చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై దాడి జరిగింది. గత ఎన్నికల్లో ఆయన జనసేన తరఫున పోటీ చేశారు. నియోజకవర్గంలో రైతు సమస్యలపై రైతు భేరీ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
సభకు వెళ్లకుండా రాచంద్రయాదవ్‌ను అడ్డుకున్న పోలీసులు సాయంత్రం ఐదున్నర గంటలకు వదిలేశారు. తర్వాత తన అనుచరరులతో కలిసి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి క్షీరాభిషేకం చేశారు. తర్వాత అనుచరులంతా ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. అనంతరం రామచంద్రయాదవ్ ఇంటిపై దాడి జరిగింది. ఇది చేసింది వైసీపీ కార్యకర్తలేనంటూ ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. రైతుల సమస్యలపై సభ తలపెట్టామని.. దీన్ని జీర్ణించుకోలేకే తమ ఇంటిపై దాడి చేశారని ఆయన అనుచరులు విమర్శిస్తున్‌నారు.
ఆదివారం రాత్రి పుంగనూరు పట్టణం కొత్తిండ్లు ఎల్‌ఐసీ కాలనీలో ఉన్న ఇంటికి వెళ్లి కొందరు యువకులు వీరంగం సృష్టించారు. కర్రలు, రాళ్లతో తలుపులు, అద్దాలు పగలకొట్టి లోపలకు వెళ్లి, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పార్క్ చేసి ఉన్న కార్లు, బైక్‌లపై విరుచుకపడ్డారు. ఈ దుర్ఘటనలో ఆరు కార్లు, మరిన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి.
అదే ఇంట్లో ఉన్న తను తన ఫ్యామిలీ ఓ గదిలో దాక్కొని ప్రాణాలతో బయట పడ్డామంటున్నారు రామచంద్రయాదవ్. తమ నాయకుడు సదుం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు ఇంత దాడి జరిగినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు ఆయన సన్నిహితులు. సుమారు 200 మంది వచ్చి దాడి చేశారని చెబుతున్నారు.
వచ్చిన వాళ్లంతా తాళాలు పగలగొట్టి... ఇంట్లోకి ప్రవేశించారు. సుమారు అరగంట పాటు వీరంగం సృష్టించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని రామచంద్రయాదవ్ అనుచరులు ఆరోపిస్తున్నారు. వచ్చిన వారిని బతిమలాడి పంపిస్తున్నారే తప్ప దాడి చేస్తున్న వారిపై సీరియస్‌గా రియాక్ట్ కాలేదంటున్నారు.
రామచంద్రయాదవ్ అనుచరుల ఆరోపణలను పోలీసులు ఖండిస్తున్నారు. కొందరు వ్యక్తులు మద్యం మత్తులో రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి చేశారని చెప్పారు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్నామన్నారు. ఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్టు వివరించారు. దీనిపై ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అందుకే కేసు రిజిస్టర్ చేయలేదని వివరిస్తున్నారు.
తమపై వస్తున్న ఆరోపణలను వైసీపీ లీడర్‌లు ఖండిస్తున్నారు. రాత్రికి రాత్రే ఎదగాలని అనుకుంటున్న రామచంద్ర యాదవ్... ఇలాంటి పన్నాగాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ దాడిపై వైసీపీ లీడర్లు అనుమాం వ్యక్తం చేస్తున్నారు.