NOTA Votes: ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. నోటా ఓట్లు ఎక్కువగా వచ్చిన నియోజకవర్గంలో ఎన్నికలు రద్దు చేసి మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణలో భాగంగానే సుప్రీంకోర్టు ఈసీకి నోటీసులు జారీ చేసింది. నోటాకి సంబంధించిన రూల్స్‌ని మరోసారి పరిశీలించాలని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. మోటివేషనల్ స్పీకర్, రచయిత శివ ఖేరా ఈ పిటిషన్ వేశారు. నోటా కన్నా తక్కువ ఓట్లు పోల్ అయిన అభ్యర్థిని మరో ఐదేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా ఆంక్షలు విధించాలనీ ఇందులో ప్రస్తావించారు పిటిషనర్. ఇందుకోసం ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించాలని కోరారు.


ఖేరా తరపున వాదించిన సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకరనారాయణ్ కోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల గుజరాత్‌లోని సూరత్‌లో ప్రత్యర్థులందరూ పోటీ నుంచి తప్పుకోవడం వల్ల బీజేపీ అభ్యర్థి గెలిచినట్టుగా అధికారులు ప్రకటించారు. దీన్నే కోర్టులో ప్రస్తావించారు అడ్వకేట్. మరో ఆప్షన్ లేకుండా అందరూ ఆ వ్యక్తినే ఎన్నుకోవాల్సిన పరిస్థితి కల్పించడంపై అసహనం వ్యక్తం చేశారు. అభ్యర్థి ఒక్కరే ఉన్నప్పటికీ అక్కడ ఎన్నికలు నిర్వహించాలని, నోటా హక్కుని వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఎన్నికల సంఘానికి నోటాకి పవర్ ఏంటో అర్థం కావడం లేదని, ఈ హక్కుని కల్పించడంలోనూ విఫలమవుతోందని పిటిషనర్‌ ఆరోపించారు. 


"ఈవీఎమ్‌లలో NOTA ఆప్షన్ ఓ వ్యక్తిని తిరస్కరించే హక్కుని కల్పిస్తుంది. ఎన్నికల ప్రక్రియలో ఇది కూడా ఓ భాగమే. ఓ అభ్యర్థి నచ్చనప్పుడు వాళ్లని తిరస్కరించే అవకాశం కల్పించాల్సిందే. నోటా అనేది రాజకీయ పార్టీలు సమర్థవంతమైన అభ్యర్థులను మాత్రమే బరిలోకి దింపేందుకు తోడ్పడుతుంది. చాలా మంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉంటోంది. అలాంటి సమయంలో ఓటర్లు ఏం చేయగలరు..? అలాంటప్పుడు ఓటరు చేతిలో ఉన్న ఆయుధమే ఈ నోటా"


-  పిటిషనర్ 


నోటా అంటే ఏంటి..?


2013లో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఓటర్లకు అభ్యర్థులు ఎవరూ నచ్చని సమయంలో "None Of The Above" ఆప్షన్‌ని ఎంచుకునే హక్కు ఓటర్లకు కల్పించాలని తేల్చి చెప్పింది. అంతే కాదు. EVMలలో NOTA బటన్‌నీ చేర్చాలని చెప్పింది. నిజానికి ఓట్ల లెక్కింపు సమయంలో ఈ నోటా ఓట్లకు ఎలాంటి విలువ ఉండదు. ఫలితాలకు వీటికి సంబంధం ఉండదు. కానీ..నోటా ఆప్షన్ వల్ల ఓ అభ్యర్థిని ఎంత మంది తిరస్కరించారనేది తెలుసుకోవచ్చు. ఆ అభ్యర్థిని మరోసారి ఎన్నికల బరిలోకి దింపకుండా రాజకీయ పార్టీలు అప్రమత్తం అవడానికి వీలుంటుంది. అంటే...ప్రజాస్వామ్యంలో ఓ వ్యక్తిని ఎన్నుకునే హక్కుతో పాటు తిరస్కరించే హక్కు కూడా ఉండాలన్నదే ఈ నోటా ఉద్దేశం. ఓ అభ్యర్థికి ఎన్ని నోటా ఓట్లు వచ్చినా,  సాధారణ ఓట్లు ఎక్కువగా వస్తే గెలిచినట్టే లెక్క. అంటే...నోటాకి ఎలాంటి విలువ ఉండదు. అయితే...పోల్ అయ్యే ఓట్ల మార్జిన్‌పైన మాత్రం ఈ నోటా ఓట్లు ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయి. 


Also Read: ఈవీఎమ్‌ల పని తీరుపై కవిత్వం చెప్పిన ఈసీ, 100% సేఫ్ అంటూనే కీలక వ్యాఖ్యలు