Homemade Vegetable Biryani : ఆఫీస్​కి వెళ్లేప్పుడు ఏమి తీసుకెళ్లాలి.. పిల్లలకి ఈ రోజు స్పెషల్ ఏమి చేయాలి? ఇంట్లో ఉంటే లంచ్ ఏమి చేసుకోవాలి.. ఈ ఆలోచనే చాలామందిలో ఉంటుంది. అయితే కుక్కర్​లో ఈజీగా, టేస్టీగా చేసుకోగలిగే వెజిటేబుల్ రైస్ రెసిపీ ఇక్కడ ఉంది. బ్యాచిలర్స్​ కూడా ఈ టేస్టీ రెసిపీని చేసుకోవచ్చు. ఉదయాన్నే చేసుకుంటే.. కాస్త టిఫెన్​గా, మరికాస్త లంచ్​కి తీసుకెళ్లిపోవచ్చు. సమయం కూడా ఆదా అవుతుంది. మరి ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో? ఏ విధంగా చేస్తే టేస్ట్ అదిరిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


బాస్మతి రైస్ - 2 కప్పులు


నూనె - 3 టేబుల్ స్పూన్స్


నెయ్యి - 2 టేబుల్ స్పూన్స్


మరాఠి మొగ్గ - 2


లవంగాలు - 7


దాల్చిన చెక్క - 2 ఇంచులు


షాజీరా - అర టేబుల్ స్పూన్


యాలకులు - 5


బిర్యానీ ఆకు - 2


ఉల్లిపాయ -1 


పచ్చిమిర్చి - రెండు 


అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్


పసుపు - పావు టీస్పూన్


ఉప్పు - రుచికి తగినంత 


జీలకర్ర పొడి - 1 టీస్పూన్ 


కారం - 1 టీస్పూన్


గరం మసాలా - అర టీస్పూన్


ధనియాల పొడి - 1 టీస్పూన్


టమోటా - 2


పెరుగు - అరకప్పు


పుదీనా - 3 టేబుల్ స్పూన్లు


కొత్తిమీర- మూడు టేబుల్ స్పూన్లు 


బఠాణీలు- పావు కప్పు


క్యారెట్ - అర కప్పు


వేడి నీళ్లు - 3 కప్పులు


బేబీకార్న్ - అరకప్పు


మిల్ మేకర్ - 1 కప్పు


తయారీ విధానం


ముందుగా బాస్మతీ రైస్​ను కడిగి అరగంట నానబెట్టుకోవాలి. బఠాణీలు కూడా కడిగి విడిగా నానబెట్టుకోవాలి. కూరగాయలు అన్ని ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి మాత్రం సన్నగా తురుముకోవాలి. కొత్తిమీర, పుదీనాను కూడా సన్నగా తురమాలి. మిల్​ మేకర్​ను కూడా వేడి నీళ్లలో నానబెట్టాలి. ఇప్పుడు స్టౌవ్​ వెలిగించి దానిపై కుక్కర్ పెట్టాలి. అది వేడి అయ్యాక దానిలో నూనె వేయాలి. నెయ్యి కూడా వేసుకోవాలి. అవి వేడి అయ్యాక.. దానిలో మరాఠి మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, అనాస పువ్వు వేసుకోవాలి. వాటిని ఓ పది సెకన్లు వేయించాలి. వాటిలోనే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. 


కేవలం పదిసెకన్లు వేయించిన తర్వాత సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడు దీనిలో ఓ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. దానిలో బేబికార్న్ ముక్కలను వేయాలి. అవి వేగడానికి కాస్త సమయం పడుతుంది. దానిలో క్యారెట్ ముక్కలు వేయండి. ఈ రెండు కలిసి మంచిగా వేగుతాయి. ఇప్పుడు మిల్​మేకర్ కూడా వేసి వేయించుకోవాలి. అనంతరం వాటిలో సాల్ట్ వేయండి. జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు వాటిలో టమోటా ముక్కలు వేయాలి. 


టమోటో ముక్కలు మంచిగా ఉడికేవరకు మగ్గనివ్వాలి. అప్పుడు దీనిలో పావు కప్పు పెరుగు, పుదీనా ఆకులు వేసుకోవాలి. కొత్తిమీర తురుము కూడా వేసి.. పెరుగు కూరలో పూర్తిగా కలిసేవరకు కలపాలి. పెరుగు దానిలో కలిసిపోయి.. నూనె పైకి తేలుతూ ఉంటుంది. ఈ సమయంలో నానబెట్టుకున్న బియ్యం వేయాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బఠాణీ వేసుకుని బాగా కలపాలి. బియ్యం చెమ్మ ఆరిపోయిన తర్వాత.. మూడుకప్పుల వేడి నీరు వేయాలి. ఇప్పుడు కుక్కర్ మూతపెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ. 



కూరగాయలు పిల్లలు నేరుగా తినకపోతే ఇలాంటి వెజిటెబుల్ రైస్ చేసి వారికి తినిపించేయవచ్చు. పిల్లలే కాదు.. పెద్దలు కూడా దీనిని ఇష్టంగా తింటారు. దీనిలోకి రైతా మంచి కాంబినేషన్ అవుతుంది. పచ్చళ్లు కూడా దీనిలో కలిపి తినొచ్చు. అంతేకాకుండా వెజ్ కర్రీ అయినా.. నాన్​ వెజ్​ కర్రీ అయినా దీనికి మంచి కాంబినేషన్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టేస్టీ, హెల్తీ వెజిటెబుల్ బిర్యానినీ చేసేయండి. 


Also Read : టేస్టీ, హెల్తీ గార్లిక్ రైస్.. లంచ్ బాక్స్​కోసం ఈ సింపుల్ రెసిపీని ఫాలో అయిపోండి