Govt Documents Burnt: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చాలా అనుమానాలకు తావిస్తోంది. అలాంటి ఘటనే కృష్ణానది ఒడ్డున జరిగింది. బుధవారం రాత్రి ఏవో ఫైల్స్‌ను ఓ వ్యక్తి తగలబెడుతున్నారు. అక్కడే ఉన్న స్థానికులు చూసి ఏంటి ప్రశ్నించారు. అప్పుడుగానీ అర్థం కాలేదు అవి ప్రభుత్వానికి చెందిన ఫైల్స్ అని. విషయం తెలుసుకున్న వారంతా తగలబెట్టడాన్ని ఆపి ఏం జరిగిందని ప్రశ్నించడం మొదలు పెట్టారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీ(YSRCP) ప్రభుత్వంలో కీలక వ్యవహరించిన నేతలు, అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. అందుకు ఊతమిచ్చేలా నిన్న రాత్రి ఫైల్స్ తగలపెట్టే ఘటన ఉంది. కృష్ణా జిల్లా(Krishna District) పెనమలూరు(Penamaluru)లో రోడ్డుపక్కన పెద్దఎత్తున తగలపడుతున్న దస్త్రాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాటిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy) ఫొటోలు ఉండటంతో ఆ దస్త్రాలు తీసుకొచ్చిన కారు డ్రైవర్‌ను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అవన్నీ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు(Pollution Control Board) ఛైర్మన్ సమీర్‌శర్మ (Sameer Sharma)ఆదేశాలతోనే ధ్వంసం చేసినట్లు డ్రైవర్ తెలిపాడు..
దస్త్రాలు దహనంతో కలకలం
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పెదపులిపాక వద్ద నిర్మానుష్యం ప్రదేశంలో పెద్దఎత్తున దస్త్రాలు తగులబెట్టడం కలకలం రేపింది. కారులో దస్త్రాలు తీసుకొచ్చిన దుండగులు వాటికి నిప్పంటించి తగులబెట్టారు. వాటిపై మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫొటోలతోపాటు, విశాఖ(Visakha)కు చెందిన కొన్ని దస్త్రాలు ఉన్నట్లు గుర్తించిన స్థానిక తెలుగుదేశం నేతలు గుర్తించి ఎమ్మెల్యే బోడె ప్రసాద్(Bode Prasad)కు తెలియజేశారు. స్థానికుల రాకను గమనించి కారులో పరారవుతుండగా...అప్పటికే ఎమ్మెల్యే పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు వచ్చి పారిపోతున్న కారును అడ్డగించి పట్టుకున్నారు.
కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ది(APMDC) సంస్థలకు చెందిన బస్తాలకొద్దీ దస్త్రాలను దహనం చేశారు. వీటిల్లో కొన్ని హార్డ్‌డిస్కులు సైతం ఉన్నాయన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సీఎంవోకు చెందిన పత్రాలు సైతం ఉన్నాయన్నారు. బుధవారం రాత్రి సరిగ్గా 9 గంటలకు ఓ ఇన్నోవా వాహనంలో కరకట్టపైకి చేరుకున్నారు. వాహనంపై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ కూడా ఉంది. అందులో నుంచి గుట్టల కొద్దీ దస్త్రాలు బయటకు తీసి తగలబెట్టడం మొదలుపెట్టారు. అటుగా వెళ్తున్న తెలుగుదేశం కార్యకర్త...ఆ పత్రాలపై మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫొటో ఉండటాన్ని గమనించి...వెంటనే ఎమ్మెల్యేకు, తెదేపా నేతలకు సమాచారం ఇచ్చారు. వారు వెంబడించి నిందితులను పట్టుకున్నారు. డ్రైవర్ నాగరాజును గట్టిగా నిలదీయడంతో పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు ఛైర్మన్ సమీర్‌శర్మ(Sameer Sharma) సూచనలతోనే ఈ ఫైళ్లు తగులబెట్టినట్లు అంగీకరించాడు.
కాలిపోయిన ఫైళ్లలో కీలక సమాచారం..!
గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ అనేక ఆరోపణలు చేసింది. గనులశాఖ మంత్రిగానూ ఉన్న ఆయన హయాంలోనే రాష్ట్రంలో విలువైన ఖనిజ సంపద మొత్తం దోపిడీకి గురైందని విమర్శించింది. ఇసుక, మట్టి విచ్చలవిడిగా తవ్వేసుకున్నారని చంద్రబాబు, పవన్ కూడా మండిపడ్డారు. ముఖ్యంగా ఇసుక తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించిన మరుసటి రోజే కీలక దస్త్రాలు తగులబెట్టడం అనుమానాలకు తావిస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. గనులు, ఇసుక తవ్వకాలపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించి ఉంటారని...అందుకే దస్త్రాలు మాయం చేసేందుకు వాటిని కాల్చివేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం లోతుగా విచారణ జరిపిస్తే....కీలక విషయాలు భయటపడే అవకాశం ఉందని అంటున్నారు. కాలిపోయిన దస్త్రాల్లో హార్డ్‌డిస్కులు, సీఎంవోకు చెందిన సమాచారం ఉందని ప్రత్యక్షసాక్షులు చెప్పడం చూస్తే..చాలా విలువైన సమాచారమే కాల్చివేసినట్లు తెలుస్తోందని అనుమాన పడుతున్నారు.