12 th August 2024 School News Headlines Today:
నేటి ప్రత్యేకత:
ప్రపంచ ఏనుగుల దినోత్సవం
అంతర్జాతీయ యువ దినోత్సవం
జాతీయ గ్రంథాలయ దినోత్సవం (లైబ్రరీ డే)
ఒలింపిక్స్
పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు తెరపడింది. జూలై 25న సీన్ నదిలో ఆరంభమైన ఈ విశ్వ క్రీడలు ఆగస్టు 11న ముగిశాయి. పతకాల పట్టికలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది, భారత్ ఆరు పతకాలతో వెనుదిరిగింది. 2028 లాస్ ఏంజెల్స్‌లో అమెరికా విశ్వక్రీడలకు ఆతిథ్యమివ్వనుంది.
ఒలింపిక్స్‌లో అమెరికాకు చైనా గట్టిపోటీ ఇచ్చింది. అమెరికాతో ఢీ అంటే ఢీ అంటున్న చైనా ఒలింపిక్స్‌లోనూ ఆ దేశానికి పోటీనిచ్చింది. అమెరికా, చైనా చెరో 40 స్వర్ణాలతో అగ్రస్థానాల్లో నిలిచాయి. అయితే మొత్తంగా అమెరికాకు 126 పతకాలు రాగా చైనా 91 పతకాలే వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ వార్తలు
లక్షల ఎకరాలకు సాగునీటిని, వేల గ్రామాలకు తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర డ్యాం 19వ నంబరు గేటు కొట్టుకుపోయింది. వరద ఉద్ధృతికి గేటు కొట్టుకుపోయింది. దీంతో 60 టీఎంసీల నీరు వృథాగా పోతోంది. అయిదు నంబర్ల గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.
జగన్ ప్రభుత్వ హయాంలో విలీనం చేసిన 3, 4, 5 తరగతులను వెనక్కి తేవాలని ఉపాధ్యాయులు ఏపీ సర్కార్‌ను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతోపాటు తెలుగు మాధ్యమాన్నీ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. రేషనలైజేషన్ జీవో-117ను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు చేశారు.
తెలంగాణ వార్తలు:
జేఎన్‌టీయూ హైదరాబాద్ క్యాంపస్‌తోపాటు తెలంగాణలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోతోంది. ఈ ఏడాది జనవరిలో ఇంజనీరింగ్ తొలి సెమిస్టర్ రాసిన 17,063 మంది విద్యార్థుల్లో 7,380 మంది మాత్రమే అన్ని సబ్జెక్టులు పాసయ్యారు. 57% మంది ఫెయిలయ్యారు. బోధనా సిబ్బంది తగ్గడం, ఆచార్యులు లేకపోవడం ఉత్తీర్ణతా శాతంపై ప్రభావం చూపుతోంది. తొలి సెమిస్టర్‌లో 9,677 మంది ఫెయిల్ కావడం ఇదే తొలిసారి.
తెలంగాణలో ఈ రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హైదరబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం నేపథ్యంలో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని GHMC అధికారులు సూచిస్తున్నారు.
జాతీయ వార్తలు
దేశవ్యాప్తంగా నేడు అన్ని ఆస్పత్రుల్లో ఎంపిక చేసిన సేవలను నిలిపేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. అత్యవసర సేవలను మినహాయిస్తున్నట్లు వెల్లడించింది. కోల్‌కతాలో ఈనెల 9న చోటుచేసుకున్న జూనియర్ వైద్యురాలి హత్య ఘటనను నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
రైతుల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రధాని మోదీ 109 రకాల నూతన వంగడాలను విడుదల చేశారు. ఈ వంగడాలను భారత వ్యవసాయ పరిశోధన మండలి అభివృద్ధి చేసింది. 61 పంటలకు చెందిన 109 వంగడాలు విడుదల చేశారు.
అంతర్జాతీయ వార్తలు
నార్త్ కరోలినా స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఎలక్ట్రిక్ బ్యాండేజ్’ని తయారుచేశారు. తీవ్ర గాయాలను సైతం ఈ బ్యాండేజ్‌లు నయం చేయగలదు. మాములు బ్యాండేజ్‌లతో పోల్చితే 30 శాతం వేగంగా ఈ ఎలక్ర్టిక్ బ్యాండేజీలు గాయాలను మాన్చగలవని శాస్త్రవేత్తలు తెలిపారు.
మంచిమాట
కెరటం నాకు ఆదర్శం.. పడినందుకు కాదు.. పడినా లేచినందుకు
- స్వామి వివేకానంద