Salary Hikes 2024: ఏప్రిల్ వచ్చిందంటే అన్ని కంపెనీల్లోనూ అప్రైజల్స్ (Salary Hikes 2024) గురించి ఎదురు చూస్తుంటారు ఉద్యోగులు. ఎంత హైక్ వస్తుందోనని లెక్కలు వేసుకుంటారు. అయితే...కొవిడ్ క్రైసిస్ తరవాత చాలా సంస్థలు ఈ అప్రైజల్స్ విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నాయి. సంస్థలు నష్టాల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని కారణం చెబుతున్నాయి. కానీ...ఈసారి దాదాపు అన్ని సంస్థలూ నష్టాల నుంచి బయట పడ్డాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కూడా కుదురుకుంటున్న క్రమంలోనే ఈ సారి పలు సంస్థలు హైక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే Michael Page India Salary Guide 2024 ఇచ్చిన ఓ రిపోర్ట్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సీనియర్ లెవెల్ ఉద్యోగులకు ఈ సారి కనీసం 20% మేర హైక్ వచ్చే అవకాశాలున్నాయని ఊరిస్తోంది. మునుపటి కన్నా ఎకానమీ మెరుగ్గా ఉండడం వల్ల ఉద్యోగుల ప్రతిభకి (Appraisals 2024) తగిన విధంగా జీతాలు పెంచాలని ఆయా సంస్థలు భావిస్తున్నట్టు ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. అంతే కాదు. పలు కంపెనీలు రిక్రూట్‌మెంట్ యాక్టివిటీనీ పెంచనున్నాయి. ముఖ్యంగా మ్యానుఫాక్చరింగ్, ఆపరేషన్స్ సెక్టార్‌లలో పెద్ద ఎత్తున రిక్రూట్‌మెంట్‌ జరిగే అవకాశాలున్నాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది. 


ఈ ఉద్యోగులకు ఫుల్ డిమాండ్..


వీటితో పాటు డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ సెక్టార్‌లలోని ఉద్యోగులకు జాబ్‌ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దేశీయంగా పెట్టుబడులు పెరగడం, అంతర్జాతీయంగా ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుని నిలబడగలడం లాంటివి భారత్‌లోని జాబ్‌ మార్కెట్‌ని కాస్త సానుకూలంగా మార్చాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలమైన ఐటీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. జీతాలు పెంచే విషయంలో మునుపటి ఆలోచనలు మారిపోతున్నాయి. వ్యూహాలు మార్చుకుంటూ కనీసం 8-10% మేర హైక్‌లు ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు  Michael Page India Salary Guide 2024 రిపోర్ట్ వెల్లడించింది. కన్‌జ్యూమర్, ఫైనాన్స్, హెల్త్‌కేర్‌ రంగాల్లో పెట్టుబడులు పెరగడం వల్ల ఆర్థికంగా కుదురుకున్నాయి. 


ఏయే ఇండస్ట్రీలో ఎంత హైక్‌ అంటే..?


సెక్టార్‌ల వారీగా చూస్తే ఐటీ అండ్ టెక్నాలజీ సెక్టార్‌లో జూనియర్ ఎంప్లాయిస్‌కి 35-45% హైక్ వచ్చే అవకాశముందని ఈ రిపోర్ట్ తెలిపింది. ఇక మిడ్ లెవెల్ ఎగ్జిగ్యూటివ్స్‌కి 30-40%, సీనియర్ మేనేజ్‌మెంట్‌ విభాగంలోని ఉద్యోగులకు 20-30% మేర జీతాలు పెరిగే అవకాశాలున్నాయి. ప్రాపర్టీ, కన్‌స్ట్రక్షన్ సెక్టార్‌లో జూనియర్స్‌కి 20-45%, సీనియర్స్‌కి 20-40% అప్రైజల్ వచ్చే అవకాశముంది. అయితే...ఈ మధ్య కాలంలో భారత్‌లోని జాబ్ మార్కెట్‌లో చాలా మార్పులు వచ్చాయని ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. వర్క్ కల్చర్‌ మారడంతో పాటు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని అంటున్నారు. కేవలం జీతాల గురించే కాకుండా ఉద్యోగులు అన్ని కోణాల్లోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో ఇలాంటి సానుకూలమైన ఎంప్లాయ్‌మెంట్ ఇకోసిస్టమ్‌ ఉందని తేల్చి చెబుతున్నారు. కొవిడ్‌ సవాలుని దాటుకుని రావడంలో భారత్ సక్సెస్ అయిందని వెల్లడిస్తున్నారు. 
 


Also Read: Rahul Gandhi Assets: రాహుల్ గాంధీకి సొంత కారు, ఇల్లు లేవట - ఆయన పూర్తి ఆస్తుల వివరాలివే