Antidepressants Side Effects Weight Gain And Other: తీవ్రమైన డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి సైకియాట్రిస్టులు యాంటీడిప్రెసెంట్లను సూచిస్తుంటారు. ఇవి మానసిక స్థితిని మెరుగుపరిచినప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు తప్పకుండా ఉంటాయి. ఈ మందులు వాడే ముందు దుష్ప్రభావాల గురించిన అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. వీటి ప్రభావం ఎలాంటి మందులు వాడుతున్నాం, ఎంత మోతాదులో వాడుతున్నాం, ఆ మందులకు ఎలాంటి ప్రతిస్పందనలు ఉంటున్నాయన్న దానిమీద ఆధారపడి ఉంటుంది. ఒక్కోరకం మందుల దుష్ప్రభావం ఒక్కోరకంగా ఉండొచ్చు. ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో తెలుసుకుందాం.
వికారం, జీర్ణ సమస్యలు
యాంటీ డిప్రెసెంట్స్ వాడే వారిలో తరచుగా కనపించే దుష్ప్రభావం వికారం. ముఖ్యంగా చికిత్స మొదలు పెట్టిన తొలిరోజుల్లో కొంత మంది విరేచనాలు, మలబద్దకం, కడుపులో క్రాంప్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే రోజులు గడిచేకొద్దీ ఈ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. కానీ కొంత మందిలో మాత్రం ఇవి దీర్ఘకాలం పాటు వేధించవచ్చు.
బరువు పెరగడం
కొంత మందిలో శరీర బరువు పెరుగే ప్రమాదం ఉంటంది. ముఖ్యంగా సెలెక్టివ్ సెరోటినిన్ రీ ఆప్టెక్ ఇన్హిబీటర్స్, ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ వంటి యాంటీ డిప్రెసెంట్స్ తో బరువు పెరగవచ్చు. బరువు పెరగడానికి ఆకలి పెరగడం, జీవక్రియల్లో వచ్చిన మార్పులు, శరీరంలో ఫ్లూయిడ్స్ నిలిచిపోవడం వంటి కారణాలు ఉండవచ్చు. ఇప్పటికే అతి బరువు తో బాధపడుతున్న వారికి ఈ సమస్య మరింత బాధాకరం అవుతుంది.
లైంగిక పటుత్వం తగ్గడం
ఈ సమస్య స్త్రీ పురుషులిద్దరినీ ప్రభావితం చెయ్యవచ్చు. యాంటీ డిప్రెసెంట్లు వాడేవారిలో చాలా మందిలో ఈ సమస్య సర్వసాధారణం. ఈ మందుల ప్రభావం వల్ల కోరిక తగ్గడం, లైంగిక తృప్తి లేకపోవడం, పరుషుల్లో అంగస్థంభన సమస్యలు వేధిస్తాయి. ఈ సమస్యలతో దాంపతుల మధ్య అనుబంధం మీద, జీవన నాణ్యత మీద ప్రభావం చూపుతాయి. మందులు మార్చడం లేదా డోసేజుల్లో మార్పులు చేస్తే ఇవి తగ్గుముఖం పడుతాయి.
నీరసం
కొన్ని యాంటీడిప్రెసెంట్స్ మూడ్ ని ఉత్తేజితం చేస్తాయి. కొన్నింటి వల్ల నీరసంగా, మగతగా ఉండే ప్రమాదం ఉంటంది. ఈ దుష్ప్రభావాలతో ఏకాగ్రత తగ్గడం మాత్రమే కాదు రోజూ వారీ జీవితం మీద చాలా ప్రభావాన్ని చూపుతాయి.
నిద్ర లేమి
కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్లు స్టిమ్యూలేటింగ్ లక్షణాలు కలిగి ఉంటాయి. వీటి వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. నిద్ర లేమి మరింత ఎక్కువ డిప్రెషన్ కు కారణం కాగలదు. కనుక యాంటీడిప్రెసెంట్లు వాడే వారు నిద్రలేమి సమస్యతో బాధ పడుతుంటే మాత్రం తప్పకుండా వారి డాక్టర్ తో చర్చించాలి. మందులు మార్చే అవకాశం ఉంటుంది.
సెరెటోనిన్ సిండ్రోమ్
కొన్ని మందులతో సెరెటోనిన్ స్థాయిలు పెరిగి పోతే ప్రాణాంతక స్థితి కలుగవచ్చు. కన్ఫ్యూజన్, గుండెదడ, బీపీ పెరగిపోవడం వల్ల ప్రాణాలు ప్రమాదంలో పడవచ్చు. వెంటనే డాక్టర్ ను సంప్రదించడం అవసరమవుతుంది.
ఇవే కాదు కంటి చూపు మసకబారడం, కళ్లు తిగిగినట్లు ఉండడం, ఆందోళన పెరగడం, చెమట పట్టడం, మూర్ఛ, ఆత్మహత్య ఆలోచనల వంటి ఇతర దుష్ప్రభావాలు కూడా కనిపించవచ్చు. ఇలాంటి దుష్ప్రభావాల్లో ఏవి కనిపించినా వెంటనే డాక్టర్ ను సంప్రదించి మందులు మార్చుకోవడం లేదా మోతాదుల్లో మార్పులు చేసుకోవడం అవసరమని గుర్తించాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి... ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు 'ఏబీపీ దేశం', 'ఏబీపీ నెట్‌వర్క్' ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు..