23 rd July 2024 News Headlines in Telugu For School Assembly: 

 


1. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నేడు శాసనసభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లు, వైద్యారోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లును సభ ముందు ఉంచనుంది. అలాగే గవర్నర్ ప్రసంగంపై మంత్రి కాలవ శ్రీనివాసులు ధన్యవాదాల తీర్మానం ప్రవేశపెట్టనుండగా.. దీనిపై సభలో సభ్యులు ప్రసంగించనున్నారు.

 

2. పోలవరం ప్రాజెక్టుపై కీలక ముందడుగు పడింది. మొదటి దశ నిర్మాణానికి రూ.12,157 కోట్ల ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కేంద్ర క్యాబినెట్ ఆమోదంలో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చనున్నాయి. కాగా నిన్న కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసిన మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరంతోపాటు వివిధ ప్రాజెక్టులకు అవసరమైన నిధులపై చర్చలు జరిపారు.

 

3. మూసీనదీ ప్రక్షాళనకు రూ.4వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గోదావరి జలాలను ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జలాశయాల్లో నింపే పనులకు రూ.6వేల కోట్లు ఇవ్వాలని కోరారు. తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్‌ లేదని, ఇందుకు రూ.16,100 కోట్లు మంజూరు చేయాలన్నారు. 

 

4. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ఆమె బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులకు ఊరట లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మోదీ 3.0 హయాంలో ఇది తొలి బడ్జెట్ కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిర్మలా ఏడోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

 

5. సివిల్ సర్వీసెస్‌కు దివ్యాంగుల కోటా ఎందుకంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్‌పై తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆమెపై కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దేశంలోని కోట్లాది మంది దివ్యాంగుల మనోభావాలను, భారత రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులను భంగపరిచే విధంగా స్మితా ప్రవర్తించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

6.నీట్‌-యూజీ పరీక్ష పత్రం లీకేజీ, అవకతవకలపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఐఐటీ- ఢిల్లీ డైరెక్టర్‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకే ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఇవ్వడంపై సంబంధిత సబ్జెక్టుకు చెందిన ముగ్గురు నిపుణులను ఏర్పాటు చేసి ఇవాళ మధ్యాహ్నం 12 గంటలలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. 

 

7. చంద్రయాన్ 3 విజయంతో భారత్ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఇస్రోకు తాజాగా మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. చంద్రయాన్ 3  సక్సెస్ కావడంతో వరల్డ్ స్పేస్ అవార్డు  . చేజిక్కించుకుంది. అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్.. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డును చంద్రయాన్ 3 కి ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీన ఇటలీలోని మిలాన్‌లో జరగనున్న 75వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాన్ఫరెన్స్ సందర్భంగా అవార్డును అందజేయనున్నారు.

 

8. డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్‌ వైదొలగడంతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ దూసుకుపోతున్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఆమెకు బైడెన్‌ మద్దతు ప్రకటించగా.. మరికొందరు ప్రముఖులు కూడా కమలా హారీస్‌కు అండగా నిలుస్తున్నారు. 

 

9. మహిళల ఆసియా కప్‌‌లో శ్రీలంక కెప్టెన్‌ చమరి ఆటపట్టు చరిత్ర సృష్టించింది. మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో చమరి 119 పరుగులతో అజేయంగా నిలిచింది. ఇందులో 14 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. దీంతో మహిళల ఆసియా కప్‌ చరిత్రలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా చమరి రికార్డు సృష్టించింది. 

 

10. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు...

స్వామి వివేకానంద