Rahul Gandhi Assets Value: కాంగ్రెస్ సీనియర్ రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) వయనాడ్ నుంచి పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఆయన నామినేషన్ వేశారు. ఈ నామినేషన్‌తో పాటు ఆయన సబ్మిట్ చేసిన అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలున్నాయి. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.20 కోట్లు. సొంత వాహనం, ఫ్లాట్ లేవని ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ రూ.20 కోట్లలో చరాస్తులు రూ.9.24 కోట్లు. ఇందులో రూ.55 వేల నగదు, రూ.26.25 లక్షల బ్యాంకు డిపాజిట్‌లు, బాండ్‌లు, షేర్‌ల విలువ రూ.4.33 కోట్లు, మ్యూచ్యువల్ ఫండ్స్ విలువ రూ.3.81 కోట్లు, రూ.15.21 లక్షల విలువైన గోల్డ్ బాండ్స్‌, రూ.4.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్నట్టు అఫిడవిట్‌లో ప్రస్తావించారు రాహుల్ గాంధీ. ఇక స్థిరాస్తుల విషయానికొస్తే...వీటి విలువ రూ.11.15 కోట్లుగా ఉంది. ఢిల్లీలోని మెహరౌలీలో వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ కలిసి కొనుగోలు చేశారు. గుడ్‌గావ్‌లో సొంతగా ఆఫీస్‌ ఉందని అఫిడవిట్‌లో తెలిపారు. ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.9 కోట్లుగా ఉంది. అయితే...ఈ భూమి వారసత్వంగా వచ్చినట్టు వివరించారు. 


రాహుల్‌పై కొన్ని కేసులు...


తనపై ఉన్న పోలీస్ కేసుల గురించీ అందులో ప్రస్తావించారు రాహుల్ గాంధీ. ఇందులో ఓ పోక్సో కేసు కూడా ఉంది. సోషల్ మీడియాలో అత్యాచార బాధితారులి కుటుంబ సభ్యుల వివరాలు బయట పెట్టినందుకు ఈ కేసు నమోదైంది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆ FIRని సీల్డ్‌ కవర్‌లో ఉంచారని వివరించారు రాహుల్. అందులో ఏం ఉందో తనకి తెలియదని, ఈ కేసులో తనను నిందితుడిగా చేర్చారా లేదా అన్నదీ తెలియదని వెల్లడించారు. బీజేపీ నేతలు వేసిన పరువు నష్టం దావా కేసులూ ఆయనపై ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ రాహుల్ గాంధీ వయనాడ్‌ నుంచే పోటీ చేసి గెలుపొందారు. ఈ సారి ఆయనకు పోటీగా సీపీఐ నేత అన్నీ రాజా, బీజేపీ చీఫ్ కే సురేంద్రన్ బరిలోకి దిగారు. 


బీజేపీపై సంచలన ఆరోపణలు..


అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ని నిరసిస్తూ ఇటీవల I.N.D.I.A కూటమి ఢిల్లీలోని రామ్‌ లీలా మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో రాహుల్ గాంధీ (Rahul Gandhi on EVMs) సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ఈలోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లలో గెలుస్తామని చెబుతోందని, ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ లాటిందేనని విమర్శించారు. EVMలను మేనేజ్ చేయకపోతే బీజేపీ గెలవలేదని తేల్చి చెప్పారు. ఈసారి ఆ పార్టీకి 180 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లతో ఈ లోక్‌సభ ఎన్నికల్ని పోల్చుతూ ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. ఐపీఎల్ మ్యాచ్‌లలో అంపైర్‌లపై ఒత్తిడి పెంచడం, ఆటగాళ్లను కొనేయడం, గెలవకపోతే కుదరదంటూ కేప్టెన్‌లని బెదిరించడం లాంటివి జరుగుతుంటాయని ఆరోపించారు రాహుల్.


Also Read: Japan e-Visa: ఇండియన్ టూరిస్ట్‌ల కోసం జపాన్ ఈ-వీసాలు, ఇలా అప్లై చేసుకోవచ్చు