30th August 2024 School News Headlines:



ఆంధ్రప్రదేశ్ వార్తలు: 


  • మాతృభాషను మరిచిపోతే ఆ జాతి కనుమరుగు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జీతం కోసం ఆంగ్లం.. జీవితం కోసం తెలుగు నేర్పిస్తామని సీఎం అన్నారు. తెలుగు భాషను కాపాడతామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం పాల్గొన్నారు.

  • వనం-మనం పేరిట పచ్చదనం పెంపు కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేడు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని పంచాయతీ పరిధిలోని JNTU ఆవరణలో 6 వేల మొక్కలు నాటనున్నారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌‌కల్యాణ్‌ పాల్గొని మొక్కలు నాటనున్నారు. 

  • వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామాలను రాజ్యసభ చైర్మన్ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆమోదించారు. రెండు స్థానాలు ఖాళీ అయినట్టు రాజ్యసభ బులెటిన్‌ విడుదల చేసింది. ఖాళీ అయిన ఈ రెండు రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. సంఖ్యా పరంగా బలంగా ఉన్న ఎన్డీయే కూటమికి ఈ రెండు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. 


తెలంగాణ వార్తలు: 


  • తెలంగాణలో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం రేవత్ రెడ్డి మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు. హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని చర్చించారు.

  • తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల.. శనివారం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్.. ఆదివారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.


జాతీయ వార్తలు: 


  • హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు కీలక ప్రకటన చేశారు. ప్రకృతి విపత్తుతో అల్లకల్లోలమైన రాష్ట్రానికి అండగా నిలిచేందుకు సీఎం, మంత్రులు రెండు నెలల పాటు జీతభత్యాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నామని తెలిపారు. అధికార, విపక్ష ఎమ్మెల్యేలు కూడా ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. 

  • దేశంలో త్వరలోనే 6జీ సాంకేతికతను ప్రజలకు పరిచయం చేసేందుకు భారత్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా 6జీ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ 6జీ టెక్నాలజీని ప్రారంభించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.


అంతర్జాతీయ వార్తలు:


  • ప్రపంచాన్ని ఎంపాక్స్‌ వైరస్‌ వణికిస్తోంది. కాంగో దేశంలో ఎంపాక్స్‌ విరుచుకుపడుతోంది. ఆ దేశంలో ఇప్పటి వరకు 18వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో కనీసం 610 మంది మరణించారు. ఎంపాక్స్‌ వ్యాప్తి పెరుగుతోందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరించింది. 


క్రీడా వార్తలు: 


  • పారా ఒలింపిక్స్‌లో ఆర్చర్‌ శీతల్‌ దేవి అదరగొట్టింది. రెండు చేతులు లేకపోయినా కాళ్లతో విల్లును ఎక్కుపెట్టి లక్ష్యాన్ని గురి చూసి కొట్టింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ ర్యాంకింగ్‌ రౌండ్‌లో 720కి గాను 703 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి నేరుగా ప్రి క్వార్టర్స్‌కు చేరింది. శనివారం ప్రిక్వార్టర్స్‌ జరగనుంది. 


హెల్త్ టిప్‌

రోజుకి ఓ బఠాణి గింజంత పరిమాణంలో మాత్రమే పేస్టుని ఉపయోగించాలని డెంటల్ అసోషియేషన్ సూచించింది.పిల్లలకు చాలా తక్కువగా పేస్ట్ వేయాలని తెలిపింది. దాన్ని కూడా శుభ్రంగా బ్రష్‌తో రాయాలి. ఇలా చేయడం వల్ల పళ్లు బాగా శుభ్రం అవుతాయి. ఎలాంటి సమస్యలు ఎదురుకావు. 

 

మంచిమాట

కలలు కనండి.. ఆ కలలు సాకారం చేసుకోండి..అబ్దుల్‌ కలాం