27th July School News Headlines Today:


నేటి ప్రత్యేకత:

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ వర్దంతి

స్వాతంత్య్ర సమరయోధురాలు, ఏపీ తొలి మహిళా ఎంపీ సంగం లక్ష్మీబాయి జయంతి 

 

క్రీడా వార్తలు

 

ఫ్రాన్స్‌ సంస్కృతిని, వైభవాన్ని చాటేలా ఒలింపిక్స్‌ 2024 పారిస్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలు అబ్బురపరిచాయి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌  మేక్రాన్‌ విశ్వ క్రీడలు ప్రారంభమవుతున్నట్లు ప్రకటించాడు. వర్షం కురిసినా లక్షలాదిమంది అభిమానులు వేడుకకు హాజరయ్యారు. 

 

ఒలింపిక్‌ పరేడ్‌లో 78 మంది భారత్‌ అథ్లెట్లు పాల్గొన్నారు. పీవీ సింధు, శరత్‌ కమల్‌ మువ్వన్నెల జెండా పట్టుకుని భారత బృందానికి నేతృత్వం వహించారు. సంప్రదాయ భారతీయ దుస్తుల్లో అథ్లెట్లు మెరిసిపోయారు. మహిళలు చీరల్లో.. పురుషులు కుర్తా, పైజామాల్లో తళుక్కున మెరిశారు. 

 

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20 జరగనుంది. పల్లెకెలే వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‍గా వ్యవహరించనుండగా, కొత్త కోచ్ గంభీర్ తన ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు. 

 

ఆంధ్రప్రదేశ్‌ వార్తలు

 

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఆర్థిక వ్యవస్థపై శ్వేత పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. వైసీపీ పాలనలో అప్పులు, చెల్లింపుల భారం 9 లక్షల 74 వేల 556 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తామని ప్రకటించారు.

 

ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక నుంచి ఈ కాలేజీ అన్ని సీట్లనూ ఏపీ విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. 

 

తెలంగాణ వార్తలు

తెలంగాణలో రాబోయే మూడు నెలల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. జాబ్‌ క్యాలెండర్‌కు అనుగుణంగానే ప్రతీ ఖాళీని భర్తీ చేస్తామని ప్రకటించారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని తెలిపారు.

 

తెలంగాణలో ‘మనబడి’ పథకం కింద పాఠశాల భవనాలపై సోలార్‌ ప్లేట్లు ఏర్పాటు చేసే ప్రక్రియ అర్ధంతరంగా ఆగిపోయింది. తెలంగాణలో 1521 పాఠశాలల భవనాలపై సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. అయితే నిదులు లేక ఈ పనులు ఆగిపోయాయి. 

 

జాతీయ వార్తలు

ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ 9వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం ఇవాళ ఢిల్లీలో  జరగనుంది. భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి చేపట్టాల్సిన కార్యచరణపై ఈ మీటింగ్‌లో  చర్చించనున్నారు. ‘వికసిత్‌ భారత్‌-2047’ పేరుతో నీతి ఆయోగ్‌ ఇప్పటికే ఒక ఆధారపత్రాన్ని రూపొందించింది.

 

యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో అస్సాంలో అహోమ్‌ రాజ వంశస్థులు నిర్మించిన సమాధులు చేరాయి. ఈశాన్య భారతం నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపద ఇదే కావడం విశేషం. అస్సాంలోని పిరమిడ్ల వంటి మట్టి సమాధులను మోయిదమ్‌ అని పిలుస్తారు.

 

మంచిమాట

పుస్తకం అనేది అద్దం లాంటింది. అందులో గాడిద తొంగిచూస్తే అప్సరస కనపడదు.