Bisma Maruf has announced her retirement from cricket: పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు(Pakistan Cricket) మాజీ కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్(Bisma Maruf)... సుదీర్ఖ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించి 32 ఏళ్ల మరూఫ్ ఆశ్చర్యపరిచారు. టీ 20 ప్రపంచకప్‌నకు ముందు మరూఫ్ రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ ప్రపంచాన్ని విస్మయపరిచింది. పాక్ తరపున ఎనిమిది వరల్డ్ కప్‌లు ఆడిన మరూఫ్ సెంచరీ కల నెరవేరకుండానే వీడ్కోలు పలికింది. మరూఫ్ సంచలన నిర్ణయంతో పాక్ క్రికెట్ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది.
భావోద్వేగ పోస్ట్
తాను చాలా ఇష్టపడే ఆట నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నానని మరూఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సవాళ్లు, విజయాలు, మరపురాని జ్ఞాపకాలతో నిండిన అద్భుతమైన ప్రయాణం ముగిసిందని భావోద్వేగానికి గురైంది. మొదటి నుంచి ఇప్పటి వరకు తన క్రికెట్ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి, తన ప్రతిభను ప్రదర్శించేందుకు వేదికను అందించినందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కూడా మరూఫ్ కృతజ్ఞతలు తెలిపారు. తల్లిగా ఉంటూనే అత్యున్నత స్థాయిలో నా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కలిగిందని మరూఫ్ భావోద్వేగానికి గురైంది.
పదేళ్లలోనే కెప్టెన్..
మరూఫ్ 2006లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. తన సంచలన బ్యాటింగ్, చెక్కుచెదరని పట్టుదతో పదేళ్లలోనే కెప్టెన్ స్థాయికి ఎదిగింది. 2016లో టీ20 పగ్గాలు, ఆ మరుసటి ఏడాదే వన్డే సారథిగా ఎంపికైంది. ఆమె కెప్టెన్సీలో పాక్ 34 వన్డేల్లో, 64 టీ20ల్లో జయభేరి మోగించింది. మరూఫ్ నేతృత్వంలోని పాక్ 2010, 2014 ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం కొల్లగొట్టింది.
ఇది కెరీర్
2006లో పాకిస్థాన్ తరపున అరంగేట్రం చేసిన బిస్మా మరూఫ్.. అద్భుతమైన కెరీర్‌ను కలిగి ఉంది. వన్డేలు, T20లలో జట్టుకు అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌గా నిలిచింది. మరూఫ్ ODI ఫార్మాట్‌లో 136 మ్యాచ్‌లు ఆడి 3369 పరుగులు చేసింది. ఇందులో 21 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో ఆమె టీ20లో 140 మ్యాచ్‌లలో 2893 పరుగులు చేసింది. ఈ సమయంలో ఆమె 12 అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లు కూడా ఆడింది. మరూఫ్ లెగ్ బ్రేక్ బౌలర్‌గా వన్డేల్లో 44 వికెట్లు, టీ20ల్లో 36 వికెట్లు పడగొట్టింది. బిస్మా 96 మ్యాచ్‌లకు పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. ఈ కాలంలో 62 టీ20ల్లో 27 విజయాలు, 34 వన్డేల్లో 16 విజయాలు సాధించింది. టీ20ల్లో, మరూఫ్ కంటే సనా మీర్ (65) మాత్రమే ఎక్కువ కెప్టెన్సీ క్యాప్‌లను కలిగి ఉంది. వన్డేల్లో ఆమె మీర్ (72), షైజా ఖాన్ (39) తర్వాత జాబితాలో మూడో స్థానంలో ఉంది.