3rd September 2024 School News Headlines Today:

ఆంధ్ర ప్రదేశ్ వార్తలు:


  • భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరు ఉధృతికి నీట మునిగిన విజయవాడలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. భారీగా నీరు నిలవడంతో స్థానికులు బయటకు రాలేకపోతున్నారు. పడవలు ఏర్పాటు చేసి కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించినా, చాలా మంది ఇంకా పైఅంతస్తుల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.

  • వరద సహయక చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లాలని ఫైర్ అయ్యారు. ఈ సమయంలో కొందరు అధికారులు అలసత్వాన్ని వీడటం లేదన్నారు. వరద ప్రభావిత ప్రజలకు అనుకున్న స్థాయిలో ఆహరం తెప్పించినా పంపిణీలో ఆలస్యం జరుగుతుందన్నారు. 


Read also : Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం- ఆ రెండు జిల్లాల్లో భారీ విధ్వంసం


తెలంగాణ వార్తలు: 


  • తెలంగాణలో వరదల కారణంగా ఇప్పటివరకు 16 మంది చనిపోవడంపై  సీఎం రేవంత్ రెడ్డిఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా.. కొంత నష్టం తప్పలేదని అన్నారు. వరద ప్రాంతాల్లో అంటువ్యాధుల పట్ల ప్రజలతో పాటు అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.

  • తెలంగాణలో వరదతో నష్టపోయిన ప్రతి కుటుంబాన్నీ ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. బాధితులకు సాయం అందించేందుకు వెనకాడేది లేదని స్పష్టం చేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లిందని రేవంత్ తెలిపారు. బాధితులకు తక్షణ సహాయం కింద కుటుంబానికి రూ.10 వేలు ఇస్తామన్నారు.

  • తెలంగాణలోని 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 24 గంటల్లో నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, సిద్దిపేట, సంగారెడ్డి, పెద్దపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు పేర్కొంది. వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.

  • ఈనెల 5, 6 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది తుఫానుగా మారి.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా దిశగా ప్రయాణించి తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వాయుగుండం ప్రభావం నుంచి తేరుకోకముందే మరో అల్పపీడనం హెచ్చరికలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.


Read Also: Weather Latest Update: ఆగని వర్షాలు! నేడు కూడా కుండపోతే, ఈ జిల్లాలకు అలర్ట్ - ఐఎండీ హెచ్చరిక


జాతీయ వార్తలు: 


  • ప్రధాని నరేంద్ర మోదీ  నేటి నుంచి 5వ తేదీ వరకు బ్రూనై, సింగపూర్‌లో పర్యటించనున్నారు. బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకు ప్రధాని పర్యటించనున్నారు. బ్రూనైతో ద్వైపాక్షిక, ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయనుంది. సింగపూర్ పర్యటనలో సెమీ కండక్టర్ల సహకారానికి బప్పందం చేసుకునే అవకాశం ఉంది. 

  • జమ్మూకశ్మీర్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉగ్రదాడి తీవ్ర కలకలం రేపింది. జమ్మూలోని అతిపెద్ద ఆర్మీ స్థావరం సుంజ్వాన్‌ మిలిటరీ క్యాంప్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ముష్కరుల కాల్పుల్లో సెంట్రీ డ్యూటీలో ఉన్న ఓ జవాను గాయపడ్డాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆర్మీ బేస్ కు సీల్ వేసి యాంటీ టెర్రర్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు.


క్రీడా వార్తలు: 


  • పారిస్ పారాలింపిక్స్ లో భారత ఖాతాలో మరో స్వర్ణం చేరింది. బ్యాడ్మింటన్ ఎస్ ఎల్3 విభాగంలో నితేశ్‌ కుమార్‌ భారత్ కు బంగారు పతకం అందించాడు.80 నిమిషాల పాటు ఎంతో హోరాహోరీగా సాగిన ఫైనల్లో నితేశ్‌ 21-14, 18-21, 23-21 తేడాతో బ్రిటన్ కు చెందిన డేనియల్‌ బెతెల్‌ పై చిరస్మరణీయ విజయం సాధించాడు. 

  • పారాలింపిక్స్‌ పురుషుల డిస్కస్ త్రో F56 విభాగంలో యోగేశ్ రజతం సాధించాడు. టోక్యోలో కూడా రజతం సాధించిన యోగేష్... మరోసారి రజత పతకం సాధించి సత్తా చాటాడు. 42.22 మీటర్ల దూరం డిస్కస్ ను విసిరి సిల్వర్ మెడల్ గెలిచాడు. బ్రెజిల్‌కు చెందిన బాటిస్టా 46.86 మీటర్ల త్రోతో పారాలింపిక్‌ రికార్డు సృష్టించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.