Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ (Lok Sabha Election 2024 Phase 2) కొనసాగుతోంది. 13 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయాలు వేడెక్కిన సమయంలోనే ఈ విడత పోలింగ్ జరుగుతుండడం ఆసక్తికరంగా మారింది. కేరళలో అన్ని చోట్లా ఇదే విడతలో ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఇక రాజస్థాన్, యూపీలో కొన్ని స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. కేరళలో 0 నియోజకవర్గాలకు, కర్ణాటకలో 14, రాజస్థాన్‌లో 13,యూపీ, మహారాష్ట్రలో 8, మధ్యప్రదేశ్‌లో 7 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. వీటితో పాటు అసోంలో 5, బిహార్‌లో 5, బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లో 3,జమ్ము కశ్మీర్, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో ఒక్కో స్థానంలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నాటికి అన్ని చోట్లా 9.3% పోలింగ్ నమోదైంది. నిజానికి 89 నియోజకవర్గాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ...మధ్యప్రదేశ్‌లో బేతుల్‌లో BSP అభ్యర్థి మృతి చెందడం వల్ల అక్కడ పోలింగ్‌ని రీషెడ్యూల్ చేశారు. ఫలితంగా 88 స్థానాలకే ప్రస్తుతం పోలింగ్ జరుగుతోంది.
కీలక అభ్యర్థులు వీళ్లే..
ఈ విడతలో ఎంతో మంది కీలక నేతలు బరిలో ఉన్నారు. వారిలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. కేరళలోని వయనాడ్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. కేసీ వేణుగోపాల్, భూపేష్ భగేల్, అశోక్ గహ్లోట్ కొడుకు వైభవ్ గహ్లోట్, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఇదే విడతలో బరిలో ఉన్నారు. వీళ్లతో పాటు తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పోటీ చేస్తున్నారు. సినీ నటి హేమ మాలిని, నటుడు అరుణ్ గోవిల్ కూడా ఇదే విడతలో పోటీలో ఉన్నారు. ఈ 13 రాష్ట్రాల్లో దక్షిణాదిన ఉన్న కర్ణాటక, కేరళపైనే బీజేపీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. కర్ణాటకలోని 28 లోక్‌సభ నియోజకవర్గాల్లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 25 చోట్ల విజయం సాధించింది. కానీ...గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇవే ఫలితాలు లోక్‌సభ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని కాంగ్రెస్ చాలా ధీమాగా చెబుతోంది. ఇక కేరళ విషయానికొస్తే...అక్కడ ఖాతా తెరవలేకపోతోంది బీజేపీ. ఈసారి ఎలాగైనా ఉనికి కాపాడుకోవాలని చూస్తోంది. ఇద్దరు కేంద్రమంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, వి మురళీధరన్ ఇక్కడి నుంచే బరిలోకి దిగారు. కాంగ్రెస్‌కి కంచుకోటగా ఉన్న వయనాడ్‌లో రాహుల్‌కి ప్రత్యర్థిగా బీజేపీ చీఫ్ కే సురేంద్రన్ పోటీ చేస్తున్నారు.
ఇక దేశ రాజకీయాల్లో అలజడి కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదనంతా దోచుకుని ముస్లింలకు పంచి పెడుతుందంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అటు కాంగ్రెస్ నేత శ్యాం పిట్రోడా వారసత్వ పన్ను గురించి చేసిన వ్యాఖ్యలూ సంచలనమయ్యాయి. ఇలా బీజేపీ, కాంగ్రెస్ మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలోనే రెండో దశ ఎన్నికలు జరుగుతుండడం ఆసక్తికరంగా మారింది. 400 సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ వీలైనంత వరకూ కాంగ్రెస్ గత వైఫల్యాలని ప్రస్తావిస్తూ ఆ పార్టీని డిఫెన్స్‌లో పడేస్తోంది.
Also Read: ఇలా అయితే ఇండియా నుంచి వెళ్లిపోతాం, ఐటీ రూల్స్‌పై వాట్సాప్ తీవ్ర అసహనం