9th August 2024 School News Headlines Today: 


నేటి ప్రత్యేకత:

అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం

1945లో ఇదే రోజున జపాన్ లోని నాగసాకిపై అమెరికా అణుబాంబు ప్రయోగించింది.

సింగపూర్ స్వాతంత్ర్య దినోత్సవం.

ప్రపంచ స్వదేశీ ప్రజల దినోత్సవం

భారత శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు మరణం.

 

క్రీడలు

ఇండియన్‌ గోల్డెన్‌ బాయ్ నీరజ్‌ చోప్రా మరోసారి ఒలింపిక్స్‌లో మెరిశాడు, విశ్వ క్రీడల్లో భారత్‌కు రెండో పతకం అందించాడు. ఈసారి గోల్డ్‌ మెడల్‌ చేజారినా ... రజత పతకం సాధించి నీరజ్‌ చరిత్ర సృష్టించాడు.  89.45 మీటర్లతో నీరజ్‌ రజత పతకం సాధించాడు. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్‌ నదీమ్‌ 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి స్వర్ణం గెలుచుకున్నాడు.

 

ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. కాంస్య పతక పోరులో స్పెయిన్‌ను చిత్తు చేస్తూ వరుసగా రెండో పతకాన్ని భారత్‌కు అందించింది. ఈ మ్యాచ్‌లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్‌ 2-1తో స్పెయిన్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో గోల్‌ కీపర్‌ శ్రీజేష్‌ తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.

 

విశ్వ క్రీడల్లో ఒకేరోజు భారత్‌కు రెండు పతకాలు రావడంపై రాష్ర్టపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలు రాష్ట్రాల సీఎంలు భారత ఆటగాళ్ల ప్రదర్శనను కొనియాడారు. క్రీడా దిగ్గజాలు, సినీ ప్రముఖులు భారత హాకీ జట్టు, నీరజ్‌ చోప్రాలను కొనియాడుతూ ట్వీట్లు చేశారు.

 


 

ఆంధ్రప్రదేశ్‌ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. దేశంలోనే పది మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపి.. ఏపీలో పరిశ్రమలు స్థాపించమని కోరుతామని వెల్లడించారు. 

 

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ జన్మభూమి ప్రారంభం కానుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జన్మభూమి-2ను త్వరగా ప్రారంభించాలని... స్కిల్‌ సెన్సెస్‌ను దేశంలోనే తొలిసారిగా ఏపీలో చేపట్టాలని నిర్ణయించారు.

 

తెలంగాణ వార్తలు:

 రేషన్ కార్డుల జారీపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విధి విధానాలను ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌గా దామోదర్ రాజానర్సింహా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. 

 

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. రేపు, ఎల్లుండి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. బలమైన గాలులు కూడా వీస్తాయని వెల్లడించింది.

 

 

జాతీయ వార్తలు

దేశ సేవలో ప్రాణాలు అర్పిస్తున్న సైనికులను సన్మానించేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నూతనంగా తీసుకొచ్చే ఇంజిన్లపై అమరవీరుల పేర్లను రాయనుంది. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు గుర్తుగా, వారికి నివాళులు అర్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే శాఖ వెల్లడించింది. 

కమ్యూనిస్ట్‌ యోధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. తుదిశ్వాస విడిచారు. 2000-2011 వరకు బుద్ధదేవ్‌ బెంగాల్‌ సీఎంగా పని చేశారు. 

 

అంతర్జాతీయ వార్తలు

 

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానిగా నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. యూనస్‌తో దేశాధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్దీన్‌ ప్రమాణం చేయించారు. 

 

బంగ్లాదేశ్‌ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ బంగ్లాలోని భారత దౌత్యాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేశారు. తదుపరి దరఖాస్తు తేదీపై ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారమిస్తామని వెల్లడించారు. 

 

మంచిమాట

ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న

-మదర్‌ థెరిస్సా