Electoral Bonds Details Deadline: ఇటీవల సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. వాటిని రద్దు చేయాలని తేల్చి చెప్పింది. వీటి విక్రయాలు ఇప్పటికిప్పుడే నిలిపివేయాలని ఆదేశించింది. నల్లధనం నిర్మూలనకు ఇదొక్కటే మార్గం కాదని స్పష్టం చేసింది. అయితే...SBI ఈ బాండ్స్ విక్రయాలకు సంబంధించి పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. మార్చి 6వ తేదీలోగా ఇది పూర్తి చేయాలని చెప్పింది. ఈ గడువులోగా వివరాలు ఇవ్వలేదంటూ SBIపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. Association of Democratic Reforms (ADR) ఈ పిటిషన్ వేసింది. SBI సహా కేంద్ర ప్రభుత్వం కూడా కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించలేదని ఆరోపించింది. అటు SBI మాత్రం జూన్ 30 వరకూ ఈ గడువుని పొడిగించాలని కోర్టుకి విజ్ఞప్తి చేసింది. ఈ వివరాలు వెల్లడించడంలో కొన్ని సమస్యలున్నాయని, వాటన్నింటినీ పరిష్కరించుకుని జూన్ 30లోగా ఇస్తామని వివరించింది. కానీ...ADR మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని మండి పడుతోంది. ఇది కేవలం సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే కాదని, కోర్టునీ ధిక్కరించినట్టవుతుందని అసహనం వ్యక్తం చేస్తోంది.
రాజ్యాంగ విరుద్ధం అన్న సుప్రీంకోర్టు..
ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది. ఆర్టికల్ 19(1)(ఏ)తో పాటు సమాచార హక్కు చట్టానికి ఇవి విఘాతం కల్గిస్తున్నాయని స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. నల్లధనం నిర్మూలనకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదని వెల్లడించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకోకి దారి తీస్తుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఇది కచ్చితంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్‌లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై విచారణ పూర్తైన సందర్బంగా ఈ తీర్పు వెలువరించింది. ఈ బాండ్స్‌ని విక్రయించకూడదని ఆదేశించింది. విరాళాలిచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదని మందలించింది. ఎన్నికల కమిషన్, SBI తమతమ వెబ్‌సైట్‌లలో ఈ వివరాలు పొందుపరచాలని తేల్చి చెప్పింది ధర్మాసనం. పార్టీలకు వచ్చిన నిధులు ఎవరు ఇచ్చారో తెలియాలని వెల్లడించింది.
2018లో తీసుకొచ్చిన కేంద్రం..
2018లో జనవరిలో కేంద్ర ప్రభుత్వం Electoral Bond Schemeని తీసుకొచ్చింది. రాజకీయ పార్టీకి కానీ...ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులకు కానీ విరాళాలు అందించాలంటే ఈ బాండ్‌లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్‌ల ద్వారానే ఆయా పార్టీలు లేదా వ్యక్తులు విరాళాలు తీసుకోవచ్చు. బ్లాక్ మనీని అడ్డుకునేందుకు ఈ స్కీమ్ తీసుకొచ్చామని కేంద్రం చెప్పినప్పటికీ కొందరు దీన్ని సవాల్ చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వీటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఇలా తీర్పునిచ్చింది.
Also Read: Rameswaram Cafe: రామేశ్వరం కేఫ్ బాంబు దాడి నిందితుడి గుర్తింపు - దర్యాప్తు అధికారులకు కీలక ఆధారాలు