SBI Business Scheme: ద్రవ్యోల్బణం దడ పుట్టిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, రెండు చేతులా సంపాదించినా నెలాఖరుకు ఖాళీ జేబు మాత్రమే కనిపిస్తోంది. అందుకే, నెలకు కాస్త ఎక్కువ మొత్తం వచ్చే మార్గాల కోసం అందరూ అన్వేషిస్తున్నారు. ఈ మార్గాల్లో వ్యాపారం ఒకటి. వ్యాపారం చేయడం అంత సులభం కాదు. చాలా ఓపిక, శ్రమ, పట్టుదల అవసరం. అసలు ఏ పనీ చేయాల్సిన అవసరం లేకుండా, చిన్నపాటి వన్ టైమ్ పెట్టుబడితో నెలనెలా పెద్ద మొత్తంలో సంపాదించే ఉపాయం ఉందా..?, ఖచ్చితంగా అలాంటి మార్గం ఒకటి ఉంది. 


దాదాపు రూ.5 లక్షల పెట్టుబడితో నెలకు రూ.60,000 నుంచి రూ.70,000 వరకు సంపాదించే ఉపాయం ఒకటుంది. అదే.. ఎస్‌బీఐ ఏటీఎం ఫ్రాంచైజీ (SBI ATM franchise‌).


మీరు నెలలో ఒక్కసారైనా ATMకు వెళ్తుంటారు కదా. వాటిని, ఆ బ్యాంక్‌ వాళ్లే ఏర్పాటు చేశారని మీరు అనకుంటూ ఉండవచ్చు. కానీ అలా కాదు. ఆ ATMలను ఇన్‌స్టాల్ చేసేందుకు విడిగా కొన్ని కంపెనీలు పని చేస్తుంటాయి. ఆ కంపెనీలే వివిధ ప్రాంతాల్లో ATMలను ఏర్పాటు చేస్తుంటాయి.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) విషయానికి వస్తే... మన దేశంలో ATMల ఏర్పాటుకు టాటా ఇండిక్యాష్ (Tata Indicash), ముత్తూట్ ఏటీఎం (Muthoot ATM), ఇండియా వన్ ఏటీఎంతో (India One ATM) బ్యాంక్‌ ఒప్పందం కుదుర్చుకుంది. 
మీకు కూడా ఇలాంటి బంగారు అవకాశం అందుబాటులో ఉంది. మీరు SBI ATM ఫ్రాంచైజీని తీసుకోవాలనుకుంటే, మీరు ఈ కంపెనీలను సంప్రదించాలి. ఆయా కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ATM ఫ్రాంచైజీ పేరుతో మోసం చేస్తున్నవాళ్లు కూడా ఆన్‌లైన్‌లో చాలామంది తగులుతుంటారు. అలాంటి వాళ్లు ఇట్టే ఆకర్షించే ప్రకటనలు, వాగ్దానాలు చేస్తుంటారు. వాళ్ల గేలాలకు చిక్కి మీరు చేపల కూర అయిపోవద్దన్నది మా విజ్ఞప్తి. కాబట్టి, కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోండి.


SBI ATM ఫ్రాంచైజీ తీసుకోవడానికి నిబంధనలు


దరఖాస్తు చేసుకోవడానికి ముందు, ఈ నిబంధనల ప్రకారం మీ దగ్గర అన్నీ ఉండేలా చూసుకోండి. 


* ATM క్యాబిన్‌ను ఏర్పాటు చేయడానికి కనీసం 50-80 చదరపు అడుగుల స్థలం ఉండాలి. 
* ఇతర ATMల నుంచి అది కనీసం 100 మీటర్ల దూరంలో ఉండాలి.
* క్యాబిన్‌ లొకేషన్ ప్రజలకు సులభంగా కనిపించేలా ఉండాలి. 
* 24 గంటల విద్యుత్ సరఫరా ఉండాలి. కనీసం 1kW విద్యుత్ కనెక్షన్ కూడా తప్పనిసరి.
* ఇటుక గోడలు, కాంక్రీట్ పైకప్పుతో అది శాశ్వత నిర్మాణమై ఉండాలి. 
* ఒకవేళ మీరు సొసైటీలో నివసిస్తుంటే, V-SATని ఇన్‌స్టాల్ చేయడానికి మీరు సొసైటీ నుంచి NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) తీసుకోవలసి ఉంటుంది.


SBI ATM ఫ్రాంచైజీకి అవసరమైన పత్రాలు


* వ్యక్తిగత గుర్తింపు - ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్
* చిరునామా రుజువు - రేషన్ కార్డ్, విద్యుత్ బిల్లు
* బ్యాంక్ ఖాతా, పాస్‌బుక్
* పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్‌
* GST నంబర్‌
* కంపెనీ కోరిన ఇతర పత్రాలు


SBI ATM ఫ్రాంచైజీ నుంచి సంపాదన
మీరు SBI ATM ఫ్రాంచైజీకి దరఖాస్తు చేసిన తర్వాత అధికారిక సంస్థ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తే... మీరు సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.2 లక్షలు, వర్కింగ్ క్యాపిటల్‌గా రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం పెట్టుబడి రూ.5 లక్షలు, కంపెనీని బట్టి ఇది కొంత మారుతుంది. ATM ప్రారంభమై ప్రజలు లావాదేవీలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి మీ చేతికి డబ్బు రావడం మొదలవుతుంది. ప్రజలు చేసే ఒక్కో నగదు లావాదేవీ మీద 8 రూపాయలు; నగదు నిల్వ తనిఖీ, నగదు బదిలీ  వంటి నగదు రహిత లావాదేవీ మీద 2 రూపాయల చొప్పున మీకు అందుతాయి. మీరు ప్రారంభించిన ATM ప్రజల రాకపోకలకు సౌలభ్యంగా ఉంటే చాలు, మీరు ఏ శ్రమ చేయాల్సిన అవసరం లేకుండానే నెలకు పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు.