Pemmasani: ఇటీవల కాలంలో జియో, ఎయిర్ టెల్ టారీఫ్ రేట్లు పెంచడంతో వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మొగ్గుతున్నారు. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశ వ్యాప్తంగా తన సేవలు మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే  గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు. భారత దేశ వ్యాప్తంగా వచ్చే మార్చి నెల నాటికి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందిస్తామని  మంత్రి పెమ్మసాని ప్రకటించారు. దేశవ్యాప్తంగా వీలైనంత వేగంగా 4జీ సేవలు విస్తరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ కల్లా 70శాతం, మార్చి లోపు 100శాతం 4జీ సేవలను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నామని మంత్రి తెలిపారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు.


ఆదివారం నాడు తాడికొండలో నూతన దేశీయ బేస్ బ్యాండ్ యూనిట్‌ను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, బీఎస్ఎన్ఎల్ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఏపీ వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ ద్వారా నాణ్యమైన 4జీ సేవలు వినియోగదారులకు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మారుమూల గ్రామాల్లోని ప్రజలు ఎక్కువ ధరలతో ఫోన్ రీఛార్జ్‌లు చెల్లించి ఫోన్ సర్వీసులు ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రీఛార్జ్ ధరలు పెరగడం వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో బిఎస్ఎన్ఎల్ కంపెనీని 4జీ సేవలతో అప్ డేట్ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే తాను 4జీ టవర్‌ను పరిశీలించి టెస్టులు జరిపామని తెలిపారు.


దేశవ్యాప్తంగా 4500 మొబైల్ టవర్లు 
దేశవ్యాప్తంగా 4500 టవర్లను ఏర్పాటు చేయడం ద్వారా త్వరలోనే నాణ్యమైన బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. అతి తక్కువ రేట్లతో ఇంటర్నెట్ సేవలను ప్రజలకు అందించేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. ప్రైవేట్ కమ్యూనికేషన్ సంస్థలు రీఛార్జీ రేట్లు భారీగా పెంచడం మూలాన అందరూ బీఎస్ఎన్ఎల్ సేవల కోసం ముందుకు వస్తున్నారని అన్నారు. రాజధానిలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయంటూ కితాబిచ్చారు.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకున్న లక్ష్యాలు పేదలకు అందించే వరకు శాయశక్తులా పనిచేస్తారని మంత్రి పెమ్మసాని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి కరెంట్ ఎంత ముఖ్యమో.. నాణ్యమైన ఇంటర్నెట్ కూడా అంతే అవసరమన్నారు. ప్రైవేట్ సంస్థలు  మారుమూల పల్లెలకు ఇంటర్నెట్‌ సేవలు అందించవని.. లాభాపేక్ష లేకుండా చివరి గ్రామం వరకు బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు అందించాలన్నదే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్దేశమన్నారు. అనంతరం బిఎస్ఎన్ఎల్ సిఎండి రాబర్ట్ జె. రవి, ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం మాట్లాడుతూ..  రాష్ట్రంలో 300 లొకేషన్లను సిద్ధం చేసుకుని టెస్టులు చేస్తున్నామని, 400 సెంటర్లలో టవర్స్‌కు ఎక్విప్మెంట్‌ను ఇన్స్టాల్ చేసి 4జీ సేవలు అందించడానికి సమాయత్తం అవుతున్నట్లు తెలిపారు.