PM Modi in Shillong:


8 ఏళ్ల పాలనలో ఎంతో సాధించాం: మోడీ


ప్రధాని నరేంద్ర మోడీ షిల్లాంగ్‌లోని నార్త్ఈస్ట్ కౌన్సిల్ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాలకు హాజరయ్యారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫుట్‌బాల్ పరిభాషలో మాట్లాడి అందరినీ అలరించారు. 8 ఏళ్ల తమ పరిపాలనలో ఎన్నో అవాంతరాలకు రెడ్‌కార్డ్ చూపించి అభివృద్ధి దిశగా దూసుకుపోయామని స్పష్టం చేశారు. "ప్రపంచమంతా ఫుట్‌బాల్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటోంది. మనం మాత్రం ఎందుకు మాట్లాడుకోకూడదు. మ్యాచ్‌లో ఎవరైనా రూల్స్‌ పక్కన పెడితే, ఆటలోని స్ఫూర్తికి విరుద్ధంగా
నడుచుకుంటే వెంటనే రెడ్‌కార్డ్ చూపించి  బయటకు పంపేస్తారు. ఇదే విధంగా మేము గత 8 సంవత్సరాల్లో ఎన్నో సవాళ్లకు, అవాంతరాలకు రెడ్‌ కార్డ్ చూపించి ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేశాం" అని అన్నారు ప్రధాని మోడీ. అవినీతి, బంధుప్రీతి, హింస, ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలికేందుకు శక్తిమేర కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచే అసలైన ప్రాధాన్యతలను 
గుర్తించిందో... అప్పటి నుంచి దేశమంతా సానుకూల ప్రభావం కనిపించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. 






అమిత్‌షా వ్యాఖ్యలు..


అమిత్‌షా కూడా ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడారు. ఒకప్పుడు ఇక్కడ హింసాత్మక వాతావరణం కనిపించేదని, తమ పాలనలో ఈశాన్య రాష్ట్రాలు శాంతి దిశగా ముందడుగు వేస్తున్నాయని అన్నారు. 8 ఏళ్లక్రితంతో పోల్చితే...ఈ రాష్ట్రాలు ఎంతో పురోగతి సాధించాయమని స్పష్టం చేశారు. హింసాత్మక ఘటనలు 74% మేర తగ్గిపోయాయని గుర్తు చేశారు. బాంబు దాడులు, కాల్పులు లేని ఈశాన్య రాష్ట్రాలను చూస్తున్నామని చెప్పారు. AFSPని రద్దు చేయాలని చాలా మంది డిమాండ్ చేశారని, ఇప్పుడా అవసరం లేకుండా ప్రభుత్వమే ఆ పని చేసేందుకు చొరవ చూపుతోందని అన్నారు.