Putin's Health: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి పుతిన్ (70) జారిపడినట్లు న్యూయార్క్‌ పోస్టు వెల్లడించింది.






విరిగిన ఎముక


పుతిన్ మెట్లు దిగుతుండగా కాలు జారడంతో ఐదు మెట్లకు కింద పడిపోయినట్లు తెలిపింది. దీంతో పుతిన్‌ తుంటి ఎముక విరిగిపోయినట్లు పేర్కొంది. దీనికారణంగా అతని ప్రమేయం లేకుండానే మలమూత్ర విసర్జన జరుగుతుందని నివేదికలో తెలిపింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. అయితే దీనిపై క్రెమ్లిన్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.


పుతిన్‌ రక్షణ సిబ్బందితో సన్నిహిత సంబంధాలున్న ఓ టెలిగ్రామ్‌ ఛానెల్‌ చెప్పిన విషయాలను ఈ సందర్భంగా న్యూయార్క్‌ పోస్ట్‌ ఉటంకించింది.


రంగు మారిన చేతులు


పుతిన్ ఆరోగ్యం గురించి వార్తలు రావడం ఇదేం తొలిసారి కాదు. ఆయన క్యాన్సర్ బారిన పడినట్లు, తీవ్ర అనారోగ్యంగా ఉన్నట్లు చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఇటీవల క్యూబా అధ్యక్షుడు మిగుయేల్‌ డియాజ్‌తో ద్వైపాక్షిక భేటీ సందర్భంగా వారిద్దరూ కరచాలనం చేసుకుంటున్న సందర్భంలో తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.


ఫొటోలో పుతిన్‌ చేతులు పర్పుల్‌ రంగులో ఉన్నాయి. దీనిపై బ్రిటన్‌ ఆర్మీ మాజీ అధికారి, హౌస్‌ సభ్యుడు లార్డ్స్‌ రిచర్డ్‌ దనత్‌ కూడా స్పందించారు. చేతులపై ఉన్న మచ్చలను నిశితంగా పరిశీలిస్తే.. ఇంజక్షన్‌ సూదులు గుచ్చడం వల్ల ఏర్పడినట్లుగా కనిపిస్తోందని ఆయన అన్నారు. దానివల్లే బహుశా చేతులు రంగుమారి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.


యుద్ధం


మరోవైపు ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నుంచి రష్యా బలగాలు వెనక్కి వెళ్లిపోవడాన్ని ఏ దేశమూ ఊహించలేదు. అప్పటికే...రష్యాపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఆ దేశ సైనికులూ భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా...పుతిన్ ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు. అయితే...పుతిన్ నిర్ణయాన్ని ఓటమిగా భావించవచ్చని అంటోంది ఓ నివేదిక. రష్యన్ ఇండిపెండెంట్ న్యూస్ మ్యాగజైన్ "Meduza"లో రష్యా సైనికుల ఉపసంహరణపై వచ్చిన వార్తలు అదే సూచిస్తున్నాయి.


"చాలా బాధాకర" స్థితిలో రష్యా ఈ నిర్ణయం తీసుకుందని అందులో పేర్కొంది. "ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఒకటి స్పష్టంగా అర్థమవుతోంది. యుద్ధంలో మేం ఓడిపోతున్నామనటానికి ఇది సంకేతం కావచ్చు. రష్యా సైనికులు ఉక్రెయిన్‌లో ఎలా మనుగడ సాగించాలో ఆలోచిస్తున్నారు. ఏ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకోవాలి..? ఎంత వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలి..? అని ఆలోచిస్తున్నారు. మరోవైపు...పరిస్థితులు సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని ఆ మ్యాగజైన్ వెల్లడించింది. అయితే..పుతిన్ ఇంకా నమ్మకం కోల్పోలేదని...ఉక్రెయిన్‌లో తనకు అనకూల అధ్యక్షుడు అధికారంలోకి వస్తే ఉక్రెయిన్‌ను సులువుగా హస్తగతం చేసుకోవచ్చని భావిస్తున్నారని తెలిపింది. పుతిన్ ఆశాభావం ఉన్న వ్యక్తి అని చెప్పింది. "ఉక్రెయిన్ రాజకీయాల్లో భారీ మార్పులు వస్తే పుతిన్‌కు అదో గొప్ప అవకాశమవుతుంది. అధ్యక్షుడు జెలెన్‌స్కీ రాజీనామా చేస్తే...రష్యాకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కానీ..ఇలాంటివి ఆశించటం అప్రస్తుతమే అవుతుంది" అని పేర్కొంది.


Also Read: Harish Rawat on POK: మోదీజీ, ఇదే సరైన టైమ్- పీఓకేను లాగేసుకోండి: మాజీ సీఎం