NCRB Report on Spurious Liquor:


దేశవ్యాప్తంగా మరణాలు..


బిహార్‌లో కల్తీ మద్యం కలకలం రేపింది. రెండు జిలాల్లో పదుల సంఖ్యలో ఈ మద్యం బారిన పడి మృతి చెందారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఈ మరణాలు సంచలనమయ్యాయి. రాజకీయాలూ వేడెక్కాయి. నితీష్ ప్రభుత్వంపై బీజేపీ విరుచుకు పడుతోంది. అటు...నితీష్ కుమార్ కూడా బీజేపీకి గట్టి బదులిస్తున్నారు. ఈ క్రమంలోనే...National Crime Records Bureau (NCRB) కీలక గణాంకాలు వెల్లడించింది. ఆరేళ్లలో దేశవ్యాప్తంగా 7 వేల మంది కల్తీ మద్యానికి బలి అయ్యారని తెలిపింది. మధ్యప్రదేశ్, కర్ణాటక, పంజాబ్‌లో అత్యధిక మరణాలు నమోదయ్యాయని పేర్కొంది. బిహార్‌లో కేవలం రెండు మూడు రోజుల్లోనే  30 మందికిపైగా మృతి చెందారు. బిహార్‌లో 2016 నుంచే మద్య నిషేధం అమల్లో ఉంది. ఆ ఏడాదిలో దేశవ్యాప్తంగా 1,054 మంది కల్తీ మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 2017లో 1,510 మంది 2018లో 1,365 మంది...2019లో 
1,296 మంది బలి అయ్యారు. 2020లో 947 మంది, 2021లో 782 మందిని కల్తీ మద్యం బలి తీసుకుంది. 2016-21 మధ్య కాలంలో మొత్తంగా 6,594 మంది మృతి చెందారు. అంటే...సగటున రోజుకు కనీసం ముగ్గుర్ని కల్తీ మద్యం కాటేస్తోంది. ఆరేళ్లలో ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో 1,322 మంది, కర్ణాటకలో 1,013 మంది...పంజాబ్‌లో 852 మంది మృతి చెందారు. 


పెరుగుతున్న మృతుల సంఖ్య...


బిహార్​లో కల్తీ మద్యం కల్లోలం రేపుతోంది. మరణాల సంఖ్య 70 దాటిపోయింది. అయితే కల్తీ మద్యం సేవించి ఇప్పటివరకూ 200 మందికి పైగా మరణించారని, బిహార్ ప్రభుత్వం ఆ విషయాన్ని దాచిపెట్టిందని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. పోస్ట్‌మార్టం నిర్వహిచకుండానే అంత్యక్రియలు నిర్వహించాలని బాధితుల కుటుంబాలపై ప్రభుత్వం ఒత్తిడి చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మౌనం వహించడాన్ని ప్రశ్నించారు. బిహార్ లోని ఛాప్రా జిల్లాతో పాటు సరన్, సివాన్, బెగుసరాయ్ జిల్లాల్లో కల్తీ మద్యం మరణాలు నమోదవుతున్నాయి. వారి మరణానికి మద్యం సేవించడం కారణమని చెప్పకూడదని, లేదంటే వారిని జైలుకు పంపుతామని ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని, సీఎం మౌనం, అధికారుల మద్దతు మరిన్ని అనుమానాలకు కారణం అని జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ ఆరోపించారు. మద్యపానం నిషేధించిన రాష్ట్రం బిహార్ లో కల్తీ మద్యం మరణాలు ఆందోళన పెంచుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కల్తీ మద్యానికి బలయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.  మద్య నిషేధం పకడ్బందీగా అమలు చేస్తున్నామని స్పష్టం చేస్తున్నారు నితీష్ కుమార్. ఈ క్రమంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. "మద్యం సేవించిన వాళ్లెవరైనా సరే ఇలాగే ప్రాణాలు కోల్పోతారు. మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరపున పరిహారం కూడా ఇవ్వం. మేం ఎప్పటి నుంచో ఇదేచెబుతున్నాం. మద్యపానం గురించి సానుకూలంగా మాట్లాడే వాళ్లతో మీకు కలిగే ప్రయోజనమేమీ లేదు" అని అన్నారు. అసెంబ్లీ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందే మీడియాతో మాట్లాడిన సమయంలో "కల్తీ మద్యం సేవించిన వారెవరైనా ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటారు" అని తేల్చి చెప్పారు నితీష్ కుమార్. 


Also Read: PM Modi Speech: సవాళ్లకు రెడ్‌కార్డ్ చూపించాం, అభివృద్ధి చేశాం - ఫుట్‌బాల్ పరిభాషలో ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు