Modern Masters: SS Rajamouli Trailer: నెట్‌ఫ్లిక్స్ లాంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్.. ఇప్పటివరకు ఫారిన్ ఫిల్మ్ మేకర్స్, హాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ డాక్యుమెంటరీలు మాత్రమే దృష్టిపెట్టేది. కానీ మొదటిసారి ఒక తెలుగు దర్శకుడిపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తెరకెక్కించడానికి సిద్ధమయ్యాడు. ఆ దర్శకుడు ఎవరో ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనే దర్శక ధీరుడు రాజమౌళి. ‘మోడర్న్ మాస్టర్స్ : ఎస్ఎస్ రాజమౌళి’ అనే టైటిల్‌తో రాజమౌళిపై డాక్యుమెంటరీ తెరకెక్కిస్తున్నట్టు నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది.
అద్భుతమైన కథ..
‘మోడర్న్ మాస్టర్స్ : ఎస్ఎస్ రాజమౌళి’ డాక్యుమెంటరీలో రాజమౌళికి చాలా దగ్గరయ్యి, తనతో పలు సినిమాల్లో కలిసి పనిచేసిన నటీనటులు, మేకర్స్ కూడా భాగమయ్యారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్‌లో ఎన్‌టీఆర్, రామ్ చరణ్, కరణ్ జోహార్, ప్రభాస్‌తో పాటు హాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ అయిన జేమ్స్ క్యామరాన్ కూడా రాజమౌళిపై ప్రశంసలు కురిపించడం విశేషం. ‘‘నేను ఒక అద్భుతమైన కథను చెప్పాలనుకుంటున్నాను. ప్రేక్షకులు సినిమాలో లీనమయిపోయేలా చేయాలని అనుకున్నాను’’ అంటూ రాజమౌళి చెప్పే డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలవుతుంది.
తనకు పిచ్చి..
అందులో ముందుగా ఎన్‌టీఆర్ వచ్చి రాజమౌళి గురించి చెప్పడం ప్రారంభిస్తాడు. ‘‘ఈ మనిషి సినిమాలు చేయడం కోసమే పుట్టాడు. ఇప్పటివరకు ఎవరూ చెప్పని కథలు చెప్పడానికే పుట్టాడు’’ అని తన స్టైల్‌లో ప్రశంసించాడు ఎన్‌టీఆర్. ఇక రాజమౌళితో కలిసి పనిచేయడం వల్ల వచ్చే కష్టాలు ఏంటి అని అడగగా.. ‘‘తనకు అసలు జాలి లేదేమో అనిపిస్తుంటుంది. తనకు పిచ్చి. అసలు తనతో వాదించడం వల్ల లాభం ఉండదు. తనకు కావాల్సింది చేసి అక్కడి నుండి వెళ్లిపోవాలి అంతే’’ అని బయటపెట్టాడు. ఎన్‌టీఆర్‌తో పాటు ప్రభాస్ కూడా రాజమౌళిపై తన అభిప్రాయాన్ని తెలిపాడు. ‘‘నేను అలాంటివాడిని ఎప్పుడూ కలవలేదు. తను ఒక పిచ్చోడు. అంతే’’ అని అన్నాడు.
పనిరాక్షసుడు..
‘‘తనకు నచ్చింది చేయడాన్ని, ఎవరితో అయినా పనిచేయడాన్ని తను గౌరవంగా భావిస్తాడు’’ అని జేమ్స్ క్యామరాన్ అన్నారు. రామ్ చరణ్ సైతం రాజమౌళి గురించి మాట్లాడుతూ.. ‘‘ఒక్కొక్కసారి తనతో నేను చేసిన సినిమాలను మూడో వ్యక్తిగా చూసి షాకవుతాను. నేను సెట్‌లో మైక్స్ విరగడం చూశాను’’ అని రాజమౌళితో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు. ‘‘రాజమౌళి ఇప్పటికే లెజెండ్స్ లిస్ట్‌లో యాడ్ అయ్యాడు’’ అని కరణ్ జోహార్ అన్నాడు. ఇక రాజమౌళి భార్య రమా కూడా తన భర్తను అందరూ పనిరాక్షసుడు అంటారు అని చెప్తూ నవ్వారు. అలా ఇప్పటివరకు తను తెరకెక్కించిన సినిమాల కోసం రాజమౌళి ఎంత కష్టపడ్డారో కూడా ఈ ట్రైలర్‌లో చూపించారు.
Also Read: నితిన్, నాగ చైతన్య సినిమాలపై గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్ - ఆ హీరోలు ఇప్పుడు ఏం చేస్తారో?