Avanigadda JSP Candidate Mandali Buddhaprasad :  అవనిగడ్డ శాసన సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును  పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. గురువారం ఉదయం పవన్ కళ్యాణ్ గారు పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు. అవనిగడ్డ నుంచి ఆయనే బలమైన అభ్యర్థిగా నిర్ణయించి పేరును ఖరారు చేశారు. మండలి బుద్దప్రసాద్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  అంతకు ముందు పలుమార్లు ఆయన ఆ నియోజవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పట్టు ఉన్న నేత కావడంతో పవన్ కల్యాణ్ ఆయన వైపే మొగ్గు చూపారు. జనసేన పార్టీ టిక్కెట్ ఆశించిన బండ్రెడ్డి రామకృష్ణ, విక్కుర్తి శ్రీనివాస్ వంటి వాళ్లు నిరాశకు గురయ్యారు. 


రైల్వే కోడూరు అభ్యర్థి మార్పు 


మరో వైపు  రైల్వే కోడూరు స్థానానికి ఇప్పటికే  యనమల భాస్కరరావు పేరును ప్రకటించారు. ఈయన అభ్యర్థిత్వంపై సర్వేల్లో సానుకూలత రాలేదని జనేన వర్గాలు చెబుతున్నాయి.  మిత్ర పక్షమైన తెలుగుదేశం వైపు నుంచి కూడా అనుకూలత లేకపోవడంతో లోతుగా అధ్యయనం చేస్తున్నారు. యనమల భాస్కర్ రావు వైసీపీ ముఖ్య నేతలకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి అని ప్రచారం  జరుగుతోంది. ఈ కారణంగా ఆయనను మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. రైల్వేకోడూరు అభ్యర్థి మార్పుపై నేడో, రేపో ప్రకటన చేయనున్నారు. ఇక జనసేన పార్టీ ఖరారు చేయాల్సిన నియోజకవర్గం పాలకొండ ఒక్కటే. ఆ నియోజకవర్గం నుంచి కూడా టీడీపీ తరపున టిక్కెట్ ఆశించిన నిమ్మక  జయకృష్ణ జనసేన పార్టీలో చేరారు. ఆయనే బలమైన అభ్యర్థి అవుతారన్న అంచనాలు ఉన్నాయి. అయితే అంతర్గతంగా సర్వేలు నిర్వహించిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. 


జ్వరం కారణంగా ప్రచారానికి విరామం 


జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌   పవన్‌ ఆరోగ్యం సరిగా లేనందున విశ్రాంతి తీసుకుంటున్నారు.  రస్తుతం జనసేనాని జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని ఆయనకు వైద్యులు సూచించారు. దాంతో బుధవారం తెనాలిలో నిర్వహించాల్సి ఉన్న రోడ్‌ షో, బహిరంగ సభ రద్దు అయ్యాయి.  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కనీసం 2-3 రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పారని జనసేనాని రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ తెలిపారు. రీ షెడ్యూల్ చేసిన పర్యటన వివరాలను త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. గత 4 రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్‌ పర్యటించారు. రోడ్‌ షో, బహిరంగ సభలతో తీరిక లేకుండా గడిపారు. జ్వరం కారణంగా పవన్‌ హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడే ఆయన చికిత్స, విశ్రాంతి తీసుకోనున్నారు.


బీజేపీ, టీడీపీతో సమన్వయం చేసుకుని ప్రచారం


జ్వరం తగ్గుముఖం పట్టిన తర్వాత తెనాలితో పాటు ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. టీడీపీ, బీజేపీ నేతలతో సమన్వయం చేసుకుని అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించనున్నారు. జనసేన, బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాల్లోనూ పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్నారు. నామినేషన్లకు ఇంకా రెండు వారాల గడువు ఉన్నందున.. ప్రచారం విషయంలో ప్రత్యేక వ్యూహం పాటిస్తున్నారు.