Discontent is growing in YSRCP against Sajjala Ramakrishna Reddy : విజయానికి చాలా మంది యజమానులు ఉంటారు కానీ ఓటమికి మాత్రం ఎవరో ఒకర్ని బాధ్యుడ్ని చేయడానికి అందరూ సిద్ధమైపోతారు. రాజకీయాల్లో అయినా అంతే.  అత్యంత  భారీ విజయం నుంచి..అంత కంటే ఘోరమైన పరజయానికి ఐదేళ్లలో  పడిపోయిన వైఎస్ఆర్‌సీపీలో ఇప్పుడు ఓటమికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డేనని  తక్షణం ఆయనను పార్టీ వ్యవహారాల నుంచి తప్పించాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఆయన వల్లే పార్టీకి ఈ పరిస్థితి అనే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 


జగన్ కు ఆల్ ఇన్ వన్ సజ్జల రామకృష్ణారెడ్డి 


వైసీపీలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా అది  సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలోనే తీసకుంటారని ఆ పార్టీ నేతలందరికీ తెలుసు.  మొదట్లో విజయసాయిరెడ్డి నెంబర్ 2 పొజిషన్‌లో ఉండేవారు. తర్వాత ఆయన స్థానంలోకి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు. సీఎం క్యాంప్ ఆఫీసులోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఆయన పర్మిషన్ ఉండాల్సిందే. ప్రభుత్వ విధానాలపైనా ఆయనే మాట్లాడేవారు. పార్టీ వ్యవహారాలపైనా ఆయనే నిర్ణయాలు తీసుకునేవారు. కీలకమైన సోషల్ మీడియా విభాగానికి ఆయన కుమారుడ్ని ఇంచార్జ్ గా నియమించారు. ఆయన తీరుపై క్రమంగా అసంతృప్తి పెరుగుతూ వచ్చినా.. జగన్ వద్ద ఆయనకు ఉన్న  పలుకుబడి చూసి చాలా మంది  సైలెంట్ అయిపోయారు. జగన్ కూడా ఆయన టీం రాసిచ్చిందే చదివే వారని.. ఆయన చెప్పినట్లుగానే రాజకీయ వ్యూహాలు అమలు చేసేవారని వైసీపీలో గట్టి నమ్మకం. ప్రతిపక్ష నేతలపై వేధింపులు, అరెస్టుల వెనుక కూడా సజ్జలే కీలకమని వారనుకుంటారు. 


వైసీపీకి బిగ్ షాక్ - ఏకకాలంలో రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్ రావు రాజీనామా


పార్టీ పరిస్థితి దిగజారిపోతున్నా పట్టించుకోలేదని అసహనం


వైసీపీ పాలనలో పథకాల పేరుతో హాడావుడి చేయడం తప్ప.. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని సజ్జల రామకృష్ణారెడ్డి పట్టించుకోలేదు. జగన్ ను అప్రమత్తం చేసే ప్రయత్నం చేయలేదు. చివరికి గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పశ్చిమ రాయలసీమలో కూడా ఓడిపోయిన తర్వాత కూడా పరిస్థితిని చక్కదిద్దేందుకు.. ఆయన ఏ మాత్రం ప్రయత్నించలేదు. మా ఓటర్లు వేరే ఉన్నారని అందర్నీ మభ్య పెట్టారన్న అసంతృప్తి ఉంది. ఇక మంత్రి వర్గ ప్రక్షాళన తర్వాత మేకతోటి సుచరిత వర్గీయులు ఆయన దిష్టిబొమ్మను కూడా తగులబెట్టారు. ఇక టిక్కెట్ల పంపిణీలో రచ్చ చేసి.. గెలవాల్సిన సీట్లను కూడా పోగొట్టడంలో సజ్జల పాత్ర కీలకమని ఎక్కువ మంది నమ్ముతున్నారు.  


ఇప్పటికీ కీలక నిర్ణయాల్లో సజ్జల భాగస్వామి


పార్టీ ఓటమి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ దూరం పెడతారని అందరూ అనుకున్నారు. కానీ ఓడిపోయిన తర్వాతి రోజే.. జగన్ తో పాటు ఆయన కనిపిస్తున్నారు. పార్టీ వ్యవహారాలను ఆయనే చక్కదిద్దుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో రాజ్యసభ సభ్యుల ద్వారా పట్టు నిరూపించుకోవచ్చని అనుకుంటే..వారంతా రాజీనామాల బాటపట్టారు. వారిని ఆపేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడమే కాదు.. రానున్న రోజుల్లో పార్టీ మొత్తం ఖాళీ అవుతుందన్న ప్రచారం ఊపందుకుంటోంది.  దీంతో క్యాడర్ మరింత అసహనానికి గురవుతున్నారు. పార్టీలో కీలక నేతలంతా ఏం చేస్తున్నారని.. ఎవర్నీ ఆపలేని పరిస్థితికి ఎందుకెళ్లారని అంటున్నారు.  


ఓటుకు నోటు కేసులో బిగ్ అప్‌డేట్‌- మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలన్న పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు


సజ్జలను తప్పించాలన్న డిమాండ్లు


వైసీపీ అధినేత కుటుంబానికి చెందిన మీియాను  కూడా సజ్జల రామకృష్ణారెడ్డినే పర్యవేక్షిస్తారు. ఆ చానల్లో  డిబేట్ కు వచ్చిన వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి పార్టీలో ఈ దుస్థితికి సజ్జల రామకృష్ణారెడ్డే కారణమని ఆయనను పక్కన  పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో అందరూ అవాక్కవ్వాల్సి వచ్చింది. వైసీపీ క్యాడర్ లో గూడు కట్టుకున్న ఆవేదన అదని.. మరికొంత కాలం సజ్జలే పార్టీని నడిపితే తిరుగుబాటు వచ్చినా ఆశ్చర్యం ఉండదని ద్వితీయ శ్రేణి నేతలంటున్నారు. మొత్తంగా వైసీపీ క్యాడర్ ఇప్పుడు మార్పు కోరుకుంటోందని అర్థం చేసుకోవచ్చు.