EVM VVPAT Verification Case: ఈవీఎమ్,వీవీప్యాట్‌లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ వీటి పని తీరుని ప్రశ్నిస్తూ దాఖలైన అన్ని పిటిషన్‌లనూ తిరస్కరించింది. వ్యవస్థను గుడ్డిగా అనుమానించడం సరికాదని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో ఎన్నికల సంఘానికి కీలక సూచనలు చేసింది. అయితే...ఈ మొత్తం విచారణలో సరైన విధంగా వాదించడం వల్లే తమకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఎన్నికల సంఘం భావిస్తోంది. అయితే ఎప్పటి నుంచో సీఈసీ రాజీవ్ కుమార్ EVMల పని తీరుపై ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని మరోసారి స్పష్టమైందని వెల్లడించారు. మార్చి 16వ తేదీన లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ని విడుదల చేసిన సమయంలోనే కోర్టులు EVMల పనితీరుని దాదాపు 40 సార్లు సమర్థించాయని గుర్తు చేశారు. అప్పటి వరకూ నమోదైన కేసులను ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 


"ఇప్పటి వరకూ EVMలను సవాల్ చేస్తూ హైకోర్టులు, సుప్రీంకోర్టు 40 పిటిషన్‌లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ కోర్టులు పరిశీలించాయి. ఆ పిటిషన్‌లను కొట్టి వేశాయి. మా ఈసీకి సంబంధించిన బుక్‌లోనూ ఈ కేసుల వివరాలను పొందుపరిచాం. వెబ్‌సైట్‌లోనూ ఈ వివరాలున్నాయి. ఇవి చదివితే చాలు ఈవీఎమ్‌లు ఎలా పని చేస్తాయో తెలుసుకోవచ్చు"


- రాజీవ్ కుమార్, సీఈసీ


EVMలను ప్రవేశపెట్టిన తరవాతే అధికార పార్టీలు ఎక్కువ సార్లు ఓడిపోయిన సందర్భాలున్నాయని రాజీవ్ కుమార్ అప్పట్లోనే స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్‌ల వద్దే ఆగిపోయి ఉంటే ఇన్ని రాజకీయ పార్టీలు ఏర్పాటయ్యేవే కాదని తేల్చి చెప్పారు. ఇందులో పారదర్శకత ఉంది కాబట్టే అందరూ విశ్వసిస్తున్నారని వెల్లడించారు. ఈవీఎమ్‌లు 100% సురక్షితం అని చెప్పారు. అంతే కాదు. ఈవీఎమ్‌ల పని తీరుని డిఫెండ్ చేసుకుంటూ ఎన్నికల సంఘం ఓ కవిత్వం కూడా చెప్పింది. 


"ఈవీఎమ్‌కి మాటలు వస్తే ఏం చెబుతుందో తెలుసా..? నాపై ఎంత మంది ఎన్ని నిందలు వేసినా సరే నేను మాత్రం నిజాయతీగా పని చేశాను అంటుంది"


- ఎన్నికల సంఘం 


సుప్రీంకోర్టు ఏం చెప్పింది..?


వీవీప్యాట్‌ల స్లిప్‌లను EVMలతో 100% మేర సరిపోల్చాలని అప్పుడే ఫలితాలు పారదర్శకంగా ఉన్నట్టు నమ్మొచ్చని సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. అంతే కాదు. బ్యాలెట్ పేపర్‌ పద్ధతిలోనే ఎన్నికలు జరపాలనీ అందులో ప్రస్తావించారు పిటిషనర్‌లు. అయితే...సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌లను కొట్టేసింది. బ్యాలెట్‌ పేపర్‌ పద్ధతిలో ఎన్నికలు జరపాలన్న పిటిషన్‌ని తిరస్కరించింది. ఈ ప్రక్రియలో కోర్టు జోక్యం చేసుకోదని తేల్చి చెప్పింది. అంతే కాదు. ఓ వ్యవస్థను ఇలా అనుమానించడం సరికాదని పిటిషనర్లను మందలించింది. 100% వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించడం కుదరదని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో ఎన్నికల సంఘానికీ కీలక సూచనలు చేసింది. ఫలితాలు వెలువరించిన తరవాత ఈవీఎమ్‌లోని సింబల్ లోడింగ్ యూనిట్స్‌ని జాగ్రత్తపరచాలని వెల్లడించింది. వాటిని సీల్ చేయాలని స్పష్టం చేసింది. అభ్యర్థులు ఆ సీల్‌పై సంతకం పెట్టాలని తెలిపింది. ఈ సింబల్ లోడింగ్ యూనిట్స్‌ ఉన్న కంటెయినర్స్‌ని ఈవీఎమ్‌లతో పాటు స్టోర్‌రూమ్‌లో భద్రపరచాలని వివరించింది. ఫలితాలు విడుదలైన తరవాత కనీసం 45 రోజుల పాటు వాటిని అలాగే రూమ్‌లో ఉంచాలని సూచించింది. 


Also Read: Lok Sabha Election 2024 Phase 2: కొనసాగుతున్న రెండో దశ పోలింగ్, బరిలో రాహుల్ గాంధీ సహా కీలక అభ్యర్థులు