16 th August 2024 School News Headlines Today: 


నేటి ప్రత్యేకత: 


  • సర్దార్ గౌతు లచ్చన్న జయంతి

  • ఆంధ్రప్రదేశ్‌ ఎనిమిదో ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య జయంతి

  • స్వామి రామకృష్ణ పరమహంస వర్థంతి

  • మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతి


ఆంధ్రప్రదేశ్ వార్తలు:  

 


  • టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో సీఎం చంద్రబాబు నేడు సమావేశం కానున్నారు. పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనపై సీఐఐ డీజీ చంద్రజిత్‌ బెనర్జీ నేతృత్వంలో ప్రతినిధుల బృందంతోనూ చంద్రబాబు చర్చిస్తారు. 

  • పోలవరం ప్రాజెక్టుపై అధ్యయనం చేసిన విదేశీ నిపుణుల బృందం ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసింది. డిజైన్‌ మార్పులతో కొత్త డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం నిర్మించాలని సూచించింది. కాఫర్‌ డ్యాంలతోనే ముందుకు పోవాలని సూచించింది. 


 

తెలంగాణ న్యూస్ : 


  • మూడో విడత రైతు రుణమాఫీ నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. నేడు రైతుల ఖాతాల్లో నగదు జమ కానున్నట్లు సీఎం తెలిపారు. ఈ విడతలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల రుణమాఫీ కానుంది. దీంతో 14 లక్షల 45వేల మంది రైతులకు లాభం చేకూరనుంది. 

  • తెలంగాణలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


జాతీయ వార్తలు : 


  • భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కాసేపట్లో భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-08ని నింగిలోకి పంపనుంది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని ఎస్ఎస్ఎల్వీ-డీ3 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఈవోఎస్–08 ఉపగ్రహాన్ని మోసుకెళ్లే SSLV-D3 రాకెట్ ఆగస్టు 16న ఉదయం 9.17 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. 

  • కేంద్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. చీడపీడల నివారణ సలహాలు, సూచనలు అందించేలా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, డీపీపీక్యూఎస్, ఐసీఏఆర్‌ శాస్త్రవేత్తల సహకారంతో నేషనల్‌ పెస్ట్‌ సర్వైలెన్స్‌ సిస్టం యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. 


అంతర్జాతీయ వార్తలు : 


  • ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ విజృంభిస్తోంది. ఈ వైరస్ కారణంగా కాంగోలో ఈ ఏడాదిలో ఇప్పటివరకే దాదాపు 548 మంది మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను ‘‘ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి’’గా ప్రకటించింది.

  • ఇజ్రాయెల్‌పై యుద్ధం విషయంలో ఇరాన్ సుప్రీం లీడర్‌ అయాతొల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌పై యుద్ధానికి వెనక్కి తగ్గితే.. దైవాగ్రహం తప్పదని అన్నారు. ప్రతీకారం విషయంలో వెనక్కి తగ్గినా.. రాజీపడినా దైవాగ్రహానికి గురికాక తప్పదని ఇరానీయులను హెచ్చరించారు. 


క్రీడలు : 


  • పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున ఆడిన క్రీడాకారుల బృందాన్ని ప్రధాని మోదీ అభినందించారు. ప్రధాని తన నివాసంలో క్రీడాకారులను కలిసి వారితో మాట్లాడారు. ఒలింపిక్స్‌లో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షూటర్‌ మను బాకర్‌ పతకం సాధించిన తన పిస్టల్‌ను ప్రధానికి చూపించింది. 


 

మంచిమాట

మనకు లభించే చిన్న అవకాశాలే... భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి.