Mega Vs Nandamuri: టాలీవుడ్ లో మెగా, నందమూరి హీరోల మధ్య దశాబ్దాలుగా బాక్సాఫీస్ వార్ నడుస్తోంది. రియల్ లైఫ్ లో వాళ్ళు ఎంత సాన్నిహిత్యంగా ఉన్నా, సినిమాల విషయానికి వచ్చే సరికి ఒకరిపై ఒకరు డామినేషన్ చూపించాలనే ఇరు వర్గాల ఫ్యాన్స్ భావిస్తుంటారు. ఒకరి రికార్డులను మరొకరు బ్రేక్ చెయ్యాలని కోరుకుంటారు. అయితే ఈ రెండు ఫ్యామిలీల నుంచి పెద్ద సినిమాలొచ్చి చాలా రోజులైంది. అందుకే అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే సెప్టెంబర్ - జనవరి మధ్య కాలంలో నందమూరి మెగా హీరోల నుండి నాలుగు క్రేజీ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. యాదృచ్ఛికంగా సరిగ్గా 8 ఏళ్ళ కిందట ఇదే ఐదు నెలల కాలంలో ఈ రెండు ఫ్యామిలీలకు చెందిన 4 సినిమాలు విడుదలవ్వడం చర్చనీయంగా మారింది. 


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫస్ట్ పార్ట్ ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ ఎస్. శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'గేమ్ ఛేంజర్'. ఈ చిత్రాన్ని క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ లో విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు తాజాగా ప్రకటించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సినిమాని సంక్రాతి పండుగ సందర్భంగా వచ్చే జనవరి 10న థియేటర్లలోకి తీసుకొస్తామని చాన్నాళ్ల కిందటే మేకర్స్ వెల్లడించారు. ఇప్పుడు నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'NBK 109' మూవీ అదే పొంగల్ రేసులోకి రానునట్లుగా టాక్ నడుస్తోంది. 


ఇలా మెగా, నందమూరి హీరోలు నటించిన సినిమాలు 2024 సెప్టెంబర్ నుంచి 2025 జనవరి మధ్య కాలంలో రిలీజ్ అవుతున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం 2016-17లో కూడా ఇదే క్రమంలో వీరి చిత్రాలు విడుదల అయ్యాయి. ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తే.. రామ్ చరణ్ నటించిన 'ధృవ' చిత్రం డిసెంబర్ లో వచ్చింది. ఇక మరుసటి ఏడాది జనవరిలో సంక్రాంతి పండక్కి చిరంజీవి 'ఖైదీ నెం. 150', బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాలు పోటీ పడ్డాయి. అయితే ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి. మళ్ళీ ఇప్పుడు 2024-25లో సేమ్ రిజల్ట్ రిపీట్ అవ్వాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈసారి మెగా ఫ్యామిలీ నుంచి అదనంగా అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప 2' సినిమా యాడ్ అవుతోంది. ఇది డిసెంబర్ 6న థియేటర్లలోకి వస్తోంది.  


ఇకపోతే చిరు, బాలయ్యలు చివరగా 2023 సంక్రాంతి సీజన్ లో పోటీకి దిగారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' 'వీర సింహా రెడ్డి' సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. రెండూ సక్సెస్ సాధించాయి. కాకపోతే వసూళ్ల పరంగా బాలకృష్ణపై చిరంజీవి పైచేయి సాధించారు. కానీ అదే ఏడాది మెగాస్టార్ 'భోళా శంకర్' తో రూపంలో భారీ డిజాస్టర్ చవిచూస్తే.. బాలయ్య మాత్రం 'భగవంత్ కేసరి' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మళ్ళీ 2025 పొంగల్ ఫైట్ కు రెడీ అవుతున్నారు. 


మరోవైపు RRR సినిమాతో గ్లోబల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత, ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల నుంచి పూర్తి స్థాయిలో మరో సినిమా రాలేదు. అప్పటి నుంచీ వీరిద్దరూ 'దేవర' 'గేమ్ చేంజర్' చిత్రాలపైనే వర్క్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ రెండు సినిమాలు షూటింగ్ చివరి దశకు చేరుకున్నాయి. వీలైనంత త్వరగా పెండింగ్ వర్క్ పూర్తి చేసి, ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక 'పుష్ప: ది రూల్' పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఏదేమైనా రాబోయే ఆరు నెలల్లో టాలీవుడ్ లో పలు క్రేజీ చిత్రాలు సందడి చేయబోతున్నాయి. మరి వీటిల్లో ఏవేవి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటాయో చూడాలి. 


Also Read: RRR రికార్డును బ్రేక్ చేసిన 'కల్కి 2898 AD'