Bengaluru remains 10th despite win vs Hyderabad: వరుస పరాజయాలతో తీవ్ర నిర్వేదంలో కూరుకుపోయిన రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB)కు ఓదార్పు  విజయం దక్కింది. హైదరాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదారాబాద్‌(SRH)పై బెంగళూరు విజయం సాధించింది. తొలుత బ్యాట్‌తో.. తర్వాత బంతితో రాణించిన బెంగళూరు ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రెండో విజయం నమోదు చేసింది. అయితే ఈ విజయంతో బెంగళూరు ప్లే ఆఫ్‌ ఆశలు ఏమైనా మెరుగయ్యాయేమో అని ఆ  జట్టు అభిమానులు వెతుకుతున్నారు. 

 

గెలిచినా కష్టమే 

హైదరాబాద్‌పై బెంగళూరు 35 పరుగుల తేడాతో గెలిచినా పాయింట్ల పట్టికలో మాత్రం ఏ మార్పు లేదు. గెలిచినా పాయింట్ల పట్టికలో మాత్రం చివరి స్థానంలోనే ఉంది. ఇప్పటివరకూ ఐపీఎల్‌ చరిత్ర చూసుకుంటే కనీసం 8 మ్యాచులు గెలిచిన జట్లు క్వాలిఫైయర్స్ కి అర్హత సాధించాయి. 8 మ్యాచ్ లు గెలిస్తే 16 పాయింట్లు ఉంటాయి. అప్పుడప్పుడూ 7 మ్యాచ్ లు గెలిచిన జట్లు కూడా 14పాయింట్లతో క్వాలిఫైయర్స్ కి వెళ్లాయి. ఈ ఐపీఎల్‌లో బెంగళూరు ఇప్పటికే తొమ్మిది మ్యాచులు ఆడేసింది. ఇంకా అయిదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఒకవేళ బెంగళూరుకు మిణుకుమిణుకుమంటున్న ఆశలైనా సజీవంగా ఉండాలంటే మిగిలి ఉన్న ఈ అయిదు మ్యాచుల్లోనూ గెలవాలి. అప్పుడు వారికి లభించి 12పాయింట్లు... ఇప్పటికే ఉన్న రెండు పాయింట్లు కలిపి 14పాయింట్లు అవుతాయి. ఇదే టైమ్ లో ఇప్పుడు టాప్ 4లో ఉన్న రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లు ఓడిపోవాలి. అది కూడా పంజాబ్, ఢిల్లీ, ముంబై , లక్నో చేతుల్లో అవి చిత్తు చిత్తుగా ఓడిపోవాలి. అప్పుడు 14 పాయింట్లతో క్వాలిఫైయర్స్ కి వెళ్లేందుకు కనీసం ఒక్క టీమ్ కైనా ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఛాన్స్ లో నిలబడే అర్హత బెంగుళూరు సాధించాలి. ఇప్పుడు బెంగుళూరు రన్ రేట్ -0.721 ఉంది కాబట్టి..ఆర్సీబీ గెలవబోయే అయిదు మ్యాచుల్లోనూ బీభత్సమైన రన్ రేట్ సంపాదించుకోవాలి. అప్పుడు 14పాయింట్లతో క్వాలిఫైయర్స్ కి వెళ్లే ఒక్క జట్టుగా ఆర్సీబీ నిలిస్తే చాలు..ఈ సాలా కప్ నమ్మదే. కానీ ఇది జరగాలంటే బెంగళూరు అద్భుతాన్ని సృష్టించాలి. 

 

రెండో విజయం

ఈ ఐపీఎల్‌(IPL)లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరుకు(RCB)  ఎట్టకేలకు ఓ విజయం దక్కింది. హైదరాబాద్‌(SRH)ను సొంత గడ్డపై ఓడించి బెంగళూరు ఈ ఐపీఎల్ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లో తొలిసారిగా బెంగళూరు బౌలర్లు ఈ మ్యాచ్‌ రాణించారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తేలిపోయింది. బెంగళూరు బౌలర్లు సమష్టిగా రాణించడంతో హైదరాబాద్ జట్టు 171 పరుగులకే కుప్పకూలింది. దీంతో 35 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది.