Siddipet MLA Harishrao Wishes to Biggboss Winner Pallavi Prasanth: బిగ్ బాస్ - 7 విజేతగా నిలిచిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prasanth) కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) అభినందనలు తెలిపారు. సిద్ధిపేటకు చెందిన రైతుబిడ్డ విజేతగా నిలిచినందుకు గర్వంగా ఉందన్నారు. 'పల్లవి ప్రశాంత్ అనే పేరు రైతు ఇంటిపేరుగా మారింది. ఈ సీజన్ లో సామాన్యుల ధృడత్వానికి ప్రతీకగా నిలిచింది. పొలాల నుంచి బిగ్ బాస్ హౌస్ వరకూ అతని ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. తనదైన వైవిధ్యాన్ని ప్రదర్శించింది.' అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.
ఇదీ కుటుంబ నేపథ్యం
తెలంగాణలో వ్యవసాయమే జీవన ఆధారంగా జీవించే ఒక రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి పల్లవి ప్రశాంత్. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు పల్లవి ప్రశాంత్ స్వగ్రామం. తండ్రి సత్తెయ్య రైతు. డిగ్రీ వరకూ చదువుకున్న ప్రశాంత్, ముందుగా ఓ యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించి తన డైలీ లైఫ్ గురించి, తన ఊరి విశేషాల గురించి, తన పని గురించి రొటీన్‌గా వీడియోలు చేస్తూ ఉండేవాడు. అలా మెల్లగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఫేమస్ అయ్యాడు. అప్పటివరకు తనకు ఉన్న యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్ అందరూ తన ఫాలోవర్స్‌గా మారారు. దీంతో 555కే ఫాలోవర్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిపోయాడు. ‘అన్నా.. రైతుబిడ్డని అన్నా.. మళ్లొచ్చినా’ అంటూ వీడియో మొదలవ్వగానే తన ఫాలోవర్స్‌ను పలకరించేవాడు ప్రశాంత్. ఇక అదే డైలాగ్‌తో ఫేమస్ కూడా అయ్యాడు. బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చినప్పుడల్లా ఈ డైలాగ్‌ను ఉపయోగించేవాడు.
స్టూడియో చుట్టూ తిరిగాడు..
బిగ్ బాస్ అనే రియాలిటీ షో ప్రారంభం అయినప్పటి నుంచి తనకు కూడా ఆ షోపై ఆసక్తి పెరిగింది. మామూలుగా బిగ్ బాస్‌పై రివ్యూలు ఇస్తూ.. వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. తనకు ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా అవకాశం దొరుకుతుందేమో అని అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరకు కూడా చాలాసార్లు వచ్చివెళ్లేవాడు. కానీ అవకాశం రాలేదు. దీంతో తనకు ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ సాయం తీసుకున్నాడు. తాను చేసే బిగ్ బాస్ రీల్స్‌ను, వీడియోలను వైరల్ చేసి.. ఎలాగైనా తనను బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా చేయమని ఫాలోవర్స్‌ను కోరాడు. చాలాసార్లు ఇదే విషయాన్ని చెప్తూ తన వీడియోల్లో ప్రశాంత్ కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. అలా తన బిగ్ బాస్ వీడియోలు వైరల్ అయ్యి.. బిగ్ బాస్ నుంచి తనకు పిలుపు వచ్చింది.
కామన్ మ్యాన్ గా వెళ్లి విజేతగా
మట్టినే నమ్ముకున్న రైతు కుటుంబం నుంచి వచ్చిన ఓ సామాన్య యువకుడు పల్లవి ప్రశాంత్, సోషల్ మీడియాలో 'రైతు బిడ్డ'గా ట్రెండ్ సృష్టించి తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, బిగ్ బాస్ హౌస్ లో ప్రతి టాస్క్ ను ప్రాణం పెట్టి ఆడాడు. అందరి మనసులు నిలిచి గెలిచాడు. ఓ సామాన్యుడు అసామాన్య విజేతగా బిగ్ బాస్ 7 విన్నర్ గా నిలిచాడు.
గెలిచిన డబ్బులు రైతులకే
'రూ.35 లక్షలను రైతుల కోసం ఇస్తాను. కష్టాల్లో ఉన్న ప్రతీ ఒక్క రైతుకు ఇస్తా. పొట్ట మీద చేయి వేసుకొని చెప్తున్నా. మాట తప్పేదే లేదు. మళ్లీ వచ్చా అంటే తగ్గేదే లే. రైతుల కోసం ఆడినా, కారు నాన్నకు ఇస్తా, నక్లెస్ అమ్మకు ఇస్తా. డబ్బు జనాలకు ఇస్తా' అంటూ మరోసారి బిగ్ బాస్‌లోకి వచ్చింది డబ్బు కోసం కాదని గుర్తుచేశాడు పల్లవి ప్రశాంత్. ప్రశాంత్ గొప్ప మనసుకు ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. ఇక తను విన్నర్ అవ్వడంతో ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో రచ్చ మొదలుపెట్టారు. శివాజీ ఫ్యాన్స్ సైతం ప్రశాంత్ విన్నర్ అవ్వడాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తను విన్నర్ అవ్వకపోయినా.. తన శిష్యుడు పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడంతో సంతోషపడ్డాడు శివాజీ.
అందరి భావోద్వేగం
పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7లో విన్నర్ అవ్వడంతో తను హౌజ్‌లో ఎలా ఉన్నాడు, ఎలా ఆడాడు అన్న విషయాలను ప్రేక్షకులు గుర్తు చేసుకున్నారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా.. తనకు ఎంత కోపం వచ్చినా కంట్రోల్‌లో ఉంటూ.. నామినేషన్స్ సమయంలో మాత్రమే వాదిస్తూ ఉండేవాడు ప్రశాంత్. ఇక టాస్కులు విషయానికొస్తే.. పల్లవి ప్రశాంత్‌కు ఉన్నంత ఫోకస్ మరే ఇతర కంటెస్టెంట్‌ను లేదని.. తన తోటి కంటెస్టెంట్సే ఒప్పుకున్నారు. అందుకే పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన సందర్భంగా.. తన తోటి మాజీ కంటెస్టెంట్స్ అంతా వచ్చి అతనికి కంగ్రాట్స్ తెలిపారు. పల్లవి ప్రశాంత్‌తో పాటు తన తల్లిదండ్రులు కూడా స్టేజ్‌పై ఎమోషనల్ అయ్యారు.