Legal Notices To Kalki 2898 AD: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ విడుదలయ్యి దాదాపు నెలరోజులు అవుతోంది. ఇప్పటికీ పలు థియేటర్లలో ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వడం విశేషం. అయితే ఇన్నిరోజులు లేనిది ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’కు కొత్తగా ఒక సమస్య ఎదురయ్యింది. ఈ సినిమా నిర్మాతలతో పాటు ఇందులో నటించిన నటీనటులకు కూడా లీగల్ నోటీసులు వెళ్లాయనే వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ‘కల్కి 2898 ఏడీ’ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉందంటూ మాజీ కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్.. మూవీ టీమ్‌కు నోటీసులు జారీ చేశారు.
విష్ణుమూర్తి అవతారం..
మహాభారతాన్ని రిఫరెన్స్‌గా తీసుకొని ‘కల్కి 2898 ఏడీ’ని తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే ఇది మహాభారతంలో ఉన్న కథ ప్రకారం తెరకెక్కలేదంటూ ఆచార్య ప్రమోద్ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇండియా అనేది ఎమోషన్స్, నమ్మకం, భక్తితో నిండిపోయి ఉంటుంది. సనాతన ధర్మకు మనం ఇచ్చే విలువను తారుమారు చేయకూడదు. సనాతన ధర్మానికి చెందిన రాతలను మార్చకూడదు. కల్కి నారాయణ్‌పై మాకు నమ్మకం ఉంది. ఆయన విష్ణుమూర్తికి చివరి అవతారం. పురాణాల్లో కల్కి పాత్ర గురించి చాలానే రాసుంది. దీని ఆధారంగానే ఫిబ్రవరి 19న నరేంద్ర మోదీ శ్రీ కల్కి ధామంకు శంకుస్థాపన కూడా చేశారు’’ అని ఆచార్య ప్రమోద్ చెప్పుకొచ్చారు.
కల్కి పాత్రలో మార్పులు..
‘‘కల్కి 2898 ఏడీ అనే సినిమా మా పురాణాల్లో రాసి ఉన్నదానికి అతీతంగా వెళ్తుంది. అది మా మతపరమైన భావాలను దెబ్బతీస్తుంది. కాబట్టి మేము ఇందులో కొన్ని సమస్యలను గుర్తించి మూవీ టీమ్ స్పందన కోసం ఎదురుచూస్తున్నాం. హిందువుల మనోభావాలతో ఆడుకోవడం ఫిల్మ్ మేకర్స్‌కు సరదా అయిపోయింది. మహర్షులను రాక్షసుల్లాగా చూపిస్తున్నారు. భావప్రకటన స్వేచ్ఛ అంటే ప్రేక్షకుల నమ్మకంతో ఆడుకోవచ్చని కాదు’’ అని అన్నారు ఆచార్య ప్రమోద్. సుప్రీం కోర్టు అడ్వకేట్ అయిన ఉజ్వల్ ఆనంద్ శర్మ సాయంతో ‘కల్కి 2898 ఏడీ’ టీమ్‌కు నోటీసులు జారీచేశారు ఆచార్య. హిందూ పురాణాల్లో ఉన్నట్టుగా ఈ సినిమాలో కల్కి పాత్ర లేదంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.
దెబ్బతింటున్న హిందువుల నమ్మకం..
‘‘కల్కి పాత్రను ఇష్టం వచ్చినట్టుగా మార్చడం పురాణాలను అవమించినట్టుగా ఉంటుంది. పురాణాలు అనేవి మత నమ్మకాలను పెంచుతాయి. కోట్లలో భక్తులు వీటిని నమ్ముతారు. ఇప్పటికే ఆ పాత్రను ఇష్టం వచ్చినట్టు మార్చడం వల్ల హిందువుల మనసుల్లో కల్కి గురించి వేరే అభిప్రాయం ఏర్పడి ఉండవచ్చు. దానివల్ల హిందువుల నమ్మకాన్ని దెబ్బతీసినట్టుగా ఉంటుంది’’ అంటూ ‘కల్కి 2898 ఏడీ’ టీమ్‌కు నోటీసులు పంపారు ఆచార్య ప్రమోద్. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు స్వప్న దత్, ప్రియాంక దత్. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె.. ఇతర కీలక పాత్రల్లో నటించారు.