Singapore New Covid Wave: 


శీతాకాలంలో వైరస్ యాక్టివ్..


కొత్త ఏడాది వేడుకలు, సెలవుల కారణంగా మరో కొవిడ్ వేవ్ రావచ్చని సింగపూర్ హెల్త్ మినిస్టర్ ఆంగ్ యే కుంగ్ అంచనా వేశారు. దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు. "బహుశా ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమవుతుండొచ్చు. అది కూడా మనం మును పెన్నడూ చూడని స్థాయిలో" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా ఓ కాలేజీలోని కార్యక్రమానికి హాజరైన  ఆయన చేసిన ఈ కామెంట్స్ సింగపూర్ ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. "ఈ ఒక్క ఏడాదే మనం మూడు వేవ్స్‌ని చూశాం. మరో వేవ్‌ కూడా రాబోతుంది" అని తేల్చి చెప్పారు. సింగపూర్‌లో ఈ ఏడాది  మార్చిలో BA.2 Omicron వేరియంట్ తీవ్ర ప్రభావం చూపించింది. ఆ తరవాత జూన్‌, జులైలో  BA.5 సబ్ వేరియంట్ వ్యాప్తి చెందింది. అక్టోబరన్, నవంబర్‌లో XBB వేరియంట్ ముప్పతిప్పలు పెట్టింది. ఇది దృష్టిలో ఉంచుకునే..హెల్త్ మినిస్టర్ అలా అన్నారు. మిగతా దేశాల్లోనూ కొవిడ్ పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది గమనిస్తూ ఉండాలని సూచించారు. శీతాకాలం అయినందున.. వైరస్ మళ్లీ యాక్టివ్‌ అయ్యి కొత్త వేవ్ వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు. చైనాలోని కొవిడ్‌ వ్యాప్తి గురించీ ప్రస్తావించారు. "చైనాలో కొవిడ్ ఆంక్షల్ని తగ్గించే పనిలో ఉన్నారు. ఒకవేళ అదే జరిగితే వైరస్ ఎక్కువ మందికి సోకే ప్రమాదముంది. అక్కడి జనాభా ఎక్కువ అవడం వల్ల త్వరగా కొత్త వేవ్‌లు పుట్టుకొచ్చే అవకాశముంటుంది" అని అన్నారు. 


సౌమ్య స్వామినాథన్ కూడా..


ఒమిక్రాన్‌ వేరియంట్‌తో మరో  వేవ్ వచ్చే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గతంలో వెల్లడించారు. కొన్ని దేశాల్లో ఇంకో కొవిడ్ వేవ్ వచ్చే అవకాశముందని చెప్పారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB వ్యాప్తి చెందుతుందని అంచనా వేస్తున్నారు. డెవలపింగ్ కంట్రీస్ వ్యాక్సిన్ మ్యానుఫాక్చర్స్ నెట్‌వర్క్ (DCVMN)జనరల్ మీటింగ్‌లో మాట్లాడిన సందర్భంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మరో వేవ్ వస్తుందన్న అంచనాలున్నప్పటికీ...అది తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతుందనటానికి ఎలాంటి క్లినికల్ ఎవిడెన్స్‌లు లేవని వెల్లడించారు. "ఒమిక్రాన్‌కు 300 సబ్‌ వేరియంట్‌లున్నాయి. వీటిలో కాస్తో కూస్తో ప్రమాదకరమైందంటే XBB వేరియంట్. ఇది రీకాంబినెంట్ వైరస్. గతంలోనూ ఇలాంటి వైరస్‌లు వ్యాప్తి చెందాయి. ఇమ్యూనిటీని ఛేదించి మరీ వ్యాప్తి చెందే గుణం ఉంటుంది. యాంటీబాడీలనూ దాటుకుని వస్తుంది. అందుకే..XBB వేరియంట్‌తో మరో వేవ్ వస్తుండొచ్చు" అని సౌమ్య స్వామినాథ్ స్పష్టం చేశారు. BA.5,BA.1 డెరివేటివ్స్‌లనూ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నట్టు చెప్పారు. ఇవి కూడా ఇమ్యూనిటీని ఛేదించి వ్యాప్తి చెందే అవకాశముందని వెల్లడించారు. వైరస్ వ్యాప్తి వేగం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే...ఏ దేశంలో కొత్త వేవ్ వస్తుందన్న సమాచారం ప్రస్తుతానికి లేదని చెప్పారు. "నిత్యం మనం వైరస్‌ ప్రవర్తనను గమనిస్తూనే ఉండాలి. చాలా దేశాల్లో వైరస్ టెస్టింగ్ ప్రక్రియను నిలిపివేశారు. అంతా ప్రశాంతంగా ఉందని అధ్యయనాలనూ చేయటం లేదు. ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేయాల్సిన అవసరముంది. తద్వారా కొత్త వేరియంట్‌లు ఏం వస్తున్నాయో తెలుసుకునే అవకాశముంటుంది" అని సౌమ్యస్వామినాథన్ స్పష్టం చేశారు.


Also Read: Putin's Health: షాకింగ్ న్యూస్- మెట్లపై నుంచి జారిపడిన పుతిన్- విరిగిన ఎముక!