Shraddha Murder Case: ప్రియురాలిని హత్య చేసి ముక్కలుగా నరికేసిన కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై హత్యా యత్నం జరిగింది. అఫ్తాబ్ ప్రయాణిస్తోన్న పోలీసు వాహనంపై కత్తులతో కొందరు దాడి చేశారు.
ఇదీ జరిగింది
సోమవారం దిల్లీలోని రోహిణి ప్రాంతంలో పోలీస్ వ్యాన్‌పై దాడి చేసేందుకు కొంత మంది ప్రయత్నించారు. అఫ్తాబ్‌ను చంపేందుకు హిందూ సేన అనే సంస్థ ప్రయత్నం చేసినట్లు సమాచారం. దీనికి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అఫ్తాబ్‌ను పాలిగ్రాఫ్ పరీక్ష తర్వాత పశ్చిమ దిల్లీ రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నుంచి జైలుకు తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగింది. పోలీసు వ్యాన్‌పై కూడా కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు.
దాడి జరిగినప్పుడు సబ్ ఇన్‌స్పెక్టర్‌తో సహా ఐదుగురు పోలీసులు అఫ్తాబ్‌తో పాటు పోలీసు వ్యాన్‌లో ఉన్నారు. దాడి తర్వాత, ఒక పోలీసు అధికారి వాహనం నుంచి బయటకు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తన తుపాకీని చూపారు.
చంపేస్తాం
వ్యాన్‌పై దాడి చేసిన వారిలో ఒక వ్యక్తి ఆగ్రహంగా మాట్లాడాడు. అఫ్తాబ్‌ను చంపి తీరతామని హెచ్చరించాడు.
అయితే ఈ దాడిపై హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు శర్మ స్పందించారు.
"శ్రద్ధా హత్య ప్రతి పౌరుడిని ఆగ్రహానికి గురి చేసింది. దాడి చేసిన వారితో మాకు ఎటువంటి సంబంధం లేదు" అని విష్ణు శర్మ ABP లైవ్‌తో అన్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రశాంత్ విహార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
శ్రద్ధా హత్య
తన ప్రియురాలు శ్రద్ధాను.. అఫ్తాబ్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన ఇటీవల సంచలనంగా మారింది. శ్రద్ధా తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని, దీని వల్ల వారి మధ్య తరచూ గొడవలు జరగినట్లు అఫ్తాబ్ తెలిపాడు. మే నెలలో శ్రద్ధాను దారుణంగా చంపి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. నగరంలోని పలు ప్రాంతాల్లో పారేసినట్లు ఒప్పుకున్నాడు.
అఫ్తాబ్ అమీన్ పూనావాలా (Aftab) గురించి రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. 28 ఏళ్ల యువకుడు ఇంత కిరాతకంగా హత్య చేసి, దీని నుంచి తప్పించుకునేందుకు చేసిన పనులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అయితే ఆ యువకుడు 'డెక్స్‌టర్' (Web Series Dexter) అనే డ్రామా వెబ్ సిరీస్ ద్వారా 'స్పూర్తి' పొందాడని దర్యాప్తులో తేలింది.
Also Read: Assam News: ర్యాగింగ్ భరించలేక బిల్డింగ్ పైనుంచి దూకేసిన విద్యార్థి- ఘటనపై సీఎం సీరియస్!