని అరెస్టు చేయలేదని జగన్ తెలిపారు. అన్యాయం జరుగుతోందని తెలిసి అడ్డుకునే ప్రయత్నం చేశారని కోర్టు గుర్తించే బెయిల్ ఇచ్చిందన్నరు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పదిరోజుల తర్వాత హత్యాయత్నం చేశాడని కేసు పెట్టారన్నారు.
స్వాగతం పలికేందుకు జన సమీకరణ చేసిన అనిల్ కుమార్
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన జగన్ కు స్వాగతం చెప్పడానికి స్థానిక నేతలు జన సమీకరణ చేశారు. నర్సరావుపేట నుంచి పోటీ చేసినా మాజీ మంత్రి అనిల్ ఎక్కువగా హడావుడి చేశారు. దీంతో కొంత మంది సీనియర్ నేతలు జగన్ పర్యటనపై పెద్దగా ఆసక్తి చూపలేదు.