55th August 2024 School News Headlines Today:


నేటి ప్రత్యేకత:

చంద్రునిపై మొట్టమొదట కాలుమోపిన వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ జననం

 

భారత రాజ్యాంగంలోని 370 అధికరణం కింద జమ్ముకశ్మీర్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదా, స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసిన రోజు. 

 

ఆంధ్రప్రదేశ్‌ వార్తలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. సోషల్‌ మీడియాలో మహిళలను వేధించే వారిపై  చర్యలు తీసుకునేందుకు సైబర్‌ గస్తీ విభాగాలు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ.. ప్రభుత్వానికి ప్రతిపాదించనుంది. సోషల్‌ మీడియాలో వేధింపుల నిరోధానికి సైబర్‌ నేరాల విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరనుంది. 

 

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఆర్టీసీ బస్టాండ్‌లో విద్యార్థులతో వెట్టిచాకిరి  చేయించిన ఘటన సంచలనం రేపింది. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో విద్యార్థులకు వంట పనులు అప్పగించారు. విద్యార్థులతో సుమారు 700 చపాతీలు చేయిస్తున్నారు. పనులు చేయని వారికి శిక్షలు విధిస్తున్నట్లు విద్యార్థులు ఆరోపించారు. 

 

తెలంగాణ వార్తలు:

త్వరలో తెలంగాణలో రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదులు, పరిష్కరిస్తున్న తీరుపై డిప్యూటీ సీఎం సమీక్షించారు. రేషన్ తీసుకునేందుకు, సంక్షేమ పథకాలు పొందేందుకు వేరువేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

 

ఐటీ రంగంలో హైదరాబాద్‌ మరోసారి అగ్రగామిగా నిలిచింది. ఐటీ, ఐటీ ఆధారిత ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్‌ భారీ వృద్ధి రేటు నమోదు చేస్తోంది. దేశ వ్యాప్త వృద్ధి రేటు కన్నా హైదరాబాద్‌లోనే ఎక్కువ వృద్ధి రేటు నమోదవుతోంది. 2023-24 ఏడాదికి తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ రూ.2,68,233 కోట్లకు చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

 

 

జాతీయ వార్తలు

కేరళలో నిఫా వైరస్‌ మరోసారి విజృంభిస్తోంది. మలప్పురం జిల్లాలో సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారించారు. మలప్పురంలో నిపా వైరస్‌ కారణంగా 14 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

 

క్రమశిక్షణ, చదువు పేరుతో పాఠశాలలో పిల్లల్ని కొట్టడం క్రూరత్వమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు పేర్కొంది. సుర్గుజా జిల్లాలోని అంబికాపూర్‌లో టీచర్ కొట్టడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై టీచర్‌పై కేసు నమోదు చేయగా అది కొట్టేయాలని ఆమె కోర్టును కోరింది. దానికి నిరాకరించిన కోర్టు.. పిల్లలు జాతికి సంపదని, వారికి ప్రేమతో నేర్పించాలని చెప్పింది. 

 

అంతర్జాతీయ వార్తలు

బంగ్లాదేశ్ మరోసారి నిరసనలతో భగ్గుమంటోంది. రాజధాని ఢాకా హింసాత్మక నిరసనలతో అట్టుడికింది. పోలీసులు, నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 93 మందికి పైగా మరణించారు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్‌ చేస్తున్నారు.

 

క్రీడలు

పారిస్ ఒలింపిక్స్‌లో వంద మీటర్ల పరుగులో అమెరికా అథ్లెట్‌ నోవా లైల్స్‌ స్వర్ణ పతకం సాధించి వరల్డ్‌ ఫాస్టెస్ట్‌ మ్యాన్‌గా నిలిచాడు. 9.79 సెకన్లలోనే నోవా లైల్స్‌ లక్ష్యాన్ని పూర్తి చేశాడు. కిషేన్‌ థాంప్సన్‌ కూడా 9.79 సెకన్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసినా మిల్లీ సెకన్ల తేడాతో రెండో స్థానంలో నిలిచి రజితం గెలుచుకు‌న్నాడు. ఫ్రెడ్‌ కెర్లీ కాంస్యం గెలిచాడు.

 

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. పటిష్టమైన బ్రిటన్‌కు క్వార్టర్‌ ఫైనల్లో షాక్‌ ఇస్తూ సెమీస్‌కు చేరింది. షూటౌట్‌లో 4-2తో బ్రిటన్‌ను భారత్‌ ఓడించింది. నేడు భారత్‌ సెమీఫైనల్‌ ఆడనుంది.

 

 

మంచిమాట

నిన్ను నువ్వే కించపరుచుకుంటూ ఎదుటివాళ్లు గౌరవించాలని ఆశించడం దురాశ